Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమితాబచ్చన్ ఇంటితో పాటు మరో మూడు రైల్వే స్టేషన్లలో..
- ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని అగంతకులు బెదిరించారు. దీంతోపాటు ముంబయిలోని మరో మూడు ప్రధాన రైల్వే స్టేషన్లను సైతం పేల్చి వేస్తామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీలలో అనుమానాస్పదంగా ఏ వస్తువు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ముంబయి పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం రాత్రి కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతోపాటు.. జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు పెట్టామనీ, వాటిని పేల్చబోతున్నామని ఓ కాల్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు.బెదిరింపు ఫోన్ కాల్‌తో అప్రమత్తమై.. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు, స్థానిక పోలీసు సిబ్బందితో పాటు రైల్వే రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయా ప్రదేశాలకు చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని పోలీసు కమిషనర్ వెల్లడించారు. అయితే.. అనుమానాస్పదంగా ఏదీ కనుగొనలేదని.. కానీ.. ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసు సిబ్బందిని మోహరించినట్టు తెలిపారు. అయితే, ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దృష్టి సారించిన పోలీసులు.. ఈ విషయం తెలుసుకునేందుకు ముంబయి క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరిని విచారిస్తున్నామని సంబంధిత అధికారులు వెల్లడించారు.