Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు, పోషకాహార లోపాలను పరిష్కరించడానికి కేరళలో ఆరోగ్య సంరక్షణ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవమైన ఆగస్టు 9 నుంచి వారం రోజుల పాటు ఈ ప్రచారం జరుగుతుందని రాష్ట్ర ఎస్సి, ఎస్టి, బిసి సంక్షేమ శాఖ మంత్రి కె రాథాక్రిష్ణన్ శుక్రవారం అసెంబ్లీలో వెల్లడించారు. వాయనంద్, పాలక్కడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో జన్యువ్యాధి అయిన సికెల్ సెల్ అనీమియా రోగులు దాదాపు 770 మంది ఉన్నారని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి కమ్యూనిటీ కిచెన్లు ప్రారంభిస్తామని చెప్పారు.
పాలక్కడ్ జిల్లా అత్తపాడీ వద్ద ఇప్పటికే ఇవి ప్రారంభమైనట్లు తెలిపారు. ఆల్కహాల్, డ్రగ్స్ ప్రభావాలపై అవగాహన కల్పించడం కోసం పండుగ సీజన్లో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామన్నారు. గిరిజనుల సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి జరగకుండా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.