Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ హైకోర్టు తీర్పును స్వాగతించిన ఐద్వా
న్యూఢిల్లీ : విడాకులు మంజూరు చేసేందుకు వైవాహిక అత్యాచారాన్ని ఒక కారణంగా తీసుకోవచ్చని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఐద్వా మంగళవారం ఒక ప్రకటనలో స్వాగతించింది. వైవాహిక లైంగికదాడిని శిక్షా చట్టం కింద నేరంగా పరిగణించాలనీ, అదేవిధంగా వివాహంలో మహిళలకు సమాన ఆస్తి హక్కును కల్పించాలన్న డిమాండ్‌ను ఐద్వా ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. భార్యకు ఇష్టం లేకుండా ఆమెతో భర్త శృంగారంలో పాల్గొనడం వైవాహిక లైంగికదాడి కిందకు వస్తుందని కేరళ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విడాకులు మంజూరు చేయదగ్గ క్రూరత్వంగా దాన్ని పరిగణించడంలో కోర్టుకు అది అడ్డు కాబోదని స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ అన్నిరకాల శారీరక, మానసిక హింసను గుర్తించింది. దీంతో పాటు వైవాహిక లైంగికదాడికి పాల్పడడం ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ వైవాహిక లైంగికదాడి అనేది తీవ్రమైన నేరంగా సరైనా గుర్తింపులేదు. ఈ సందర్భంలో హైకోర్టు తీర్పు స్వాగతించదగినదని ఐద్వా తన ప్రకటనలో అభిప్రాయపడింది.
కేరళ హైకోర్టు ఏం చెప్పింది?
భార్య శరీరంపై తనకు పూర్తిగా హక్కులు ఉన్నట్టు భర్త భావించడం, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారం చేయడం వైవాహిక లైంగికదాడి కిందకే వస్తుందని పేర్కొంది. విడాకులు మంజూరును సవాల్ చేస్తూ ఒక వ్యక్తి చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా కోర్టు పైవ్యాఖ్యలు చేసింది. భార్యను చరాస్తిగా భావించే, లైంగిక సంబంధాల్లో ఆమె ఎంపికను పట్టించుకోని పాత బ్రిటిష్ చట్టాలను మన దేశంలో రద్దు చేసిన విషయాన్ని కేరళ హైకోర్టు గుర్తుచేసింది. ప్రస్తుత ఆధునిక సమాజంలో భార్యభర్తలిద్దరినీ సమాన హక్కుదారులుగా పరిగణిస్తారని, భార్యపై భర్తకు ఆధిపత్య హక్కులేవీ ఉండవని ధర్మాసనం స్పష్టం చేసింది.