Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీకా కార్యక్రమాన్ని వేగిరపర్చాలి : సీపీఐ(ఎం)
- అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర కమిటి విశ్లేషణ
- కోవిడ్ అసమర్ధ నిర్వహణ, ముదిరిన ఆర్థిక మాంద్యం
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ప్రకటన
న్యూఢిల్లీ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్ర కమిటీ ఈ నెల 6-8 తేదీల్లో ఇక్కడ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించింది. దీంతోబాటు కేరళ, బెంగాల్, తమిళనాడు, పాండిచ్చేరి, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తుది సమీక్ష నిర్వహించింది. సీపీఐ(ఎం) 23వ మహాసభ నిర్వహణ గురించి కూడా చర్చించింది. సమావేశం అనంతరం కేంద్రకమిటీ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో వివారాలు ఇలా వున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమీక్ష
ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. అసోంలో చాలా స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగింది. ప్రతిపక్ష 'మహాజోత్' కూటమి కన్నా కేవలం 0.78శాతం ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. మతోన్మాద ధోరణులు రెచ్చగొట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నించినా, కనివిని ఎరుగని రీతిలో డబ్బు విచ్చలవిడిగా విరజిమ్మినా, కేంద్ర సంస్థలను, ఎన్నికల యంత్రా ంగాన్ని దుర్వినియోగపరిచినా, ప్రతిపక్ష పార్టీలను, నేతలను అడ్డగించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడినా బీజేపీ, దాని మిత్రపక్షాలు ప్రజల మద్దతును పొందడంలో విఫలమయ్యాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో ఘోరంగా అపజయం పాలయ్యాయి.
కేరళ : కేరళలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ఘన విజయం సాధించడాన్ని కేంద్ర కమిటీ ప్రశంసించింది. ఎల్డీఎఫ్ పట్ల విశ్వాసాన్ని వుంచి, ప్రస్తుత ప్రభుత్వాన్నే అసాధారణ రీతిలో తిరిగి ఎన్నుకున్నందుకు కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసింది. గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈసారి ఎల్డీఎఫ్ ఫలితాలు మరింత మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది.
ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, అది చేపట్టిన ప్రత్యామ్నాయ విధానాలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న తీరు, కరోనా మహమ్మారిని, దాని ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న తీరు చూసి, కేరళ సమాజ లౌకిక, ప్రజాస్వామ్య, సామరస్య స్వభావాన్ని పరిరక్షిస్తూ, తీసుకున్న సంక్షేమ చర్యలను మెచ్చి కేరళ ప్రజలు మళ్లీ పట్టం గట్టారు.
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్లో ధన బలంతో సహా అన్ని రకాల కుయుక్తులకు పాల్పడినా బీజేపీకి పరాభవం తప్పలేదు. మత సమీకరణల సిద్ధాంతాన్ని బెంగాల్ ప్రజలు నిర్వ్దంద్వంగా తోసిపుచ్చినట్టు ఇది స్పష్టం చేస్తుంది.
సీపీఐ(ఎం), వామపక్ష సంఘటనకు సంబంధించినంత వరకు ఈ ఫలితాలు చాలా పెద్ద దెబ్బ. ఒక్క కమ్యూనిస్టు కూడా అసెంబ్లీకి ఎన్నిక కాకపోవడం 1946 తర్వాత ఇదే మొదటిసారి. ఈ ఫలితాలపై కేంద్ర కమిటీ చాలా పదునైన రీతిలో, ఆత్మ విమర్శ, ఆత్మావలోకనం చేసుకున్నది. గుణపాఠాలు తీసుకున్నది. చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలను పేర్కొంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ వీటిని చర్చించి, ఈ సమీక్షను అమలులో పెట్టాల్సి ఉంటుందని కేంద్ర కమిటీ పేర్కొంది.
తమిళనాడు : విజయం సాధించిన డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా, ఇద్దరు సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు గెలిచారు.
అసోం : మహాజోట్తో సీట్ల సద్దుబాటులో భాగంగా సోర్భోగ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) గెలుపొందింది.. పదేండ్ల విరామం అనంతరం అసెంబ్లీలో పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఈ రాష్ట్రాలన్నింటిలో ఎన్నికల అనంతర పరిస్థితుల్లో పార్టీ చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర కమిటీలు తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించింది.
రాజకీయ పరిణామాలు
కోవిడ్ మహమ్మారి పరిస్థితి : కరోనా ఇన్ఫెక్షన్లు పెరుగుతూనే వున్నాయి. థర్డ్ వేవ్‌ను నివారించేందుకు గాను వ్యాక్సినేషన్ రేటును గణనీయంగా పెంచాల్సిన అవసరం తప్పక ఉన్నది. ప్రస్తుతం, మన జనాభాలో 11.3శాతం మంది యువతే రెండు డోసులు వేయించుకున్నారు. 40శాతం ( 11.3శాతం మంది ఇందులో వున్నారు) మంది ఒక్క డోసు వేయించుకున్నారు. ఈ లెక్కన చూస్తే, మొత్తం యువతకు వ్యాక్సినేషన్ ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరడం అసాధ్యం. ప్రధానంగా వ్యాక్సిన్ల కొరత వల్లే వ్యాక్సినేషన్ క్రమం నత్తనడకన సాగుతున్నది. ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే రోజుకు కోటి మందికి వ్యాక్సిన్లు వేయాల్సి వుంటుంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే అంతర్జాతీయంగా వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలి, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఉధృతం చేయాలి.
కోవిడ్ అసమర్ధ నిర్వహణ, ముదిరిన ఆర్థిక మాంద్యం :
కోవిడ్‌ను కేంద్ర ప్రభుత్వం సమర్ధవంతమైన రీతిలో ఎదుర్కొ నలేకపోవడం, కేంద్రం అనుసరిం చిన విధానాలతో ఆర్థిక వ్యవస్థ విధ్వంసమవ్వడంతో దేశ ప్రజలపై తీవ్రమైన భారాలు పడ్డాయి. నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో దారిద్య్రం కూడా ఆందోళనకరరీతిలో పెరుగుతున్నది. అసలే ఉద్యోగాలు లేకపోవడం, పైగా తక్కువ ఆదాయాలు, పెరుగుతున్న ధరలతో రెండు వైపులా దాడి చేయడంతో ప్రజల జీవనోపాధి దెబ్బ తింటోంది. కుటుంబాలు రుణ ఉచ్చులోకి నెట్టబడుతున్నాయి.
ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి, ప్రజలకు ఉపశమనం కలిగించడానికి బదులుగా కేంద్రంలోని ఈ బీజేపీ ప్రభుత్వం భారత దేశ సహజ వనరులను, ఆస్తులను, ప్రజల సంపదను పెద్ద ఎత్తున ప్రయివేటీకరణ చర్యల ద్వారా తీవ్రంగా కొల్లగొడుతోంది. మతోన్మాద రాజకీయ ధోరణులు పెచ్చరిల్లేలా చేస్తున్నది. దానికి తోడు మహిళలు, దళితులు, ఆదివాసీలపై దాడులు పెరుగుతున్నాయి. ప్రజల ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛలపై దాడులు జరుగుతున్నాయి.
పార్లమెంట్ అంతరాయాలు : దేశం ముందు, ప్రజల ముందు ఇన్ని సమస్యలు వుంటుండగా, పాలక బీజేపీ, కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ నిఘా సమస్యపై చర్చించడానికి మూర్ఖంగా తిరస్కరిస్తూ పార్లమెంట్ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నది. రాజ్యాంగం నిర్దేశించినట్టుగా పార్లమెంట్‌కు జవాబుదారీగా వుండానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని రీతిలో ఘోరంగా నిరాకరిస్తోంది.
అదే సమయంలో, పార్లమెంట్లో ఇలా అంతరాయాలు కలిగిస్తూ, సభలో గందరగోళం నెలకొన్న సమయంలో వివిధ బిల్లులలను ఆమోదించేస్తున్నది. ఆ బిల్లులన్నీ ప్రజా వ్యతిరేక బిల్లులే, భారత దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా నీరుగార్చేందుకు ఉద్దేశించినవే. ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు, ఈ చర్యలను ప్రతిఘటించాలి.
పెరుగుతున్న ఆందోళనలు
చారిత్రక రైతు పోరాటం : వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, ఉత్పత్తి వ్యయంలో సీ2 ప్లస్ 50 శాతం కనీస మద్దతు ధరతో తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు చట్టబద్ధమైన హక్కు కావాలని డిమాండ్ చేస్తూ, గత 8మాసాలకు పైగా కొనసాగుతున్న భారత రైతాంగం పోరాటం స్వతంత్ర భారతంలో కనివినీ ఎరుగనిది.
శాంతియుతంగా సాగుతున్న ఈ ఆందోళనకు వివిధ వర్గాల నుంచి సంఘీభావం వెల్లివిరుస్తున్నది. ఉద్యమం ఇంకా కొనసాగుతోంది. సమాంతరంగా కొనసాగుతున్న 'కిసాన్ సంసద్' తమ ఈ డిమాండ్లకు విస్తృతంగా వస్తున్న మద్దతును ప్రముఖంగా పేర్కొంటోంది. ఈ పార్లమెంట్ సమావేశాల చివరి వరకు ఈ సంసద్ కొనసాగనున్నది.
కార్మిక సంఘాలు, కిసాన్ సభలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి ఆందోళనలు :
తమ హక్కుల కోసం, దేశ ఆస్తులను పరిరక్షించేందుకు కార్మిక సంఘాలు, కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కలిసి ఒక్క తాటిపైకి వచ్చాయి. మన దేశ కార్మిక వర్గంలో ఐక్యతను బలోపేతం చేసే దిశగా ఇదొక చారిత్రక చర్య.
కార్మిక వర్గ కార్యాచరణ : ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో, రంగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు, పోరాటాలు జరుగుతున్నా యి. దేశవ్యాప్తంగా ఈనెల 4న జీఐసీ ఉద్యోగులు సంపూర్ణ సమ్మె నిర్వహించారు. ఈ నెల 10న మొదటిసారిగా విద్యుత్ ఉద్యోగులు, ఆఫీసర్లు సమ్మె చేస్తున్నారు.
ఇతర వర్గాలు : పెరుగుతున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా యువత ఆందోళన చేస్తోంది. ప్రభుత్వ, సంబంధిత విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తోంది. త్వరగా విద్యా సంస్థలు తెరిచే పరిస్థితులు కల్పించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరుతున్నారు. ఆకలికి వ్యతిరేకంగా మహిళలు వీధుల్లోకొచ్చి పోరాటాలు చేస్తున్నారు.
దేశ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం
స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను ప్రముఖంగా తెలియచెప్పేలా పార్టీ, ఈ ఏడాది దేశ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని జరుపు కోవాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఆధునిక భారతదేశ నిర్మాణానికి కమ్యూనిస్టు పార్టీ చేసిన సేవలు గురించి, ఐడియా ఆఫ్ ఇండియాను సంఘటితపరచడం, స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారికి ఆర్ఎస్ఎస్ సహకరించడం, రాజ్యాంగబద్ధ, లౌకిక, ప్రజాతంత్ర భారత రిపబ్లిక్‌ను దారుణంగా దెబ్బతీయడం వంటి అంశాలు తెలియచేయాలని నిర్ణయించింది.
త్రిపురలో దాడులు ఆపండి
త్రిపురలో సీపీఐ(ఎం) కార్యాలయాలు, కార్యకర్తలపై బీజేపీ గూండాలు దాడులు కొనసాగిస్తుండడాన్ని కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. గత వారంలో, మణిక్బందర్ వద్ద కమలాపూర్ సబ్ డివిజనల్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. అంతకుముందు, సీపీఐ(ఎం) నేత రంజిత్ ఘోష్‌పై కమలాపూర్‌లోని స్థానిక కార్యాలయంలో దాడి జరిగింది. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బెలోనియా, జిరానియాసబ్ డివిజనల్స్లో కూడా ఇటువంటి దాడులు, గృహ దహనాలు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి గతంలో సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం గవర్నర్‌ను, ముఖ్యమంత్రిని కలిసింది. ఇటువంటి హింసను అనుమతించబోమని వారు హామీ ఇచ్చారు. అయినా భయానక పాలన కొనసాగుతూనే వుంది. ప్రతిపక్షాలపై జరుగుతున్న ఈ దారుణమైన దాడులకు స్వస్తి పలకాలని ప్రజాస్వామ్య హక్కులను రక్షించాలని కేంద్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
పెగాసస్ స్పైవేర్ నిఘా
ప్రజలపై నిఘా కోసం పెగాసస్ మిలటరీ స్పైవేర్‌ను భారత ప్రభుత్వం సమకూర్చుకోవడం చాలా ఆందోళనకరమైన విషయం. ఒకే ఒక్క సూటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం తిరస్కరిస్తోంది. సైబర్ మిలటరీ నిఘాలో ప్రపంచవ్యాప్త నాయకత్వ స్థానంలో వున్న ఇజ్రాయిలీ సంస్థ ఎన్ఎస్ఓతో ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు ఎలాంటి ఒప్పందాన్నైనా కుదుర్చుకున్నాయా? ప్రభుత్వం దీనికి స్పష్టంగా జవాబివ్వాలి, తన నిజాయితీ నిరూపించుకోవాలి. ఇటువంటి నిఘా పెట్టడం గోప్యతకు సంబంధించి ప్రజల ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే కాకుండా, భారతదేశ ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర సంస్థలపై దాడి చేయడమే కాగలదు. ఇలా నిఘా పెట్టబడిన వారి జాబితాలో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, న్యాయ వ్యవస్థ అధికారులు, సీబీఐ మాజీ చీఫ్, మాజీ ఎన్నికల కమిషనర్ ప్రభృతులున్నారు. ఇది శుభ సూచకరమైన పరిణామం కాదు. కేవలం వ్యక్తులే కాకుండా, ప్రజాస్వామ్యంలో కీలకమైన అడ్డూ అదుపులుగా వ్యవహరిస్తూ, రాజ్యాంగ బాధ్యతలను నెరవేరుస్తున్న సంస్థలపై కూడా దాడి చేయడమే కాగలదు. వెంటనే వాస్తవాలు వెలికి తీసి, దోషులను శిక్షించేందుకు గానూ ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించాలి, ఆ దర్యాప్తు కూడా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సాగాలి.
టోక్యో ఒలింపిక్స్
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి, మన దేశానికి ఘనతను తెచ్చిన క్రీడాకారులందరికీ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ అభినందనలు తెలియజేసింది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు మొదటిసారిగా పతకం దక్కడం అది కూడా స్వర్ణ పతకం రావడం చారిత్రాత్మకమని పేర్కొంది. పురుషుల హాకీ బృందం కాంస్య పతకాన్ని సాధించగా, మహిళల హాకీ బృందం స్ఫూర్తివంతమైన రీతిలో పోరు సాగించి నాల్గవ స్థానంలో నిలిచింది. ఆరుగురు వ్యక్తిగత విజయాలు సాధించగా వారిలో ముగ్గురు మహిళలే కావడం ప్రోత్సాహకరమని అభినందించింది. ఇంత అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ పతకాల పట్టికలో కింది స్థాయిలోనే వుండడమంటే దేశంలో క్రీడలను ఎంతలా నిర్లక్ష్యం చేస్తున్నారో స్పష్టమవుతోంది. క్రీడా సదుపాయాలకు ప్రభుత్వమిచ్చే తోడ్పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే శిక్షణకు సంబంధించి సమగ్ర విధానం వుండాలి.
కుల దురభిమానాన్ని ఖండించండి
హరిద్వార్‌లో మహిళా హాకీ క్రీడాకారిణి వందన కటారియాపై జరుగుతున్న కుల దురభిమాన ప్రచారాన్ని కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
సీపీఐ(ఎం) 23వ మహాసభ
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కేరళలోని కన్నూర్‌లో పార్టీ 23వ మహాసభను ఏర్పాటు చేయాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. అవసరమైన ప్రొటోకాల్స్‌ను పాటిస్తూనే కరోనా పరిస్థితులను బట్టి ఈ సభ నిర్వహణ వుంటుంది.