Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కార్యాలయానికి నిప్పు
- నేతలు, కార్యకర్తలపై దాడి
అగర్తలా : త్రిపురలో బీజేపీ అరాచకం కొనసాగుతున్నది. ప్రతిపక్ష సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఈనెల 6, 7 తేదీల్లో రెండు రోజుల వ్యవధిలో మూడు హంసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. సాక్ష్యాత్తూ పోలీసుల సమక్షంలోనే కమల్పూర్ సబ్‌డివిజన్ పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టారంటే బీజేపీ గూండాలు అధికారాన్ని అండగా చూసుకొని ఎంతగా బరితెగించారో అర్ధం చేసుకోవచ్చు. 6న బీజేపీ అరాచకశక్తులు సీపీఐ(ఎం) సీనియర్ నేత, కమల్పూర్ సబ్‌డివిజన్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు రంజిత్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయమైన రంజిత్ ఘోష్ అగర్తలాలోని త్రిపుర మెడికల్ కాలేజ్‌లో చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరోసభ్యులు మాణిక్ సర్కార్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్ దేవ్ ఆసుపత్రికి వెళ్లి రంజిత్ ఘోష్‌ను పరామర్శించారు.ఈనెల 7వ తేదీ రాత్రి బీజేపీ కార్యకర్తలు ఇదే కమల్పూర్ సబ్‌డివిజన్ కార్యాలయానికి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. పోలీసుల సమక్షంలోనే వారు ఈ దాష్టీకానికి పాల్పడడం గమనార్హం. ఈ ఘటనలో రెండంతస్తుల కార్యాలయ భవనంలోని ఫర్నీచర్‌తో పాటు ముఖ్యమైన పేపర్లు కాలిపోయాయి. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక శకటాలను కూడా బీజేపీ గూండాలు అడ్డుకొని విధ్వంసం సృష్టించారు. అదేరోజున రాత్రి పశ్చిమ త్రిపుర జిల్లాలోని కొబ్రాఖమర్ మార్కెట్ ప్రాంతంలో ఉండే సిపిఎం కార్యాలయంపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. పార్టీ నేతలపై, కార్యాలయాలపై దాడులను సిపిఎం తీవ్రంగా ఖండించింది. నిందితులను తక్షణం అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.