Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ, ఆశా కార్యకర్తల దుస్థితి
- దోపిడీకి గురవుతున్న తీరు
న్యూఢిల్లీ : దేశంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు దోపిడీకి గురవుతున్నారు. వారికి చెల్లించే గౌరవవేతనం చాలా తక్కువ. కనీస వేతనానికి కూడా వారు నోచుకోవటంలేదు. దీంతో వీరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పిల్లల అభివృద్ధి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిటీ బెస్డ్ ప్రోగ్రామ్ అయిన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీం కింద అంగన్వాడీ వర్కర్స్గా సుమారు 14 లక్షల మంది మహిళలు పని చేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మరో తొమ్మిది లక్షల మంది మహిళలు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశా)గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, వీరంతా వెనకబడిన వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. చిన్నారులు, మహిళల ఆరోగ్య సంరక్షణ విషయంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తల కృషి ఎనలేనిది. ఈ క్రమంలో వారు అధిక పని భారం, ఆలస్యమైన చెల్లింపులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ, విధులను మాత్రం ఎలాంటి అలసత్యం లేకుండా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, కరోనా మహమ్మారి సమయంలో వారి కృషి ఎనలేనిదని ఆరోగ్య, వైద్య నిపుణులు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి సంక్రమణ వ్యాప్తిని గుర్తించడం, ట్రాక్ చేయడం, లాక్డౌన్ సమయంలో వెనుకబడిన వారికి సదుపాయాలను చేర్చటం వంటి పనులను వీరు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ యోధులుగా వారిని కార్మికులుగా గుర్తించి వారికి కనీస వేతనం దక్కేలా చూడాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు నొక్కి చెప్పారు. ఇది ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు ఆర్థికంగా చేయూతనివ్వడమే కాకుండా వారికి కుటుంబంలో, సమాజంలో ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తుందని సామాజిక కార్యకర్తలు తెలిపారు.