Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ ఎత్తుగడలు
- ఓటర్లు ప్రభావితం చేస్తుందంటున్న విశ్లేషకులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఇప్పటి నుంచే ఓటర్లకు గాలం వేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా పలు కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభిస్తున్నాయి. ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసిన 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రారంభించిన 'ఉజ్వల' ను మళ్లీ 2022 ఎన్నికల ముందు యూపీలో ఉజ్వల 2.0ను బీజేపీ సర్కారు ప్రారంభిస్తోంది. ఇదివరకు ప్రధాని మోడీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2016లో బల్లియాలో ఉజ్వల స్కీమ్‌ను ప్రారంభించారు. మళ్లీ ఎన్నికలు జరగబోయే దాదాపు ఏడాది ముందు యూపీలో రెండో విడుత కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. మొదటి విడుతలో ఐదు కోట్ల బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు లక్ష్యంగా ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అనంతరం 2018లో పథకాన్ని మరో ఏడు వర్గాలకు వర్తింపజేస్తూ.. లక్ష్యాన్ని ఎనిమిది కోట్లకు సవరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో పీఎంయూవై పథకం కింద అదనంగా కోటి గ్యాస్ కనెక్షన్లను కేంద్రం ప్రకటించింది. తొలి దశలో ఎల్పీజీ అందుకోలేకపోయిన తక్కువ ఆదాయ కుటుంబాలకు అందించాలని నిర్ణయించింది. ఈసారి పొడిగించబడిన పథకం కింద దేశవ్యాప్తంగా మరో 10 మిలియన్ ఎల్పీజీ కనెక్షన్లు అందించబడతాయి. ఈ కనెక్షన్లలో ఎక్కువ భాగం యూపీ ఉంటుందని భావిస్తున్నారు.
కాగా, యూపీలో 14.7 మిలియన్లకు పైగా కుటుంబాలు ఉజ్వల 1.0 కింద ప్రయోజనం పొందాయి. ఇది రాష్ట్ర జనాభాలో దాదాపు సగం కవర్ చేసింది. జూన్ 2019లో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం 18 శాతం కనెక్షన్లతో ఈ పథకంలో యూపీ అత్యధిక వాటాను కలిగి ఉంది. రాజకీయ నిపుణుల ప్రకారం.. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయంలో ఉజ్వల కీలక పాత్ర పోషించింది. ఉజ్వల 2.0ను మళ్లీ ప్రారంభించడంతో ఎన్నికల ముందు అణగారిన వర్గాలను ఆకర్షించడంలో మాస్టర్ స్ట్రోక్ కాగలదని అభిప్రాయపడుతున్నారు. ఈ నెల ఐదున ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమం తర్వాత.. ఓటర్లను తమపైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రారంభించిన రెండో కార్యక్రమం ఉజ్వల 2.0. కాగా, ఉజ్వల 2.0 కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ప్లేట్ అందించనున్నారు. ఉజ్వల నమోదు కోసం కనీస ప్రతాలు అవసరం కాగా.. ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే కనెక్షన్ ఇవ్వనున్నారు.