Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదాస్పద అత్యావశ్యక రక్షణ సేవల బిల్లుకు ఆమోదం
- ఏ రూపంలోనూ ఆందోళనలు, సమ్మె చేపట్టరాదంటూ కేంద్రం చట్టం
- కార్మికుల ప్రాథమిక హక్కుల్ని కాలరాయటమే : కార్మికసంఘాలు
- రక్షణరంగాన్ని కార్పొరేటీకరణ చేయటమే కేంద్రం లక్ష్యం..
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ మరో వివాదాస్పద చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అత్యంత వివాదాస్పదమైన 'అత్యావశ్యక రక్షణ సేవల బిల్లు-2021'ను పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. రక్షణరంగం సహా ఇతర రంగాల్లో కార్మికులు, ఉద్యోగులు ఏ రూపంలో నిరసనలు తెలియజేసినా, సమ్మె చేపట్టినా..దానిని చట్టవ్యతిరేకమైన చర్యగా పేర్కొనే అవకాశం ఈ బిల్లు కల్పిస్తోంది. అత్యంత వివాదాస్పద అంశాలతో కూడిన ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా కార్మికసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా రక్షణరంగంలో ఉద్యోగులు, కార్మికులు నిరసనబాట పట్టకుండా, సమ్మె చేయకుండా అడ్డుకునేందుకు మోడీ సర్కార్ ఈ బిల్లును తీసుకొచ్చిందని సమాచారం.వివాదాస్పద బిల్లును అనాగరికమైన, పాశవికమైనదిగా కార్మికసంఘాలు పేర్కొంటున్నాయి. అంతేగాక ఈ బిల్లు పరిధిలోకి మరికొన్ని సేవారంగాల్ని తీసుకురావాలని మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని కార్మికసంఘాల నాయకులు చెబుతున్నారు. కార్మికుల గొంతునొక్కేందుకు పాలకుల చేతిలో ఒక ఆయుధంగా ఈ చట్టం నిలుస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
కార్మికుల హక్కులను కాలరాయటమే
కార్మికుల ప్రాథమిక హక్కులు, అంతర్జాతీయ కార్మిక సమాఖ్య(ఐఎల్ఓ) తీర్మానాలకు ఈ బిల్లు పూర్తి వ్యతిరేకమని పార్లమెంట్లో వామపక్షాలు, కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేశాయి. బిల్లుపై ఎలాంటి చర్చా జరగలేదని, ఏకపక్షంగా బిల్లును ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అత్యంత వివాదాస్పద బిల్లును వెంటనే ఉపసంహరిం చాలని కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సీఐటీయూ(సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. అలాగే ఈ బిల్లుపై అంతర్జాతీయ కార్మిక సమాఖ్య (ఐఎల్ఓ)లో ఫిర్యాదు చేసింది. కార్మికుల ప్రాథమిక హక్కుల్ని కాలరాసే విధంగా ఈ బిల్లును రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఎల్ఓ ప్రాథమిక హక్కుల తీర్మానాలకు, విధానాలను పూర్తి విరుద్ధంగా బిల్లులోని అంశాలున్నాయని ఐఎల్ఓకు ఇచ్చిన ఫిర్యాదులో సీఐటీయూ తెలిపింది. రక్షణరంగంలో వివిధ విభాగాల్ని కార్పొరేటీకరణ చేయటమనే ఏకైక లక్ష్యం కోసం మోడీ సర్కార్ ఈ 'అత్యావశ్యక రక్షణ సేవల' బిల్లును తీసుకొచ్చిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెగసస్పై సభ్యులు ఆందోళన తెలుపుతుండగా...మరోవైపు లోక్సభలో కేంద్రం 'అత్యావశ్యక రక్షణ సేవల బిల్లు-2021'కు ఆమోదముద్ర వేసింది. వామపక్షాలు, కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా..రాజ్యసభలో గురువారం రాత్రి బిల్లుపై మూజువాణితో కేంద్రం ఆమోదించింది. బిల్లుపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి అప్పజెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదు.