Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక సమాచారం బయటకు వస్తుందని మాట మార్చిన కేంద్రం
- కేంద్ర సమాచార కమిషన్ కోరినా..నో...
న్యూఢిల్లీ : హాస్పిటల్స్‌లో ఆక్సీజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, బెడ్లు దొరక్క కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఎంతోమంది చనిపోయారు. అయితే ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు ఒక సాధికారిక కమిటీ ఏర్పాటుచేసినట్టు కేంద్రం ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో నెలకొన్న ఆక్సీజన్, ముఖ్యమైన మందులు, వెంటిలేటర్ల కొరతను తీర్చేందుకు ఈ కమిటీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్రం పేర్కొంది. అయితే ఈ కమిటీ సమావేశ వివరాలు ఇవ్వాల్సిందిగా ఇటీవల (జులై 29న) కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖ(డీపీఐఐటీ) ను కోరగా..మోడీ సర్కార్ నుంచి విచిత్రమైన సమాధానం వచ్చింది. అసలు అలాంటి (సాధికారిక కమిటీ) కమిటీయేదీ తాము ఏర్పాటుచేయలేదని కేంద్రం మాటమార్చింది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఏర్పాటుచేసిన కమిటీ సమావేశ వివరాలు ఇవ్వాలని, మీటింగ్ మినట్స్ సమర్పించాలని సీఐసీ కోరగా, వాటిని ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది.అసలు అలాంటిదేమీ ఏర్పాటుచేయలేదని తెలిపింది.కరోనా రెండో వేవ్‌ను ఎదుర్కొనే నిమిత్తం ఏర్పాటైన సాధికారిక కమిటీ సమావేశాల వివరాలు ఇవ్వాల్సిందిగా సమాచారహక్కు కార్యకర్త సౌరవ్ దాస్ సీఐసీని ఆశ్రయించారు. అయితే ఆ సమాచారాన్ని విడుదల చేయడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేయలేదు. అసలు అలాంటి కమిటీయే లేనప్పుడు సౌరవ్ దాస్ కోరిన సమాచారం ఎలా ఇవ్వగలమని కేంద్రం సమాధానమిచ్చింది.దీనిపై సౌరవ్ దాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అత్యున్నత స్థాయి కమిటీ ఒకదాన్ని ఏర్పాటుచేశామని ఇంతకుముందు చెప్పిన కేంద్రం..ఇప్పుడు వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తోందని, మాట మారుస్తోందని ఆయన అన్నారు.