Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాసితుల పట్ల హర్యానా సర్కార్ అలసత్వం
చండీఘర్ : హర్యానాలోని ఖోరి గ్రామ నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమానుష వైఖరి ప్రదర్శిస్తోంది. ఆ ప్రాంతంలో నివాసం ఉండే వేలాది కుటుంబాలను ఇళ్లను కూల్చివేసి బాధితులకు గూడు లేకుండా చేసిన ఖత్తర్ సర్కార్, పునారావాసం కల్పించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటి వరకు పునరావాస ప్యాకేజీని ఖరారు చేయలేదు. ఖోరీ గావ్ అటవీ భూమిలో కూల్చివేతలకు సంబంధించి ఫరీదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సమర్పించిన పునరావాస ముసాయిదా విధానాన్ని త్వరగా పరిశీలించాలని, ఈనెల 25 లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు 3న హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రోజున తదుపరి విచారణ చేపడుతామని పేర్కొంది. అదేవిధంగా బాధితులకు తాత్కాలికంగా ఆశ్రయం, ఆహారం కల్పించేందుకు రాధాస్వామి సత్సంగ్ కాంప్లెక్స్‌లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నిర్వాసితులు ఫిర్యాదులను స్వీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న న్యాయస్థానం ఆదేశాలను ఫరీదాబాద్ మున్సిపాలిటీ అధికారులు అమలు చేయలేదు. ఫిర్యాదులు చేసేందుకు అధికారులు ఇప్పటి వరకు ఏ ఈమెయిల్‌ను ఇవ్వలేదని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్(ఎన్ఏపీఎం) సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల ఖోరి ప్రాంతం నుంచి రోజువారీగా వందలాది కార్మిక కుటుంబాలను పంపించేయడం, వేలాది ఇళ్లను నేలమట్టం చేయడం జరిగింది. దీని తర్వాత నిర్వాసితులు ఎటువంటి ఆశ్రయం లేకుండానే దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
పునరావాసం కల్పించేంత వరకు నిర్వాసితులకు ఆహారం, ఆశ్రయం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బాధిత కుటుంబాలకు నెలకు రూ.5 వేల రెంటల్ అలవెన్స్ ఇవ్వాలని ఎన్ఎపిఎం డిమాండ్ చేసింది.