Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారని బీజేపీ ప్రభుత్వ తీరు
- నేడు రాజ్యసభ ముందుకు జీఐసీబిల్లు
- సెలక్టు కమిటీకి పంపాలంటున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీలను ప్రయివేట్ పరం గావించే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ సవరణ బిల్లు- 2021ను రెండు రోజుల క్రితమే రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు యత్నించి చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన మోడీ ప్రభుత్వం సోమవారం ఎలాగైనా సభలో ప్రవేశపెట్టాలని చూస్తున్నది. లోతుగా పరిశీలించేందుకు దీనిని సెలక్టు కమిటీకి పంపాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర ప్రతిపక్ష పార్టీలు పునరుద్ఘాటించాయి. పెగాసస్ సైబర్ దాడిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరితే దానికి కూడా ప్రభుత్వం సిద్ధపడడం లేదు. గత మూడు వారాలుగా దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతున్నది. గతవారం రాజ్యసభ ఎనిమిది బిల్లులను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించింది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల చివరి ఐదు రోజుల్లో ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ బిల్లును ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ గురువారం కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. బెంగాల్లో మమత కూడా దీనిని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. ఈ బిల్లును నిరసిస్తూ రైతు సంఘాలు ఎనిమిది మాసాలుగా ఆందోళన చేస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే, సాగునీటి వ్యయం 500శాతం దాకా పెరిగే ప్రమాదముంది. సబ్సిడీని తొలగించి, వినియోగదారులపై మొత్తం భారాన్ని మోపడమే ఈ విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముఖ్యోద్దేశంగా ఉన్నది.పట్టణ వినియోగదారుల కన్నా గ్రామీణ వినియోగదారులకు సరఫరా వ్యయం అధికమైనందున వారు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.విద్యుత్ సవరణ బిల్లుపై ప్రభుత్వం వెనుకడుగు వేయడానికి ఏకైక కారణం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగడమేనని సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం వ్యాఖ్యానించారు. గురువారం రాజ్యసభలో అత్యవసర రక్షణ సేవల బిల్లు-2021ని హడావిడిగా తీసుకొచ్చింది.
సభా నాయకుడు పీయూశ్ గోయల్ అంతకుముందు విడివిడిగా ప్రతిపక్షాల నేతలందరినీ కలుసుకుని మాట్లాడారు. అయితే ఏ దశలోను ఆయన ఈ బిల్లు గురించి ప్రస్తావనే చేయలేదు. ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోతున్నది. శుక్రవారం జరిగిన సభా కార్యకలాపాల సంప్రదింపుల కమిటీ (బీఏసీ) సమావేశం నుంచి టీఎంసీ చీఫ్ విప్ సుఖేందు శేఖర్ రే వాకౌట్ చేశారు. ఒక్కో బిల్లుపై మూడు నుంచి నాలుగు గంటల వరకు చర్చ జరపాలని బీఏసీలో ప్రభుత్వం ఒప్పుకుని, ఆచరణలో 10- 15 నిముషాల వ్యవధిలోనే వారు బిల్లుపై చర్చను ముగించేస్తున్నారని అన్నారు. సభ సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేష్ అన్నారు.