Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆగస్టు 15న 'కిసాన్ మజ్దూర్ ఆజాదీ సంగ్రామ్ దివాస్'గా నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఆ రోజున మువ్వన్నెల జెండాలతో 'తిరంగ మార్చ్' నిర్వహించాలని సూచించింది. బ్లాక్, మండల, జిల్లా, రాష్ట్ర ప్రధాన నగరాల్లో ట్రాక్టర్,మోటార్ సైకిల్,కారు, సైకిల్ మార్చ్‌లు జరుగుతాయనీ, జాతీయ జెండాలతో వాహనాలు మార్చ్‌లో పాల్గొంటాయని ఎస్కేఎం నేతలు తెలిపారు.మరోవైపు మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ,కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. శనివారం నాటికి రైతు ఉద్యమం 254 రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్‌పూర్ సరిహద్దుల్లో రైతుల ఆందోళన జోరు వర్షంలోనూ కొనసాగుతున్నది. మరోవైపు రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు, బీజేపీ, దాని అనుబంధ పార్టీల నేతల బహిష్కరణలు కొనసాగుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడిక్కడే ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి వేలాది మంది రైతులు వివిధ ఆందోళన ప్రాంతాలకు చేరుకుంటున్నారు. తమిళనాడు నుంచి 1,000 మంది రైతులు సింఘూ సరిహద్దులో చేరడంతో పాటు, హర్యానాలోని కైతాల్ నుంచి వేలాది మంది రైతులు సింఘూ బోర్డర్‌కు చేరుకున్నారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ రైతులు సితార్‌గంజ్ నుంచి ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్నారు.