Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ఉపాధి హామీ పథకం తీసుకురావాలి
- బడ్జెట్ కేటాయింపులు పెంచాలి
- సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ చట్టపరమైన బాధ్యతగా మార్చాలి : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచన
న్యూఢిల్లీ : పేదలకు నగదుబదిలీ చేయా లని కార్మికశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కరోనా మహ మ్మారి వచ్చిందని, అప్పటి నుంచి పేదల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, వారికి ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. సామాజిక భద్రత, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం తప్పనిసరి అని తెలిపింది. ఇది ప్రభుత్వాల కర్తవ్యమని పేర్కొంది. బీజేడీ ఎంపి భర్తృహరి మహతాబ్ నేతృత్వంలోని కమిటీ ఈ సిఫారసులు చేసింది.
అసంఘటితరంగ కార్మికుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయాలని, ఉపాధి హామీ తరహాలో పట్టణ ఉద్యోగ హామీ పథకాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సుల్లో పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి నష్టంపై మహమ్మారి ప్రభావం గురించి వివరించింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను ప్రభుత్వ చట్టపరమైన బాధ్యతగా మార్చాలని, ఉపాధి హామీ బడ్జెట్ కేటాయింపులను పెంచాలని పేర్కొంది.''రెండో వేవ్ ప్రభావంపై సర్వే డేటా ఇంకా అందుబాటులో లేనప్పటికీ, మొదటిదానికంటే చాలా తీవ్రంగా ఉంది. మొదటి వేవ్ సమయంలో అనుభవించిన పరిస్థితి ముఖ్యంగా గణనీయమైన ఆదాయ నష్టాలు ఉండేవని సూచిస్తున్నాయి. అసంఘటిత రంగం, పేదలను మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుంది''అని నివేదిక పేర్కొంది.మన దేశంలోకి కరోనా మహమ్మారి రావడానికి ముందే నిరుద్యోగం అత్యధికంగా ఉండేదని తెలిపింది. ఈ మహమ్మారి కారణంగా తీవ్రమవుతున్న నిరుద్యోగం వల్ల పరిస్థితులు క్షీణిస్తున్నా యని, వ్యవస్థీకృత రంగంలోని జాబ్ మార్కెట్లో అసమానతలు తీవ్రమవుతు న్నాయని పేర్కొంది. మహమ్మారి కార్మిక మార్కెట్‌ను నాశనం చేసింది. ఉపాధిని దెబ్బతీసింది. కోట్లాదిమంది కార్మికులు, వారి కుటుంబాల మనుగడ మీద తీవ్ర ప్రభావం చూపింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)ను ఉటంకిస్తూ, నివేదిక ప్రకారం 90 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారని, అంటే 46.5కోట్ల కార్మికుల్లో 41.9కోట్లు ఉన్నారని తెలిపింది. పీఎల్ఎఫ్ఎస్ త్రైమాసిక బులెటిన్ 2020 ఏప్రిల్-జూన్ లో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటును 15ఏండ్లు పైబడిన వారికి 20.8శాతానికి పెరిగిందని తెలిపింది.ఇది 2020 జనవరి-మార్చిలో 9.1శాతంగా ఉంది.సమాజంలో ప్రతికూల పరిస్థితుల్లో నివసిస్తున్నవారిని, అణగారిన వర్గాల వారిని కాపాడటం కోసం వారికి ఆర్థిక సాయం చేయాలని ఈ కమిటీ తెలిపింది. రెండుసార్లు అమలు చేసిన లాక్డౌన్ ఆంక్షల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు పేదలకు ఆర్థిక సాయం చేయాలని తెలిపింది. దీనివల్ల వారి కష్టాలు చాలా వరకు తగ్గుతాయని పేర్కొంది.ఇటువంటి వారిని ఆదుకోవడమంటే కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఉపకారం చేసినట్టు కాదని, వారికి సాయం చేయవలసిన కర్తవ్యం,విధి ప్రభుత్వాలకు ఉందని తెలిపింది. అవసరంలో ఉన్నవారు యథార్థం గా లబ్ధి పొందేవిధంగా పథకాల అమలు కోసం వ్యవస్థను మెరుగుపరచాలని తెలిపింది. అసంఘటిత రంగానికి అధికారిక గుర్తింపునివ్వాలని తెలిపింది.