Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై సీజేఐ అసహనం
- ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసులపై ప్రత్యేక ధర్మాసనం
- హైకోర్టుల అనుమతి లేకుండా ఉపసంహరణకు వీల్లేదు
- ఎంపీ, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసులపై సుప్రీం కోర్టు
- 48 గంటల్లో అభ్యర్థుల నేర చరిత్ర వివరాలివ్వాలి
న్యూఢిల్లీ : ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులపై స్టేటస్ రిపోర్టు అందించేందుకు కేంద్రం రెండు వారాల గడువు కోరడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అసహనం వ్యక్తం చేశారు. ''స్టేటస్ రిపోర్టు అందించేందుకు ఎందుకింత సమయం..?కేంద్ర ప్రభుత్వ తీరు సరిగా లేదు. కేంద్రం ఇచ్చిన సమాధానమూ సరిగా లేదు. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నామో సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) అర్థం చేసుకోవాలి. రెండు వారాల గడువు ఇస్తున్నాం. ఇదే చివరి అవకాశం. గడువు పొడిగించడం ఇకపై కుదరదు. పది రోజుల్లో స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలి. ప్రతివాదులందరికీ స్టేటస్ రిపోర్టు అందించాలి'' అని సీజేఐ తెలిపారు.ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా ఉపసంహ రించేందుకు వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులపై కేసులను వేగంగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సెప్టెంబర్ 16 తరువాత నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను ఉపసంహరించిన వివరాలను తెలియజేయాలని హైకోర్టులకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారణ జరుపుతున్న, జరిపిన న్యాయమూర్తుల జాబితాను కూడా అందించాల్సిందిగా అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్ కు ఆదేశించింది. సీబీఐ కోర్టులు, ప్రత్యేక కోర్టులలో తదుపరి ఆదేశాలిచ్చే వరకు విచారణ కొనసాగించాల్సిందిగా ధర్మాసనం పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణ పురోగతికి సంబంధించి అమికస్ క్యూరీ విజరు హన్సారియా నివేదికను సమర్పించారు. ఈ మేరకు అమికస్ క్యూరీ విజరు హన్సారియా సూచనలను ధర్మాసనం అంగీకరించింది.
ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసులపై ప్రత్యేక ధర్మాసనం
ప్రత్యేక కోర్టుల్లో విచారణ పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలనుకున్నట్టు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. దీనిపై ఈ నెల 25న తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.
అమికస్ క్యూరీ నివేదికలోని అంశాలు..
ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై రెండేండ్లలో క్రిమినల్ కేసుల సంఖ్యలో 17 శాతం పెరిగాయి. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను ఉపసంహరిస్తున్నట్టు అమికస్ క్యూరీ నివేదికలో పేర్కొన్నారు. 76 మంది ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోరినట్టు తెలిపారు. ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న సంగీత్ సోమ్, కపిల్ దేవ్, సురేశ్ రాణా, సాధ్వీ ప్రాచిలపై కేసులను ఉపసంహరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోరింది. సీఆర్పీసీ సెక్షన్ 321 కింద అధికారాన్ని ఉపయోగించి కేసుల ఉపసంహరిణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన 4 సందర్భాలను అమికస్ క్యూరీ ప్రస్తావించారు.
48 గంటల్లో అభ్యర్థుల నేర చరిత్ర వివరాలివ్వాలి
నేరమయ రాజకీయాలను కట్టడి చేసే క్రమంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను రాజకీయ పార్టీలు 48 గంటల్లోగా ప్రచురించాలని స్పష్టం చేసింది.న్యాయవాది బ్రజేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బిఆర్ గవైలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 2020 ఫిబ్రవరి 13న ఇచ్చిన తీర్పులో మార్పులు చేస్తూ తాజాగా ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 2020 నవంబర్‌లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నేర చరిత్ర వివరాలు ప్రచురించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల నేర చరిత్ర, పెండింగ్ కేసులు, వారిపై మోపిన అభియోగాలు వంటి సమగ్ర వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాంటి అభ్యర్థిని ఎంపిక చేసిన కారణాన్ని కూడా ప్రస్తావించాలని పేర్కొంది. తొమ్మిది రాజకీయ పార్టీలకు సుప్రీం ధర్మాసనం జరిమానా విధించింది.