Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 నిమిషాల్లో 25 బిల్లులకు ఆమోదమా?
- చర్చ..ఓటింగ్ లేకుండా మందబలంతో నెగ్గించుకుంటారా..!
- పార్లమెంట్లో కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
- లోక్‌సభలో రెండు బిల్లులు ఆమోదం
- లక్షదీప్‌లో అడ్మినిస్ట్రేటర్వి అరాచకాలెన్నో...
- గాంధీ విగ్రహం ఎదుట కేరళ ఎంపీలు ధర్నా
న్యూఢిల్లీ : పార్లమెంట్లో మోడీప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలకమైన బిల్లులను సైతం నిమిషాల్లో బీజేపీ సర్కార్ ఆమోదించుకుంటున్నది. చర్చలు జరపకుండా, ఓటింగ్ నిర్వహించుకుండా కేవలం 21 నిమిషాల్లో 25 బిల్లులను ఆమోదించుకోవడం పార్లమెంటరీ నిబంధనలను తుంగలో తొక్కడమేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు కూడా బిల్లులు వెళ్లటం లేదనీ, విస్తృత చర్చల కోసం సెలక్టు కమిటీ ఊసే లేదని విమర్శించాయి. శుక్రవారం లోక్‌సభలో అధిర్ రంజన్ మాట్లాడుతూ ఇష్టారీతిన బిల్లులు ఆమోదించుకోవడం దారుణమని అన్నారు. చర్చలు లేకుండా బిల్లులు ఆమో దించుకోవడమేంటనీ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహారిస్తు న్నదని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శిం చారు. సీపీఐ(ఎం) పార్లమెంటరీ పక్షనేత ఎలమారం కరీం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 75 శాతం బిల్లులు వివిధ కమిటీల్లో చర్చలు జరిగితే, ఇప్పుడు మోడీ హయంలో కేవలం 7 శాతం బిల్లులు మాత్రమే కమిటీలకు వెళ్లాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ నిబంధనలను బుల్డోజ్ చేస్తుందని విమర్శించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించుకున్న ఒక్క బిల్లుపైన కూడా చర్చ జరగలేదని అన్నారు. కేంద్ర మంత్రి బిల్లు ప్రవేశపెట్టడమే తరువాయి, చర్చలు జరపకుండా క్షణాల్లో ఆమోదించుకుంటున్న తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
అట్టుడికిన పార్లమెంట్
పెగాసస్, రైతు సమస్యలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. శుక్రవారం ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు ఒకటి, రెండు సార్లు వాయిదా, వెంటనే సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో పన్ను చట్టాల సవరణ బిల్లు, సెంట్రల్ వర్సిటీ సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. పెగాసస్, రైతు సమస్యలపై నినాదాల హౌరెత్తించారు. ప్లకార్డు చేబూని ప్రతిపక్ష సభ్యులు చేసిన ఆందోళన నడుమ, స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. కొద్ది సేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించిన తరువాత, సభలో నెలకొన్న గందరగోళం నడుమ సభను వాయిదా వేశారు.
అనంతర ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ఒకపక్క ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో ఆందోళన చేస్తుండగానే, మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. వెంటనే ప్యానల్ స్పీకర్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కూడా చర్చ జరగకుండా ఆమోదం పొందింది. వెంటనే సభను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు చేబూని ఆందోళన చేపట్టారు. పెగాసస్, రైతు సమస్యలపై పెద్ద పెట్టున నినాదాల హౌరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభ 11 నిమిషాలకే మద్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో, ప్రశ్నోత్తరాలు కొద్ది సేపు జరిగిన తరువాత సోమవారానికి వాయిదా పడింది.
వివాదస్పద లక్షదీప్ అడ్మినిస్ట్రేటర్‌ను తొలగించాలి
వివాదస్పద లక్షదీప్ అడ్మినిస్ట్రేటర్‌ను తొలగించాలని కేరళ ఎంపీలు ఆందోళన చేశారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కేరళకు చెందిన సీపీఐ(ఎం), సీపీఐ, ఎల్జేడీ, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం మాట్లాడుతూ లక్షదీప్ అడ్మినిస్ట్రేటర్ వివాదస్పద చర్యలు చేపట్టీ, లక్షదీవుల జీవవైవిద్యాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్లకు కారు చౌకుగా ఐలాండ్లను అమ్మేస్తున్నారని ఆరోపించారు. అడ్మినిస్ట్రేటర్ అమలు చేస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా లక్షదీప్ ప్రజలు ఐక్యంగా పోరాడుతున్నారని తెలిపారు. అందువల్ల లక్షదీప్ ప్రజల డిమాండ్‌ను కేంద్ర పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పార్లమెంట్ సభ్యులుగా తాము లక్షదీప్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తామని అన్నారు. ఈ ధర్నాలో సోమప్రసాద్, ఎఎం ఆరీఫ్, వి.శివదాసన్, జాన్ బిట్రాస్ (సీపీఐ(ఎం), బినరు విశ్వం, ఎం. సెల్వరాజ్ (సీపీఐ), ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్పీ), మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), శ్రేయమ్స్ కుమార్ (ఎల్జేడీ) తదితరులు పాల్గొన్నారు.