Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2019-20లో బీజేపీ ఆదాయం 3623కోట్లు
- రూ.130.46కోట్లు ఆదాయం చూపిన టీఆర్ఎస్
- ఎన్నికల బాండ్లలో మూడోవంతు బీజేపీవే..
- కాంగ్రెస్ ఆదాయం 682కోట్లు.. ఖర్చు రూ.998కోట్లు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం అధికార బీజేపీకి కనకవర్షం కురిపిస్తోంది. దేశంలో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. ఆర్థిక సంవత్సరం 2019-20లో పార్టీకి సమకూరిన మొత్తం ఆదాయం రూ.3623కోట్లుగా ఉందని ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికలో బీజేపీ పేర్కొంది. ఇందులో ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన విరాళాలు రూ.2555కోట్లు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి జాతీయ, ప్రాంతీయ పార్టీలు 2019-20 ఏడాదికి సంబంధించి ఆడిట్ నివేదికలు సమర్పించాయి. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపర్చారు. బీజేపీ ఆడిట్ నివేదిక ప్రకారం 2019-20లో పార్టీకి సమకూరిన మొత్తం ఆదాయం రూ.3623కోట్లు. ఇందులో రూ.2555కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చింది. ప్రకటనల కోసం రూ.400కోట్లకుపైగా ఖర్చుచేసినట్టు చూపారు. 2018-19లో రూ.2410కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇతర జాతీయ పార్టీల విషయానికొస్తే, 2019-20లో కాంగ్రెస్ ఆదాయం రూ.682కోట్లు, వ్యయం రూ.998కోట్లుగా ఉంది. టీఎంసీ-రూ.143.67కోట్లు, బీఎ స్పీ-రూ.58.25కోట్లు, ఎన్సీపీ-రూ.85.58కోట్లు, ప్రాంతీయ పార్టీల్లో.. టీఆర్ఎస్- రూ.130.46కోట్లు, వైఎస్ఆర్కాంగ్రెస్-రూ.92.73కోట్లు, టీడీపీ-రూ.91.5కోట్లు, బీజేడీ-రూ.90.35 కోట్లు, ఏఐఏడీఏంకే-రూ.89కోట్లు ఆదాయంగా చూపాయి.
ఎన్నికల బాండ్లు..
ఆర్థిక సంవత్సరం 2019-20లో ఎన్నికల బాండ్ల ద్వారా వివిధ పార్టీలకు అందిన మొత్తం విరాళాలు రూ.3435కోట్లుకాగా,ఇందులో రూ.2555కోట్లు (సుమారుగా 74శాతం) బీజేపీకి దక్కాయి.క్రితం ఏడాదితో (2018-19లో రూ.1450కోట్లు) పోల్చుకుంటే బీజేపీకి అంది న ఎన్నికల విరాళాలు 21శాతం నుంచి 74శాతానికి పెరిగాయి. బాండ్ల విరాళాల్లో పెరుగుదల 50శాతం దాటింది. సార్వత్రిక ఎన్నికలు జరిగిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1651కోట్లు వ్యయం చేసినట్టు లెక్కలు చూపారు.ప్రస్తుతం పార్టీకి చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు రూ.3501కోట్లు. ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టిన మూడేండ్ల లోనే పార్టీ విరాళాలు దాదాపు 10రేట్లు పెరిగాయి.2017-18లో రూ.210కోట్లు, 2019-20లో రూ.2555కోట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ సమర్పించిన ఆడిట్ నివేదిక ప్రకారం, 2018-19లో రూ.383కోట్లు రాగా, 2019-20లో రూ.318కోట్లు వచ్చాయి. మొత్తం ఆదాయం రూ.682కోట్లు, వ్యయం రూ.998కోట్లుగా ఉందని పేర్కొన్నారు.ఎన్నికల బాండ్ల పథకం కింద ఇక ఇతర పార్టీలకు వచ్చిన విరాళాలు ఈ విధంగా ఉన్నాయి. ఎన్సీపీకి రూ.29.25కోట్లు, తృణమూల్‌కు రూ.100.46కోట్లు, డీఎంకేకు రూ.45కోట్లు, శివసేనకు రూ.41కోట్లు, ఆర్జేడీకి రూ.2.5కోట్లు, ఆప్ పార్టీకి రూ.18కోట్లు అందాయి.