Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిఘా ఆరోపణలు తీవ్రమైతే..
- పెగాసస్సై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పెగాసస్ నిఘా వ్యవహారంలో నిజం బయటకు రావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరులు, జర్నలిస్టులు, మంత్రులు, ఎంపీలు, సామాజిక కార్యకర్తలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌ను వినియోగిస్తోందన్న ఆరోపణలు నిజమైతే 'నిస్పందేహంగా తీవ్రమైందే' అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి.రమణ, జస్టిస్ సూర్యకాంతలతో కూడిన ధ్విసభ్య ధర్మాసనం పేర్కొంది. దేశంలో ప్రకంపనలు సష్టిస్తున్న పెగాసస్ స్పైవేర్ అంశంపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పెగాసస్‌పై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు నిజమైనవే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైంది అంటూ విచారణలో భాగంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సొలిసిటర్ జనరల్‌కు అందించాలని న్యాయస్థానం సూచించింది. దీనిపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం తరపున ఎవరైనా ప్రతినిధులు తప్పక విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే న్యాయస్థానం అధికారికంగా కేంద్రానికి నోటీసులు జారీచేయలేదు. '' కొంతమంది పెగాసస్‌తో పాటు టెలిగ్రాఫ్ చట్టం, పలు ఇతర అంశాలను కూడా సవాల్ చేస్తూ తమ పిటిషన్‌ను విస్తృతం చేశారు.అనేక సమస్యలు ఉన్నాయి.. ఏం అంశంపై నోటీసులు జారీచేయాలో చూడాల్సి ఉంది'' అని సీజేఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెగాసస్ నిఘా భాగోతంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపి జాన్ బ్రిట్టాస్‌తో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఎల్.శర్మ, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్, మరో ఐదుగురు జర్నలిస్టులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పిటిషన్‌దారులకు పలు ప్రశ్నలు సంధించింది. మెజార్టీ పిటిషన్లు విదేశీ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా దాఖలయ్యాయని, పెగాసస్ ఆరోపణలపై తాము విచారణకు ఆదేశించగల ఇతర ధ్రువీకరించదగిన అంశాలు' ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించింది. '' అంటే ప్రచారం ఆధారంగా మీరు పిటిషన్ వేశారని, ఇందులో ఎటువంటి మెటీరియల్ లేదని మా ఉద్దేశం కాదు. అంతర్జాతీయ వనరులతో మీకున్న ప్రాప్యతతో మీరు మరింత ప్రయత్నాలు చేయలేదా?'' అని అడిగింది. అదేవిధంగా నిఘాకు సంబంధించి రెండేళ్ల క్రితం ప్రశ్నలు పుట్టుకొచ్చాయని పేర్కొన్న న్యాయస్థానం ''ఇప్పుడు ఆకస్మాత్తుగా కోర్టుకు ఎందుకు వచ్చారు.. రెండేండ్ల నుంచి ఏం చేస్తున్నారు'' అని మరో ప్రశ్న వేసింది. మూడోది.. ''లక్షిత జాబితాలో ఉన్న వారు క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదు. మీ ఫోన్లు హ్యాకింగ ్కు గురయ్యాయని తెలిస్తే.. క్రిమినల్ ఫిర్యాదు ఎందుకు ఇవ్వలేదు' అని సీజేఐ రమణ అడిగారు. పై ప్రశ్నలకు జర్నలిస్టులు రామ్, శశికుమార్ తరపు కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ.. పెగాసస్ స్పైవేర్‌ను ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అమ్ముతోందని కాలిపోర్నియాలోని ఒక కోర్టు రికార్డు చేసిందనీ, అదేవిధంగా సార్వభౌమ ఇమ్యూనిటీ(విదేశీ న్యాయస్థానాల పరిధి నుంచి మినహాయింపు) కోరుతూ ఎన్ఎస్ఓ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిందని తెలిపారు.
పెగాసస్ ఆరోపణలపై గతనెల ఐటి మంత్రి లోక్‌సభలో ఇచ్చిన సమాధానం దారుణంగా, అస్పష్టంగా ఉన్నదని పేర్కొన్నారు. నిఘా అంశాన్ని 2019, నవంబర్లోనే లేవనెత్తామని, అయితే దేశంలో ఎటువంటి అనధికార నిఘా లేదని అప్పట్లో మంత్రి సమాధానం ఇచ్చారని సీపీఐ(ఎం) ఎంపీ బ్రిట్టాస్ తరపు న్యాయవాది మీనాక్షి అరోరా పేర్కొన్నారు. లక్షిత జాబితాలోని పేర్లు గతనెలలోనే బయటకు వచ్చాయని ఎడిటర్స్ గిల్డ్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సియు.సింగ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నిఘా జాబితాతో ఉన్నవారు ఎందుకు వ్యక్తిగతంగా కోర్టుకు రాలేదనే మూడవ ప్రశ్నపై, సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ స్పందిస్తూ.. ఇది వ్యక్తిగత నిఘా కేసు కాదనీ, దీని తీవ్రత, పరిమాణం చాలా పెద్దదని, అత్యున్నత స్థాయిలో స్వతంత్ర నిజనిర్ధారణ సంస్థను ఏర్పాటు చేయాల్సిన సమస్య ''అని ఆయన పేర్కొన్నారు.
అదొక ఒక రోగ్ టెక్నాలజీ
పెగాసస్ అనేది ఓ రోగ్ టెక్నాలజీ అని విచారణ సందర్భంగా కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఇది మనకు తెలియకుండానే ఫోన్ల ద్వారా మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్నదనీ, మన ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. ఇది మన గణతంత్ర దేశ విలువలు, వ్యక్తిగత గోప్యత, గౌరవ, మర్యాదలపై దాడి అని తెలిపారు. అంతేకాకుండా ఈ పెగాసస్ మన దేశ ప్రయోజనాలను నాశనం చేస్తుందని, దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోకి పెగాసస్ ఎందుకు, ఎలా చొరబడిందనేది ప్రభుత్వం చెప్పాలనీ, ఒకవేళ నిఘా గురించి తెలిస్తే కేసు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉందో తక్షణం ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేందుకు కేంద్రానికి నోటీసులు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.