Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఇండియన్ మెరైన్ ఫిషరీస్ బిల్లు'ను ఉపసంహరించుకోవాలని డిమాండ్
- జిల్లా కలెక్టర్లకు సామూహిక వినతి పత్రాలు
చెన్నై: 'ఇండియన్ మెరైన్ ఫిషరీస్ బిల్లు'కు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చాలా గ్రామాల్లో (ఫిషింగ్) మత్స్యకారులు నల్లాజెండాలను ఎగురవేశారు. నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తూనే జిల్లా కలెక్టర్లకు సామూహిక వినతి పత్రాలు అందించారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరిచుకోవాలనే డిమాండ్‌ను వాటిల్లో ప్రస్తావించారు. చెన్నైలోని సముద్ర తీర ప్రాంతాలతో పాటు మెరీనా బీచ్‌ను మత్స్యకారులు ముట్టడించకుండా ఆయా ప్రాంతాల్లో భారీగా బారీకేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. తూత్తుకుడిలో మత్స్యకారులు చేపలు పట్టకుండా ఉండి.. ఈ బిల్లుపై నిరసన వ్యక్తంచేశారు. మత్స్యకార సంఘాల నాయకత్వ సంస్థ అయిన తమిళనాడు-పుదుచ్చేరి మత్స్యకారుల సమాఖ్య పిలుపు మేరకు ఇండియన్ మెరైన్ ఫిషరీస్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ బిల్లు రూపకల్పన విషయంలో మత్స్యకారులు అభిప్రాయాలు, సంబంధిత విషయాల్లో బీజేపీ ప్రభుత్వం సంప్రదింపులు జరపలేదని సంబంధిత సమాఖ్యలు పేర్కొంటున్నాయి. మెరీనా బీచ్‌లో కొనసాగిన నిరసనలకు నాయకత్వం వహించిన కె.భారతి మాట్లాడుతూ.. 'సాంప్రదాయ మత్స్యకారులను ప్రభావితం చేసే సమస్యలను ఈ బిల్లు పరిగణనలోకి తీసుకోలేదు. మత్స్యకారుల నుండి లైసెన్సులు, జరిమానాల పేరిట డబ్బు సేకరించడం మాత్రమే దీని లక్ష్యం. బిల్లు విషయంలో కేంద్రం ఎవరినీ సంప్రదించలేదు. చేపలు పట్టే సమాజ సంప్రదాయాలు, సంస్కృతిని అర్థం చేసుకోలేదు' అని అన్నారు. కాగా, చిన్న చిన్న, ఫైబర్, యాంత్రిక పడవలను చేపలు పట్టే నౌకలుగా పరిగణించే నిబంధన ఈ నిరసనలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 'మీనావమ్ కాపోమ్' (సేవ్ ఫిషింగ్) ఉద్యమానికి చెందిన ధర్మరాజ్ మాట్లాడుతూ.. 'మత్స్యకారులు ఉపయోగించే వివిధ రకాల ఫిషింగ్ బోట్లను అర్థం చేసుకోవడంలో కేంద్రం అజ్ఞానాన్ని ఇది చూపిస్తుంది. సంప్రదాయ మత్స్యకారులు, యజమానులు తమ పడవల్లో అధునాతన పరికరాలను ఏర్పాటు చేసే సామర్థ్యం లేదు.
పెద్ద నౌకలు మాత్రమే అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. అన్ని పడవలను ఒకే కేటగిరీ కిందకు తీసుకురావడం అసంబద్ధం' అని ఆయన అన్నారు. ఈ బిల్లు ఫిషింగ్ వ్యాపార ప్రక్రియను కార్పొరేట్లకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని మత్స్యకారులు భయపడుతున్నారు. ''అనేక ఆంక్షలతో, సాంప్రదాయ మత్స్యకారులు సముద్రం నుండి దూరంగా వెళ్లి చేపలు పట్టవలసి వస్తుంది. ఇది సముద్రాలలో సంపదను దోపిడీ చేయడానికి దారితీస్తుందని'' పేర్కొంటున్నారు. ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని హెచ్చరిస్తున్నారు.