Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి... సమ్మతి తెలిపిన ప్రతిపక్షాలు
- పార్లమెంట్లో మిగతాఅంశాలపై కొనసాగిన ఆందోళన
- రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్
- ఉభయ సభల్లో పలు బిల్లుల ఆమోదం
న్యూఢిల్లీ : ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు పలి కాయి. సోమవారం పార్లమెంట్లో 14 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంట్లో వ్యవహరించాల్సిన వ్యూహం గురించి చర్చించిన ప్రతిపక్ష పార్టీ నేతలు, కేంద్ర తీసుకొస్తున్న ఓబీసీ బిల్లుపై కూడా చర్చించారు. అనంతరం ప్రతిపక్షనేతలు మీడియాతో మాట్లాడుతూ ఓబీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. పెగాసస్, రైతు సమస్యలు, ధరలు పెరుగుదల సహా పలు అంశాలపై ఆందోళనలు చేస్తూ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు, ఓబీసీ బిల్లు విషయంలో మాత్రం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం ప్రభుత్వం తరఫున కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్ సోమవారం లోక్‌సభలో 127వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని వెల్లడించాయి. ఇది చాలా ముఖ్యమైన అంశ మనీ, అందుకే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్టు ప్రతిపక్ష నేతలు చెప్పారు. ఈబిల్లు ఓబీసీ జాబితాను నిర్వ హించే అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టనున్నది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెను కబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనున్నది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. కాగా.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్న నేపథ్యంలో ఓబీసీల మద్దతు సంపాదించుకోవడం కోసమే బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహాత్మకంగా ఈ బిల్లును తీసుకొస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రాజ్యసభలో వాయిదాల పర్వం..
పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనతో సోమవారం కూడా వాయిదాల పర్వం మొదలైంది. రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో కొద్ది నిమిషాలకే సభ అరగంటపాటు వాయిదా పడింది. ఆ తరువాత ఉదయం 11.30 గంటలకు మళ్లీ మొదలైనా ప్రతిపక్షాల నిరసనలు ఆగలేదు. పలుమార్లు వాయిదాల పర్వం తొక్కిన లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. పెగాసస్‌పై చర్చ జరపాలని పట్టుపడుతూ ప్రతిపక్ష నేతలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఎంత సేపు బిల్లులు ఆమోదించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
ఒలింపిక్ విజేతలకు అభినందనలు
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు నీరజ్ చోప్రా, భజరంగ్ పునియా, పివి సింధు, లవ్లీనా, మీరాబాయి చాను, రవి దహియా, హాకీ జట్టు క్రీడాకారులకు ఉభయ సభలు అభినందనలు తెలిపాయి. కాగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య చర్చ లేకుండానే ఉభయ సభల్లో బిల్లులు ఆమోదం పొందాయి. లోక్‌సభలో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (సవరణ) బిల్లు, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, రాజ్యాంగ సవరణ (గిరిజన తెగలు) ఆర్డర్ బిల్లు ఆమోదం పొందాయి.