Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు ఠాణాల్లోనే అధికం..
- రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా ప్రజలకు వేధింపులు : నల్సా యాప్ను ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
న్యూఢిల్లీ : పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, పోలీసుల వేధింపులు కొనసాగుతు న్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. జాతీయ న్యాయసేవల అథారిటీ..నల్సా పేరుతో మొబైల్ యాప్ను రూపొందించింది. ఆదివారం నాడిక్కడ విజ్ఞాన భవన్లో జాతీయ న్యాయ సేవా కేంద్రం-నల్సా యాప్ను జస్టిస్ ఎన్.వి.రమణ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా న్యాయసేవలు నేరుగా ప్రజలకు చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ నల్సా మొబైల్ యాప్ సేవలను కొనియాడారు. పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ఠాణాల్లో ఇప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘన జరగడం విచారకరమన్నారు. కస్టోడియల్ టార్చర్ సహా పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేక న్యాయ సహాయానికి అవరోధాలు ఏర్పడుతున్నాయని, అంతర్జాల అనుసంధానం మెరుగుపరచాలని కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు.
కరోనా పరిస్థితుల్లోనూ సమర్థంగా న్యాయసేవలు అందించామని వెల్లడించారు. న్యాయవాదులు కొంత సమయం ఉచిత సేవలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. ఉచిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేలా మీడియా చూడాలని సూచించారు. పోలీస్ స్టేషన్లు, జైళ్ల వద్ద దీనికి సంబంధించిన సమాచారంతో హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పేదలకు న్యాయం దూరం కారాదని జాతిపిత మహాత్మా గాంధీ అభిలషించేవారని జస్టిస్ ఎన్.వి.రమణ గుర్తు చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలోనే ఉచిత న్యాయ సేవలకు నాంది పలికారని తెలిపారు.
నాడు స్వాతంత్య్ర సమరయోధులే రాజ్యాంగ రచనలో పాల్గొన్నారని వివరించారు. అందువల్లే ఉచిత న్యాయం అనేది ప్రజలకు హక్కుగా వచ్చిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, నల్సా మెంబర్ సెక్రటరీ అశోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు.