Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం
- ముగిసిన నాలుగు రోజుల సత్యాగ్రహం
న్యూఢిల్లీ : విద్యుత్‌రంగ ఉద్యోగులు, ఇంజనీర్ల ఆందోళనకు సీపీఐ(ఎం) ఎంపీ, సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎలమారం కరీం సంపూర్ణ మద్దతు తెలిపారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్ (ఎన్సీసీఈఈఈ) ఆధ్వర్యాన శాంతియుతంగా కొనసాగుతున్న ఆందోళనలపై పోలీసుల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శుక్రవారం విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల నాలుగోరోజు సత్యాగ్రహం కొనసాగింది. చివరి రోజు ఆందోళనల్లో భాగంగా దక్షిణ ప్రాంత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, తమిళనాడుకు చెందిన ఉద్యోగులు వందలాది మంది పాల్గొన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విద్యుత్ సవరణ బిల్లు-2021ను ప్రవేశపెడుతామన్న కేంద్రప్రభుత్వం ఏకపక్ష ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ, గురువారాల్లో మాదిరిగానే వందలాది మంది పోలీసులు, పారా మిలటరీ బలగాలు దీక్ష వేదికను చుట్టుముట్టారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉద్యోగులు, ఇంజనీర్లను లోపలికి పోనివ్వకుండా అడ్డుకున్నారు. రోడ్డుపై నిలుచునేందుకు కూడా అనుమతించలేదు. గురువారం నిర్ణయించిన ప్రకారం నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్ (ఎన్సీసీఈఈఈ) సభ్యులు స్థానిక బిటిఆర్ భవనలో సమావేశమయ్యారు. పొలీసుల తీరును ఈ సందర్భంగా వారు ఖండించారు.
ఎంపీ కరీం మాట్లాడుతూ దేశ ప్రజల విద్యుత్ హక్కును కాపాడేందుకు ఎన్సీసీఈఈఈ చేస్తున్న అవిశ్రాంత పోరాటాన్ని ఆయన ప్రశంసించారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు. ఆర్ఎస్ఎస్/బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు మోడీ సర్కార్ చేస్తున్న కుయుక్తులను ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సవరణ బిల్లు రద్దు కోసం పోరాడుతున్న రైతుల పోరాటాన్ని ఆయన ప్రశంసించారు. విద్యుత్ సవరణ బిల్లు రద్దుకు తీర్మానం చేసిన కేరళ అసెంబ్లీకి శుభాకాంక్షలు చెబుతూ ఎన్సీసీఈఈఈ సమావేశం ఒక తీర్మానం చేసింది. కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు.