Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనావేళ ప్రయివేటు హాస్పిటల్స్ ఇష్టారాజ్యం
- వైద్యచికిత్సలో రూ.లక్షల్లో ఫీజులు వసూలు
- క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్.. ఉన్నా ప్రయోగించని కేంద్రం
- నిటి ఆయోగ్ నుంచి వివాదాస్పద నివేదిక
- లాభాలు బాగున్నాయి.. అంటూ ప్రయివేటుకు ఆహ్వానం
ఢిల్లీలో పేరొందిన ప్రయివేటు హాస్పిటల్స్‌లో అదొకటి. శ్వాసతీసుకోవటం కష్టంగా ఉందని 45ఏండ్ల వ్యక్తి ఆ హాస్పిటల్లో చేరాడు. ఆక్సీజన్ బెడ్ దొరికింది..హమ్మయ్య అని రోగి బంధువులు ఊపిరి తీసుకున్నారు. ఐసీయూలో చికిత్స చేస్తున్నాం.. పరిస్థితి మెరుగుపడిందని హాస్పిటల్ సిబ్బంది రోగి బంధువులకు తెలియజేశారు. ఐదు రోజులదాకా పేషెంట్‌ను బంధువులకు చూపలేదు. హఠాత్తుగా
ఓ రాత్రి పేషెంట్‌ను వెంటిలేటర్ మీదకు తీసుకెళ్లామని చెప్పారు. కొన్ని గంటల తర్వాత రోగి మరణించాడని తెలియజేశారు. ఏడు రోజులకుగానూ 5లక్షల బిల్లు రోగి బంధువుల చేతిలో పెట్టారు.
న్యూఢిల్లీ : రోగికి ఎలాంటిచికిత్స చేశారన్న దానితో సంబంధం లేకుండా..లక్షల రూపాయలు బిల్లు వేసి ప్రయివేటు హాస్పిటల్స్ దోచుకున్న ఉదంతాలకు పై ఘటన ఒక ఉదాహరణ. కరోనా సంక్షోభాన్ని ఒక వ్యాపార అవకాశంగా మలుచుకొని ప్రయివేటు హాస్పిటల్స్ ఎంతలా దోపిడి చేశాయో అందరికీ అనుభవ మైంది. సామాన్యుల నుంచీ అత్యంత ధనికుల వరకూ బాధితులే. ఢిల్లీ, బెంగుళూరు, ముంబయి, హైదరాబాద్...ఇలా దేశంలోని అన్ని నగరాల్లోనూ ఇలాంటి ఉదంతాలకు అంతేలేదు. ప్రయివేటు హాస్పిటల్స్‌ను నియంత్రించడానికి, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వాలు ఏమీ చేయలేవా? అని దేశంలోని ప్రతి పౌరుడూ ఆందోళన చెందుతున్నాడు. వీటిని నియం త్రించే వ్యవస్థ, చట్టాలు లేవా అని వారు ప్రశ్నిస్తు న్నారు. ప్రయివేటు హాస్పి టల్స్ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని ఆరోగ్య నిపుణులు, సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి ఎప్పుడో బ్రిటిష్ కాలంనాటి చట్టాల్ని ప్రయోగించే మోడీ సర్కార్, ప్రయివేటు హాస్పిటల్స్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టకపోవటం దారుణ మని వారు విమర్శించారు. జాతీయ విపత్తు నిర్వహణాచట్టం, రాష్ట్రాలఅంటువ్యాధుల చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మేంట్ చట్టాల్ని ప్రయోగించి ప్రయివేటు హాస్పిటల్స్ అడ్డగోలు దోపిడిని అడ్డుకోవచ్చునని, అయితే కేంద్రం ఆ పని చేయలేదని విమర్శలున్నాయి.
ఆయుధమున్నా..ఫలితం లేదు..
క్లినికల్ ఎస్టాబ్లిష్మేంట్ యాక్ట్ 2012లో నోటిఫై అయ్యింది. ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తే..ప్రయివేటు హాస్పిటల్స్‌లో వైద్య చికిత్స సామాన్యులకు అందుబాటులో ఉంటుందని సామాజికవేత్తలు చెబుతున్నారు. హాస్పిటల్లో వైద్య చికిత్స, నర్సు, డాక్టర్ల ఫీజులు, ల్యాబ్ పరీక్షల ఫీజులు, ఇతర రుసుములు ఎలా విధించాలి..అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చు. ఈ ధరల పట్టికను ప్రయివేటు హాస్పిటల్ అమలుజేసేలా ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేయాలి. నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే ఆ హాస్పిటల్స్‌పై వెంటనే చర్యలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇవేవీ ఏ రాష్ట్రంలోనూ అమలుకావటం లేదు. మోడీ సర్కార్ తలుచుకుంటే ఇదేమీ పెద్ద విషయమూ కాదు. ప్రయివేటు హాస్పిటల్స్ దోపిడిపై ఆయా రాష్ట్రాల్లో హైకోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తే..కొన్ని కేసుల్లో (కరోనా చికిత్సల్లో) బాధితులకు న్యాయం జరిగింది.
కరోనాతో లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి, 'క్లినికల్ ఎస్టాబ్లిష్మేంట్ యాక్ట్'ను అమల్లోకి తీసుకురావాలని స్వచ్ఛంద సంస్థలు అనేకం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అందుబాటు ధరల్లో, నాణ్యమైన వైద్య సేవలు పొందే హక్కు పౌరులకు ఉందని 'జన్ స్వాస్థ అభియాన్' సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో తెలిపింది. దేశవ్యాప్తంగా క్లినికల్ ఎస్టాబ్లిష్ మేంట్ చట్టాన్ని అమలుజేయాలని కోరింది. అయితే ఈ ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. వీటిపై కేంద్రం ఆసక్తి చూప లేదు. చట్టంలోని నిబంధనలు అమల్లోకితేవటం మోడీ సర్కార్ ఇష్టం లేదని స్పష్టమైంది.
నిటి ఆయోగ్‌కు ఇది తగునా?
''కోవిడ్-19 సంక్షోభం పెట్టుబడులకు మంచి అవకాశం. టైర్-2, టైర్-3 నగరాల్లో మీ హాస్పిటల్ వ్యాపారాన్ని విస్తరించుకోండి'' అంటూ నివేది కలో నిటిఆయోగ్ పేర్కొనటంపై సామాజికవేత్తలు ఆగ్రహంవ్యక్తం చేస్తు న్నారు. కరోనాబారిన పడ్డవారికి ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మెరుగైన వైద్యం అం దించటం ఎలా? అనేదాని గురించి నిటి ఆయోగ్ ఆలోచించటం లేదు. కరో నా సమస్యను వ్యాపార అవకాశంగా మలుచుకోమని సూచిస్తోంది. కరోనాతో ప్రజల ప్రాణాలు పెద్ద సంఖ్యలో పోతుంటే..దీనిని ఒక వ్యాపార, పెట్టుబడి అవకాశంగా నిటి ఆయోగ్ భావిస్తోంది. ''దేశంలో వయో వృద్ధులు, మధ్య తరగతి పౌరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆరోగ్యరంగంలో ప్రయివేటుకు వీరంతా వినియోగదారులు. మీరు పెట్టే పెట్టే పెట్టుబడికి పదింతలు సంపాదించుకోవచ్చు. నిబంధనలు, షరతులు..అంటూ ఏమీలేవు. వైద్య చికిత్సల్లో రుసుములు మీ ఇష్టం. రండి పెట్టుబడులు పెట్టండి'' అంటూ నిటి ఆయోగ్ ఇటీవల ఒక నివేదిక (ఇన్వెస్ట్మెంట్ అపార్చునుటీస్ ఇన్ ఇండియాస్ హెల్త్‌కేర్ సెక్టార్) విడుదల చేసింది.