Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 72గంటల్లో చెల్లించాలంటూ జిగేశ్ మేవానీ డిమాండ్
అహ్మదాబాద్: ఒకవైపు గుజరాత్ ముఖ్యమంత్రి విజరు రూపానీ ప్రభుత్వం ఐదేండ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో వేడుకలు జరుపుకుంటుండగా.. మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితులను ఎత్తిచూపుతూ వడ్గామ్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగేశ్ మేవానీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్ఆర్ఈజీఏ) కింద పనిచేసిన కార్మికులకు రూ.212 కోట్ల బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరోనా సంక్షోభం, నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర నెలలకు పైగా ఉపాధి కార్మికులకు బకాయిలు చెల్లించలేదని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం 15 రోజుల్లోగా కార్మికులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందనీ, ఒక వేళ ఇవ్వనట్టయితే, అప్పుడు 0.05 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం గ్రాంట్‌ను విడుదల చేయకపోవడంతో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన దాదాపు లక్షమందికి పైగా కార్మికులకు చెల్లింపులు జరగలేదని ఆయన ఆరోపించారు. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు, రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని అనేక సార్లు మాట్లాడారనీ,ఇప్పుడు కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలో ఉంది.ఎందుకు ఉపాధి కార్మికుల పట్ల వివక్షను చూపుతున్నా రనిప్రశ్నించారు.ఈ నిధులను మరేదానికైనా ఉపాయోగిస్తున్నదా? అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ ఆధారంగా తాను ఈ వివరాలను వెల్లడిస్తున్నాననీ,మొదట వడ్గామ్లోని కార్మికులకు కోటి రూపాయల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుసుకున్నాననీ, పూర్తి గణాంకాలను పరిశీలించగా దాదాపు రూ.212 కోట్లు కార్మికులకు చెల్లించలేదని తెలిసిం దని జిగేశ్ మేవానీ అన్నారు. 72 గంటల్లో ఈ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ సమస్యను కాంగ్రెస్ లేవనెత్తాలని కోరారు. మిగతా రాష్ట్రాల డేటాను సైతం సేకరించడానికి యోచిస్తున్నట్టు తెలిపారు.