Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల చట్టాలు రద్దు చేయాల్సిందే : కిసాన్ సంసద్‌లో ప్రతిపక్షాలు
- 12 పార్టీల నేతలు హాజరు
- రైతులకు మద్దతుగా ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: మూడు నల్ల చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిది నెలలుగా రైతులు సాగిస్తున్న ఉద్యమానికి ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యాన జంతర్ మంతర్ వద్ద గత 12 రోజులుగా నిర్వహిస్తున్న కిసాన్ సంసద్ (రైతు పార్లమెంట్)కు శుక్రవారం ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. పార్లమెంట్‌లోని నాలుగో నెంబర్ గేటు వద్ద నుంచి కాలి నడకన పార్లమెంట్ వెలుపల ఉన్న గురుద్వారా వద్దకు పార్టీల నేతలంతా చేరుకున్నారు. అక్కడ నుంచి రెండు బస్సుల్లో ' నల్ల చట్టాలు రద్దు చేయాలని' నినాదాలు చేస్తూ జంతర్ మంతర్‌కు వచ్చారు. రైతులకు సంఘీభావంగా ''సేవ్ ఫార్మర్స్... సేవ్ ఇండియా, జై జవాన్... జై కిసాన్'' అంటూ నినదించారు. కిసాన్ సంసద్లోని సందర్శకుల గ్యాలరీలో ప్రతిపక్ష నేతలు కూర్చొన్నారు. కిసాన్ సంసద్ తీరును, రైతులు జరుపుతున్న చర్చలను ఆసక్తిగా పరిశీలించారు.
నల్ల చట్టాలు రద్దు చేయాల్సిందే : రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాల్సిందేననీ, ఇందులో మరో మాటకు తావే లేదని తేల్చి చెప్పారు. పెగాసస్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నా, కేంద్ర ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తోందని అన్నారు. ప్రతి భారతీయుడి ఫోన్‌పై మోడీ నిఘా పెడుతున్నారని విమర్శించారు. కిసాన్ సంసద్‌కు హాజరైనవారిలో మల్లికార్జున ఖర్గే, అధీóర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగొరు (కాంగ్రెస్), తిరుచ్చి శివ (డీఎంకే), వందనా చౌహాన్ (ఎన్సీపీ), ఎలమారం కరీం (సీపీఐ(ఎం), బినరు విశ్వం (సీపీఐ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), సంజరు రావత్ (శివసేన) ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ), మహ్మద్ బషీర్ (యూఎంఎల్), హస్నైన్ మసూది (నేషనల్ కాన్ఫరెన్స్), థామస్ చాజికాదన్ (కేరళ కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు.ప్రతిపక్షపార్టీల నేతలు పార్లమెంట్ నుంచి జంతర్ మంతర్ వరకు మార్చ్ నిర్వహించాలని భావించగా, ఢిల్లీ పోలీసులు భద్రత పేరుతో అనుమతి నిరాకరించారు. అంతకుముందు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది.
కిసాన్ సంసద్‌లో ఏడు తీర్మానాలు ఆమోదం
22న జంతర్ మంతర్‌లో ప్రారంభమైన కిసాన్ సంసద్ ఇప్పటి వరకు ఏడు తీర్మానాలు ఆమోదించింది. ఏపీఎంసీ చట్టం, నిత్యావసర సరుకుల చట్టం, కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం రద్దు చేయాలనీ, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని, మహిళా రైతుల శ్రమను గుర్తించాలని, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలనీ, ఎన్సీఆర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ పలు తీర్మానాలను కిసాన్ సంసద్ ఆమోదించింది. శుక్రవారం కిసాన్ సంసద్‌లో నాలుగు సెషన్లు జరిగాయి. మొదటి సెషన్‌కు టి. షణ్ముగన్, మాస్టర్ సూరజ్‌భాను సింగ్, రెండో సెషన్‌కు దర్శన్ పాల్, ఇందర్జిత్ సింగ్, మూడో సెషన్‌కు రాజా దాస్, రాజీందర్ సింగ్ దీప్సింగ్వాలా, నాలుగో సెషన్‌కు జోగిందర్ నైన్, బలదేవ్ సింగ్ నిహల్‌గఢ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించారు.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలతో పాటు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎనిమిది నెలలుగా ఉద్యమిస్తున్నప్పటికీ, రైతుల డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వంపై కిసాన్ సంసద్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం తరువాత దానిని గాలికొదిలేసిందని సభ్యులు విమర్శించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు నష్టకరంగాను, కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు భరోసా ఇవ్వడంలో ఇది విఫలమైందని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, కరోనా సమయంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ప్రతిపక్ష నేతలతో పాటు పౌరులపై గూఢచర్యం, దేశద్రోహం, మానవ హక్కుల ఉల్లంఘన, కార్మిక వ్యతిరేక చట్టాలు, ప్రజల జీవనోపాధి, ప్రజాస్వామ్య విలువలు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన వంటి అంశాలను కూడా సభ్యులు లేవనెత్తారు. చర్చ సోమవారం కూడా కొనసాగుతుంది. ఆ రోజున మహిళా కిసాన్ సంసద్ నిర్వహిస్తారు. మహిళా రైతుల సమస్యలను కూడా చర్చిస్తారు. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ రైతుల సమస్యలపై చర్చిస్తారు.