Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు గనుల నుంచి వారికి ప్రయోజనం చేకూరేలా సవరణ బిల్లు
- ప్రయివేటు సంస్థలకూ లభించనున్న మినహాయింపులు
- కేంద్రం వైఖరిపై నిపుణుల ఆగ్రహం
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేటు ప్రయోజనాలకు అనుకూలంగా పని చేస్తున్నది. దేశంలోని అనేక రంగాలను కేంద్రం ఇప్పటికే ప్రయివేటీకరించింది. ఇందులో ఎయిర్‌పోర్టులు, రక్షణరంగం, బీమా రంగంతో పాటు అనేక సెక్టార్లకు చెందిన ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. ఇప్పుడు బొగ్గు గనుల విషయంలోనూ కార్పొరేటు అనుకూల వైఖరిని అవలంభిస్తున్నది. ఇందులోభాగంగా బొగ్గు గనుల సంస్కరణల ద్వారా ప్రజల హక్కులను ఫణంగా పెట్టి వారి భూములను లాక్కొనేలా తోడ్పాటునందిస్తున్నది. ఇందుకు సవరణ బిల్లుతో కేంద్రం సిద్ధంగా ఉన్నది. దీని ప్రకారం.. గతేడాది ప్రయివేట వ్యక్తులు వాణిజ్య మైనింగ్‌లో భాగంగా బొగ్గు బ్లాకుల కోసం ప్రజలకు అనుకూలమైన న్యాయ ఒప్పందాన్ని దాటవేసే వెసులుబాటు ఉంటుంది.ః ది కోల్ బేరింగ్ ఏరియాస్ అమెండ్మెంట్ బిల్, 2021ఃను కేంద్రం ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తున్నది. ఈ బిల్లు ఆమోదిస్తే.. బొగ్గు గనుల విషయంలో ప్రయివేటు కంపెనీలకు సామాజిక ప్రభావ అంచనాలను నిర్వహించే విషయంలో, అంటే బొగ్గు తవ్వకం కోసం భూమిని సేకరించే ముందు జనాభాలో ఎక్కువ మంది సమ్మతి, బాధితులకు తగిన పరిహారం చెల్లించే విషయాల్లో మినహాయింపు లభిస్తుంది. కాగా, ఇప్పటి వరకు బొగ్గు తవ్వకం కోసం 2013 భూ సేకరణ చట్టం నుంచి మినహాయింపు ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, తాజా బిల్లు ఈ మినహాయింపును ప్రయివేట కంపెనీలకు విస్తరించడమే కాకుండా సేకరించిన భూమిని అన్ని ఖనిజాలను తొలగించిన తర్వాత కూడా ఇతర కార్యకలాపాలకు ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తుంది. అయితే, ఈ సవరణలను నిపుణులు తప్పుబడుతున్నారు. ఇవి కేవలం కార్పొరేటు ప్రయోజనాలను కాపాడేందుకేననీ, ప్రజల హక్కులను కాలరాస్తాయని నిపుణులు ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.