Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జై జవాన్.. జై కిసాన్ అంటూ మార్మోగిన నినాదాలు
- రైతు వ్యతిరేక చట్టాలపై ప్రతిపక్షాల ఆగ్రహం.. రాజ్యసభలో ఉద్రిక్తత
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ప్రతిపక్ష పార్టీల సభ్యులు పార్లమెంటులో డిమాండ్ చేశారు. మంగళవారం రాజ్యసభ ప్రారంభం కాగానే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని 'జై జవాన్.. జై కిసాన్', 'కాలా కానున్ వాపస్ లో' (నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలి)' అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో సభ అనేక సార్లు వాయిదా పడింది. ఇలా వాయిదాలు పర్వం తొక్కిన సభలో మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ సమస్యలు, పరిష్కారాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అప్పటికే వెల్‌లో నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. నల్ల చట్టాలను రద్దు చేసిన తర్వాతే వ్యవసాయ రంగ సమస్యలపై చర్చిద్దామని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. తొలుత ఉత్తరప్రదేశ్‌కు చెందన బీజేపీ ఎంపీ విజరు పాల్ సింగ్ తోమర్ చర్చను ప్రారంభించారు. బీజేడీ ఎంపీ ప్రసన్న ఆచార్య మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలనీ, రైతుల డిమాండ్లు పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ చట్టాలు ఆమోదించినప్పుడు కూడా స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు సంబంధించి ఒక్క పదం కూడా లేదనీ, రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్న ప్రభుత్వంలో చలనం రాలేదని విమర్శించారు. ఆయన మాట్లాడుతుండగానే అప్పటికే వెల్‌లో ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాల సభ్యులు తమ ఆందోళనను ఉదృతం చేశారు. ఆప్ ఎంపీ సంజరు సింగ్ ఏకంగా సెక్రెటరీ జనరల్ ముందున్న బెంచ్ ఎక్కి నినాదాలు ఇవ్వడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మార్షల్స్ లోపలకి ప్రవేశించారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో మధ్యాహ్నం 2్ణ16 గంటల సమయంలో సభను ప్యానల్ డిప్యూటీ చైర్మెన్ భువనేశ్వర్ కలిటా 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తరువాత కూడా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోనే ఆందోళన కొనసాగించారు. పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా సిబ్బంది వద్ద ఉన్న రాజ్యసభ నిబంధనల పుస్తకాన్ని తీసుకొని బలంగా విసిరారు. సభలో జరిగిన ఈ గందరగోళానికి సంబంధించిన వీడియోను టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు జై జవాన్..జై కిసాన్ నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించడంతో పలుమార్లు వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యులు శాంతించకపోవడంతో తీవ్ర గందరగోళంలో ఉన్న సభను బుధవారానికి వాయిదా వేశారు. కాగా బల్లలెక్కి ఆందోళన చేసిన సభ్యులపై బుధవారం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశమున్నది.