Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన మొండి బాకీలు
- పెరిగిన వడ్డీ ఆదాయం
- ఒత్తిడిలో ప్రయివేటు విత్త సంస్థలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మెరుగైన ప్రగతిని కనబర్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో బ్యాంక్‌ల స్థూల మొండి బాకీలు తగ్గాయి. దేశంలోని 28 ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంక్‌లు నిరర్థక ఆస్తుల కోసం చేసే కేటాయింపులు ఏడాదికేడాదితో పోల్చితే 6.8 శాతం, వరుస త్రైమాసికంతో పోల్చితే 43.8 శాతం తగ్గి రూ.36,805.4 కోట్లుగా నమోద య్యాయి. గడిచిన జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల కేటాయింపులు ఏడాది కేడాదితో పోల్చితే ఏకంగా 27శాతం దిగివచ్చాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి దిగ్గజ పీఎస్‌బీల కేటాయింపులు రెండంకెల స్థాయిలో తగ్గడంతో బ్యాంకుల పరపతి పెరిగింది.
మరోవైపు ప్రయివేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ తదితర వాటి కేటాయింపులు 57శాతం పెరిగాయి. దీంతో మొత్తం ఎన్‌పీఏల్లో వీటి వాటా 42.5 శాతానికి ఎగిశాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 26.1 శాతంగా ఉంది. గడిచిన క్యూ1లో మొత్తం బ్యాంకుల నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 4.8 శాతం పెరిగి రూ.1.2 లక్షల కోట్లకు చేరింది. కాగా ఇందులో ప్రయివేటు బ్యాంకుల వాటా గతేడాదితో పోల్చితే 41.7 శాతం నుంచి 23.8శాతానికి పెరిగింది.
ఇదే సమయంలో బ్యాంక్‌ల కోవిడ్ కేటాయింపులు 34,641 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం మార్చి త్రైమాసికంలో ఈ కేటాయింపులు రూ.29,892 కోట్లుగా ఉన్నాయి. ఈ కేటాయింపుల్లో పిఎస్‌బిల వాటా 26.7 శాతం నుంచి 34.7 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఎస్బీఐ 55.24 శాతం వృద్థితో రూ.6,504 కోట్ల నికర లాభాలు సాధించింది. త్రైమాసిక ఫలితాల్లో ఇది వరకు ఎప్పుడూ ఈ స్థాయి రికార్డ్ లాభాలను ఆర్జించలేదు. బ్యాంక్ నికర వడ్డీపై ఆదాయం (ఎన్ఐఐ) 12 శాతం పెరిగి రూ.27,638 కోట్లకు చేరింది. బ్యాంక్ రుణ పుస్తకం ఆశ్చర్యకరంగా కేవలం 5.8 శాతం పెరుగుదలతో రూ.25.23 లక్షల కోట్లకు చేరింది.