Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు
- పార్లమెంట్ వెలుపల కూడా 14 ప్రతిపక్షాలు ఐక్యం
- గ్లోబల్ కార్పొరేట్లకు పందారం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : మోడీని గద్దె దించి, దేశాన్ని కాపాడాల్సిన (క్విట్ మోడీ..సేవ్ ఇండియా) అవసరం ఉన్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం అన్నారు. ఇప్పటికే కార్మికులు, రైతులతో సహా ఇతర ప్రజా సంఘాలు క్విట్ మోడీ..సేవ్ ఇం డియా నినాదంతో పోరాడుతున్నారనీ, ఆయా ఉద్యమాలకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని అన్నారు. సోమవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగిన సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసినట్టు తెలిపారు. అలాగే దేశంలోని రాజకీ య, ఆర్థిక పరిస్థితులపైన, సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభలపైన చర్చించినట్టు చెప్పారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడుతాయని తెలిపారు. పార్లమెంట్ వెలుపల కూడా 14రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడుతున్నా యని చెప్పారు. గతేడాదిన్నరగా వివిధ అంశాలపై ప్రతిపక్షాలన్నీ సంయుక్తంగా ప్రకటనలు విడుదల చేశాయనీ, రాష్ట్రపతిని కలిశామని తెలిపారు. దాన్ని కొనసాగిస్తామని వివరించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటములు ఏర్పడ్డాయనీ, విజయవంత మైందని తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల గురించి ఇంకా ఆలోచించ లేదనీ, ముందు జాతీయ స్థాయిలో కలిసి పోరాడుతామని తెలిపారు. ఎన్నికలు వచ్చిన ప్పుడు పొత్తులు, కూటములు గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్లో కేంద్ర చేసే పన్నుల బిల్లు గ్లోబల్ కార్పొరేట్లకు పందారం అని అభివర్ణిం చారు. మోడీ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన వాట ిపై కాకుండా, కార్పొరేట్లకు అవసరమైన బిల్లులను మాత్రమే ప్రాధాన్యంగా తీసుకుంటుందని అన్నారు.
పెగాసస్‌పై విచారణకు మోడీ సర్కార్ మౌనమెందుకు..
పెగాసస్‌పై మెక్సికో, ఫ్రాన్సులు విచారణ చేస్తు న్నాయని, కానీ పెగాసస్‌పై విచారణ జరిపేందుకు మోడీ సర్కార్ ఎందుకు సిద్ధపడటం లేదని ప్రశ్నించారు. పెగాసస్‌ను దేశ ప్రజలపై ప్రయోగించి దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో విద్యా సంస్థలు పున్ణప్రారంభమయ్యాయనీ, కానీ పరిస్థితులు అంత మెరుగ్గా లేవన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ అందించీ, త్వరగా విద్యా సంస్థలు ప్రారంభించాలని అన్నారు. అయితే ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ అందలేదని తెలిపారు. ఇలాగైతే విద్యార్థులకు ఇంకె ప్పుడు వ్యాక్సిన్ అందిస్తారని ప్రశ్నించారు. దేశంలో చిన్నారుల అక్రమ రవాణా పెరిగిపోయిందనీ, బాల కార్మికులు పెరిగారని తెలిపారు. అందరికి రెండు డోసుల వ్యాక్సిన్ అందించాలని డిమాండ్ చేశారు.
డోర్‌టూ డోర్ వ్యాక్సిన్ ఇవ్వాలి..
డోర్ టూ డోర్ కరోనా వ్యాక్సిన్ అందించాలని ఏచూరి సూచించారు. దేశంలోని ఆర్థిక వ్యవస్థను అదానీ, అంబానీలకు దోచుపెడుతున్నారనీ, దీనివల్ల దేశానికి నష్టం జరుగుతోందని విమర్శించారు. కరోనా సమయంలో యూరోపియన్ యూనియన్ బడ్జెట్లో 2.1 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించారనీ, అందులో అధిక శాతం నగదు బదిలీ చేశారని తెలిపారు. ఇండియాలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చిన తరువాత తొలిసారి రైతులు తొమ్మిది నెలలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారనీ, ఇదో చారిత్రాత్మక పోరాటమని పేర్కొన్నారు. రైతు ఉద్యమం ప్రారంభం కాకముందే ఆర్డినెన్స్ వచ్చినప్పుడే తమ పార్టీ వ్యతిరేకించిందని తెలిపారు. అవి బిల్లులుగా మారి, చట్టాలు అయ్యేటప్పుడు కూడా తమ పార్టీ పార్లమెంట్లో అడ్డుకునేందుకు ప్రయత్నించిందని వివరించారు. పార్లమెంట్లో రైతులు సమస్యలు లేవనెత్తేందుకు అవకాశం లేదని అన్నారు. రైతు చట్టాలను రద్దు చేయమనీ, కానీ రైతు అంశాలు చర్చిస్తామని ప్రభుత్వం అనడం దారుణమన్నారు. రైతులు డిమాండ్ నెరవేర్చకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని విమర్శించారు.
2022 ఏప్రిల్.. కేరళ కన్నూర్‌లో 23వ అఖిలభారత సీపీఐ(ఎం) మహాసభలు
ఏప్రిల్ 2022లో తమ పార్టీ 23 అఖిల భారత మహాసభలు కేరళలోని కన్నూర్‌లో నిర్వహిస్తామనీ, ఈలోపు శాఖ నుంచి రాష్ట్ర మహాసభల వరకు అన్ని స్థాయిల్లోని మహాసభలు పూర్తి చేస్తామని ఏచూరి తెలిపారు. కేరళలో తమ పార్టీ విధానం అమలు చేశామనీ, ఎంతో మంది సీనియర్ మంత్రులు సైతం పోటీ చేయలేదని తెలిపారు.
తమ విధాన నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని స్పష్టం చేశారు. ప్రస్తుత మహాసభల్లో సైతం 75 ఏండ్లు దాటిన వారిని కేంద్ర కమిటీ నుంచి రిలీవ్ చేస్తామని వెల్లడించారు. గతంలో 80 ఏండ్ల వయస్సు పరిమితి ఉన్న దాన్ని 75 ఏండ్లకు తగ్గించామని చెప్పారు.
కేంద్ర కమిటీ డిమాండ్లు ఇవే..
1.అంతర్జాతీయంగా వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలి. ఉచిత, సార్వజనీన వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను తక్షణమే చేపట్టి వేగిరపరచాలి. కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలి, ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను విస్తృతంగా విస్తరించాలి.
2.ఆదాయపన్ను పరిధికి వెలుపల కుటుంబాలన్నింటికీ నెలకు రూ.7500 చొప్పున నగదు బదిలీ సరఫరా చేయాలి.
3.అవసరంలో వున్నవారందరికీ రోజువారీ అవసరమయ్యే వస్తువులతో కూడిన ఆహార కిట్లను ఉచితంగా పంపిణీ చేయాలి.
4.పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ఎక్పైజ్ సుంకాల పెంపును ఉపసంహరించుకోవాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి.
5.వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. సిటు ప్లస్ 50శాతం కనీస మద్దతు ధరతో ఉత్పత్తులను విక్రయించుకునేందుకు చట్టబద్ధమైన హక్కు కల్పించాలి.
6.ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించడాన్ని ఆపివేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి.
7. సమ్మెల ద్వారా నిరసన తెలియచేసేందుకు, వేతనాలపై బేరసారాలకు కార్మికులకు గల హక్కులను పునరుద్ధరించాలి.
8. చిన్న, మధ్య తరహా సంస్థల పునరుద్ధరణ కోసం ద్రవ్య ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాలి. రుణాలు అందించడం కాదు.
9.రెట్టింపు వేతనంతో కనీసం 200 రోజులు పని దొరికేలా హామీ కల్పిస్తూ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి.
10. ఇదే తరహాలో పట్టణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని రూపొందించాలి.
11.ఉద్యోగాలు కల్పించి, దేశీయ డిమాండ్‌ను పెంచేలా మన ఆర్థిక, సామాజిక మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళలను భర్తీ చేయాలి.
12.విద్యా సంస్థలు త్వరగా పున: ప్రారంభించడానికి వీలుగా టీచర్లు, సిబ్బంది, విద్యార్ధులకు వ్యాక్సిన్ వేయడంలో ప్రాధాన్యత ఇవ్వాలి.
13..ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జ్యుడీషియల్ దర్యాప్తుకు తక్షణమే ఆదేశించాలి.
14.గత ఒప్పందాన్ని రద్దు చేసి, అధిక వ్యయంతో కొత్త ఆర్డన్ పెడుతూ కుదుర్చుకున్న రాఫెల్ ఒప్పందంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలి.
15.బీమా కొరెగావ్ కేసులో, సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టయి, జైళ్లలో మగ్గుతున్న వారితో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
కేంద్ర కమిటీ పిలుపు
పై డిమాండ్ల ప్రాతిపదికగా దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపిచ్చింది. కరోనా మహమ్మారి పరిస్థితులు, లాక్డౌన్లను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబరు మాసంలో రాష్ట్ర కమిటీలు, కింది స్థాయి శాఖలు పోరాటాలను, ఆందోళనలను చేపట్టాలని కోరింది. ఆ నెలలో జరిగే నిరసన కార్యాచరణ వివరాలను రాష్ట్ర కమిటీలు నిర్ణయిస్తాయి.
పై డిమాండ్ల పరిష్కారం కోసం జరిగే ఈ నిరసన కార్యాచరణలో చేతులు కలిపేందుకు సుముఖంగా వున్న ఇతర వర్గాలను కూడా సమీకరించేందుకు కృషి జరగాలి.
దేశవ్యాప్తంగా క్విడ్ ఇండియా దినోత్సవాన్ని పాటించాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపునకు ఇప్పటికే సిపిఎం మద్దతునిచ్చింది.