Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందబలంతో పార్లమెంట్‌పై మోడీ పెత్తనం
- రైతు సమస్యలు..పెగాసస్‌పై చర్చకు బీజేపీ సర్కార్ నిరాకరణ..
- ప్రతిపక్షాలపై బురదజల్లి.. బిల్లులకు లైన్ క్లియర్
- ప్రజాస్వామ్యానికి తూట్లు.. రాజకీయ విశ్లేషకులు
చట్టసభల ద్వారా ప్రజాస్వామ్యానికి భరోసా కల్పించాల్సిఉండగా..మందబలంతో పార్లమెంట్‌పై మోడీ పెత్తనం చెలాయిస్తున్నది. రైతు సమస్యలు,పెగాసస్ గూఢచర్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు నిలదీస్తున్నా..బీజేపీ సర్కార్ నిరాకరిస్తున్నది. ప్రతిపక్షాలపై బురదజల్లి..నిమిషానికో బిల్లు పాస్ చేస్తున్నది. అంతిమంగా పార్లమెంట్ సమావేశాలను అనుకున్నవిధంగా నడిపించుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ప్రజా వ్యతిరేకఎజెండాను విచక్షణారహితంగా కొనసాగిస్తున్న తీరుపై రాజకీయవిశ్లేషకుల్లో ఆందోళనవ్యక్తమవుతున్నది.
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి గోడీమీడియాలో వస్తున్న వార్తలను చూస్తే.. పార్లమెంటులో ఏ పని జరగటంలేదు. అనవసరమైన సమస్యలపై ప్రతిపక్షాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వం నుంచి కూడా ఇదే విధమైన స్పందన వస్తున్నది. ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నానీ, పార్లమెంటును నిలిపివేయడం ద్వారా ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్నీ, ప్రజలను అవమానిస్తున్నాయని ప్రధాని మోడీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవమేమిటంటే ఈ పార్లమెంటు సమావేశాలు ప్రభుత్వం నడపాలనుకుంటున్నతీరులోనే ముందుకు సాగిస్తున్నది. ఆరోపించిన గందరగోళం మధ్య, ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక ఎజెండాను దూకుడుగా కొనసాగిస్తోంది. పార్లమెంట్ ప్రారంభానికి ఒక రోజు ముందు నుంచే మోడీప్రభుత్వం సంకేతాలిచ్చింది. పెగాసస్ గూఢచర్యం కేసు పార్లమెంట్ సమావేశాలను పట్టాలు తప్పించిందని కేంద్ర మంత్రులు,బీజేపీ నేతలు ఏకగ్రీవంగా చెబుతున్నారు. హౌం మంత్రి అమిత్ షా కూడా తనకు తెలిసిన శైలిలో ఇలాంటి వాటితో కొంతమంది దేశాభివృద్ధిని అడ్డుకోవాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో మోడీ ప్రభుత్వం అదే చెబుతున్నది. ప్రభుత్వం,ప్రభుత్వ పార్టీకి పార్లమెంటు పనిచేయడానికి అనుమతించకూడదని 'కొన్ని శక్తుల' 'ఉద్దేశం' చెప్పబడుతున్నది, అయితే ఇది ఎవరు చేస్తు న్నారు?. పార్లమెంటును సజావుగా నడపడమెలా..అనేదే ఇపుడు పెద్ద ప్రశ్న. అసలింతకీ బీజేపీ సర్కార్ ఏం చేస్తోంది? పార్లమెంటును నడపకపోవడం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారు అనేది కూడా ముఖ్యమైన ప్రశ్న?.కోట్ల నిధులు దుబారా అవుతున్నాయంటూ ప్రతిపక్షాలపై బురదజల్లి తప్పించుకునే ప్రయత్నాలను పార్లమెంట్ వేదికగా మోడీ సర్కార్ మలుచుకున్నది.
వాస్తవానికి, పార్లమెంటు యొక్క ఒక నిమిషం ప్రొసీడింగ్ల కోసం.. సాధారణ ప్రజల సంపాదననుంచి ఎంత డబ్బు ఖర్చు చేయబడుతున్నదనేది ముఖ్యమైనది కాదు. పార్లమెంట్ పనిచేయడానికి ప్రతిపక్షం అనుమతించడం లేదని చెప్పడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తున్నది. పార్లమెంటు సజావుగా నడపాల్సిన ప్రాథమికంగా బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఈ బాధ్యతను నెరవేర్చడం అనేది 'నిర్దిష్ట పరిస్థితులలో' రాజకీయంగా లోటు కనిపిస్తున్నది. అందువల్లే పార్లమెంటు సజావుగా కొనసాగటానికి ఇష్టపడదని స్పష్టమవుతున్నది.
పార్లమెంటు ప్రొసీడింగ్‌లు సరైన పద్ధతిలో జరగాలి. ఒకటి లేదా మరొక సమస్య గురించి వివాదంగా మారుతున్నది. ఇది ప్రతిపక్షానికి అనుకూలమైనది కాదు, అలానే ప్రభుత్వానికీ. ఇలాంటి పరిస్థితిల్లో ప్రభుత్వం అనేక క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నది. దీంతో సామాన్య ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తలేకపోతున్నాయి. మరోవైపు మెజారిటీ ఆధారంగా బిల్లుల్ని మూజువాణి ఓటింగ్ పద్ధతిన పాస్ చేయించుకుంటున్నది. ఇలా గత కొన్ని ఏండ్లుగా ముఖ్యమైన బిల్లులు,బడ్జెట్ కూడా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించబడుతున్నాయి.
14 పనిదినాల్లో ఒక్కరోజూ నడవని ఉభయసభలు
పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాలు జలై 19 నుంచి ప్రారంభమయ్యాయి, షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి.అయితే ఇప్పటివరకూ పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు 14 పని దినాలలో ఒక్క రోజు కూడా సజావుగా సాగలేదు.ఇంకా మిగిలిఉన్న ఐదు పని దినాలు కూడా సజావుగా జరిగే సూచనలు కనిపించటంలేదు. పెగాసస్ గూఢచర్యం కేసుపై చర్చ జరపాలని మొదటి నుంచి రెండు సభల్లోనూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది దేశ ప్రజల సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికీ, గోప్యతకు సంబంధించిన సమస్య అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం చర్చకు నిరాకరిస్తున్నది. పైగా ఇది అర్థరహిత సమస్యగా చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నది. ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్య ప్రభుత్వం చర్చ లేకుండా ముఖ్యమైన బిల్లులను ఆమోదిస్తున్నది. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్ కూడా మోడీప్రభుత్వానికి పరోక్షంగా సహాయం చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కార్పొరేట్లకు మేలుచేసే బిల్లులనూ..
ప్రస్తుత పార్లమెంటు సెషన్లో ప్రతిపక్షాల వ్యతిరేకత, డిమాండ్లను మోడీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఇప్పటివరకు డజను ముఖ్యమైన బిల్లులను చర్చ లేకుండా ఆమోదించింది, ఇందులో నాలుగు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రయివేట్ చేతికి అప్పగించే బిల్లు కూడా ఉన్నది. ఈ బిల్లులన్నింటినీ ఆమోదించడానికి ఒక్కో బిల్లుకు సగటున ఏడు నిమిషాలు పట్టింది. దీనిపై రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ వ్యంగ్యం ప్రభుత్వం బిల్లును ఆమోదిస్తున్నదా.. లేదా పాప్డి చాట్ చేస్తున్నదా..అని వ్యాఖ్యానించారు. పార్లమెంటు, ప్రజాస్వామ్యం, దేశ ప్రజలకు అవమానమని ఓబ్రెయిన్ ప్రకటన చేశారు. దీనిపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
చర్చకు సిద్ధంగా లేకనే..
సాధారణంగా పార్లమెంటు ప్రతి సెషన్లో లేదా ముగింపులో ప్రధాని మోడీ, ఇతర మంత్రులపై ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు చేస్తాయి. సెషన్ ప్రారంభానికి ముందు, ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చకు సిద్ధంగా ఉండాల్సిఉండగా..మోడీ ప్రభుత్వం ఆ లక్షణాలు అస్సలు కనిపించవు.సమాధానం చెప్పకుండా..వామ్మో చూడండి.. ప్రతిపక్షాల అల్లరి అంతా ఇంతాకాదు.అన్నట్టు సీన్ క్రియెట్ చేసి జారుకోవటం కామన్‌గా మారింది. ముఖ్యమైన అంశాలను చర్చకు పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ మోడీ సర్కార్ లైట్ తీసుకుంటున్నది. మందబలంతో బిల్లును ఆమోదిస్తూనే ఉన్నది. ప్రతిపక్షాల ప్రవర్తన అప్రజాస్వామికం అని మోడీ చెప్పటం..గోడీ మీడియా గగ్గొలు పెట్టడం షరామామూలైంది. వాస్తవం ఏమిటంటే, గత ఏడేండ్ల పాలనలో..పార్లమెంట్ జరుగుతున్నతీరు చూస్తే..ఉభయసభల్ని తమ వంటగదిలా మార్చారా..అన్న అనుమానం కలుగుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా జరగాల్సిఉండగా..
పార్లమెంటు ప్రతిష్ట ఇనుమడించాలంటే.. ఉభయసభలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి.ఉభయ సభల నాయకులు గరిష్ట సమయానికి హాజరు కావాలి, శాసనపరమైన అంశాలపై సమగ్రంగా చర్చించాలి . వాటిపై ఏకాభిప్రాయానికి కృషి జరగాలి. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే.. అలాంటి విషయాలు పార్లమెంటరీ కమిటీలకు పంపించాలి. జాతీయ ప్రాముఖ్యత సమస్య ఉంటే.. దానిని పరిగణనలోకి తీసుకోవడానికి ఉభయ సభల ఎంపిక కమిటీ లేదా ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు రెగ్యులర్ సమావేశమవ్వాలి. ఈ సమావేశాలలో సభ్యులు పార్టీ శ్రేణికి మించి, నిపుణుల అభిప్రాయాన్ని విని ఆబ్జెక్టివ్ పద్ధతిలో వారి అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాలి. కానీ..ఈ పార్లమెంటరీ కమిటీల పని విషయంలో.. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం, పార్లమెంటులో చాలా వివరంగా చర్చించలేని సమస్యలు, ఆ సబ్జెక్టులు లేదా బిల్లులు పార్లమెంటరీ కమిటీలకు పంపాలి. దానిలోని ప్రతి అంశంపై సమగ్రంగా విశ్లేషించి.. అప్పుడు దాని ఆధారంగా కమిటీ నివేదికను రూపొందించి పార్లమెంటుకు సమర్పిస్తుంది. తుది నిర్ణయం పార్లమెంటులోనే తీసుకోవాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ పార్లమెంటరీ కమిటీలను దాదాపు అసంబద్ధం లేదా అనవసరమైనదిగా చేసింది. ముందుగా కమిటీ సమావేశాలు జరగాలి. అయితే లోక్ సభ , రాజ్యసభ సెక్రెటేరియట్ లు ఏదో ఒక సాకుతో అనుమతించటంలేదు. కొన్నిసందర్భాలలో ఏదైనా కమిటీ సమావేశం జరిగినా.. ఆ సభ్యులు పార్టీ శ్రేణికి మించి ఆలోచించరు. పాలక పక్షం, దాని మెజారిటీ బలంతో, పార్లమెంటు స్టాండింగ్ కమిటీల పనిని అడ్డుకుంటున్నది . నివేదికను ఆమోదించడానికి నిరాకరిస్తున్నది.
ఏ బిల్లూ పార్లమెంట్‌కు పంపలే...
గతేడాది( 2020) పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఏ బిల్లును సంబంధిత మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి పంపలేదు. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉన్నది. ప్రతిపక్షాలకు సమాధానమివ్వకుండా.. ప్రభుత్వం సగటున ఏడు నిమిషాల్లో బిల్లును ఆమోదిస్తున్నది. పెగాసస్ గూఢచర్యం కేసు, కేంద్ర వ్యవసాయ చట్టాలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ 'పార్లమెంటరీ విపత్తు'ని ఒక అవకాశంగా భావించి, ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను ఒకదాని తర్వాత ఒకటిగా ఆమోదిస్తున్నది. వాస్తవానికి, పార్లమెంటు, ప్రజాస్వామ్య సంప్రదాయాలు ఈ విధంగా బిల్లును ఆమోదించడం ద్వారా ప్రజాస్వామాన్ని అపహాస్యం పాల్జేస్తున్నది. కానీ ప్రధాని మాత్రం ప్రతిపక్షాలను తిడుతున్నారు. ప్రభుత్వం పార్లమెంటును తన వంటగదిగా ఉపయోగిస్తున్నదనీ, మోడీ సర్కార్ కోరుకున్నది వండినట్టు చూపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఏడేండ్ల కిందట మోడీ అలా..
సరిగ్గా ఏడేండ్ల కిందట మోడీ ప్రధాని పదవిని చేపట్టి.. పార్లమెంటులో అడుగుపెట్టడానికి ముందు మెట్లపై తల వంచారు. చట్టసభలకు గౌరవం ఇస్తున్నాననేలా ప్రవర్తించారు. రాజ్యాంగం ముందు నిలబడి నమస్కరించి ప్రశంసలు అందుకున్నారు. కానీ సాధారణంగా మోడీ ప్రవర్తన ఆ భావనకు విరుద్ధంగా ఉన్నది. పార్లమెంటు సెషన్లో ఎక్కువ సమయం ప్రధాని స్వయంగా పార్లమెంటు వెలుపల ఉంటారు. ప్రసంగం చేయాల్సిన రోజునే ప్రధాని లోక్‌సభ, రాజ్యసభకు హాజరవుతుంటారు. పార్లమెంటు ఆమోదం లేకుండానే ఆర్డినెన్స్‌ల ద్వారా అనేక చట్టాలను అమలు చేయడంలో తొందరపాటు కనిపిస్తున్నది. అనేక బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లులు కూడా చర్చ లేకుండా ఆమోదించేస్తున్నది, పార్లమెంటరీ విధానాన్ని ఆమోదించిన సంప్రదాయాలను విస్మరిస్తున్నది. ఇదే కాదు.. జాతీయ భద్రత , సాధారణ ప్రజలకు నేరుగా సంబంధించిన సమస్యలపై చర్చను బీజేపీ ప్రభుత్వం నిరోధిస్తున్నది. ప్రస్తుతం పెగాసస్ గూఢచర్యం కేసు, కేంద్ర వ్యవసాయ చట్టాలపై నిలదీస్తున్న ప్రతిపక్షాల స్వరం అణచివేస్తున్నది.