Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్‌లో ఉధృతమవుతున్న కవాతులు
- కదం తొక్కుతున్న కర్షకులు..యోగి సర్కారుకు ముచ్చెమటలు
- ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. అన్నదాతల నిరసనల హౌరు
మోడీ సర్కార్ తెచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కుతున్నారు. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అన్నదాతలు చేసిన పోరాటఫలితంగా..చావుతప్పి కన్నులొట్టపోయిన చందాన కాషాయపార్టీ పరిస్థితిమారింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ అలాంటి సీన్లే కనిపిస్తుండటంతో..యోగి సర్కారుకు ముచ్చెమటలుపట్టిస్తున్నాయి. యూపీ ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా కర్షకులు నిరసనలను కొనసాగిస్తున్నారు.
లక్నో: ఆ నల్లచట్టాలతో మా బతుకులు ఆగమ వుతాయని రైతులు ఢిల్లీ సరిహద్దులోనే దీక్షలుచేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్‌లోనూ,రాష్ట్రపతికి నివేదించినా మోడీ ప్రభుత్వం వెనక్కితగ్గలేదు. పైగా కార్పొరేట్లకు ఉపయోగపడేలా సేద్యాన్ని మార్చాలనుకుంటున్నది. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చాక..ఈ ఏడేండ్ల కాలంలో అన్నదాతపరిస్థితి అగమ్యగోచరంలా మారింది. ఇక చూస్తే ఊరుకుంటే లాభంలేదంటూ..ఉద్యమబాట పట్టారు. గత చరిత్ర తిరగేస్తే..కార్మికులు,శ్రామికులు, ఉద్యోగులు మాత్రమే ఆందోళనలు చేసేవారు. కానీ ఇపుడు రైతు కూడా హక్కులకోసం మోడీ ప్రభుత్వం కన్నెర్ర చేస్తున్నాడు. కొత్త చట్టాలు అమలైతే..సాగును వదులుకోకతప్పదు. మోడీ సర్కార్ చెబుతున్న ఆన్లైన్ వేలం కేంద్రాలు, రైతు వద్దకే వచ్చి పంట కొనే పద్ధతులు సక్సెస్ కాలేదు. అయినా బడా పారిశ్రామిక వేత్తల కనుసన్నల్లో రైతుల్ని బానిసలు చేసేలా కేంద్రం అడుగులేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా యూపీలో అన్నదాతల గొంతులు ఒక్కటవుతున్నాయి. ఇదే యోగి సర్కార్‌కు మింగుడుపడటంలేదు.
ఇటీవల యూపీలోని మౌ జిల్లాలోని ఘోసి పట్టణంలో రైతులు పాదయాత్ర చేయగానే.. యోగి ప్రభుత్వం నిద్రకు దూరమైంది. ఆగస్టు 9 న రైతులు కాలినడకన తమ పాదయాత్రను కవాతుగా మొదలు పెట్టారు. ఈ యాత్రను అడ్డుకోవటానికి భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. కానీ రైతులు వెనక్కితగ్గలేదు.
ఆ మూడు కొత్త వ్యవసాయ చట్టాల యొక్క లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్న వాస్తవాలను రైతులకు చెప్పటానికి రైతు నాయ కులు విక్రమ మౌర్య, చౌదరి రాజేంద్ర నేతృత్వం వహించింది.ఈ మార్చ్ ఆగస్టు 17 న బనారస్‌లోని రవీంద్రపురికి చేరుకున్నది. వాస్తవానికి వారణాసిలోని ప్రధాని మోడీ పార్లమెంటరీ కార్యాలయానికి వచ్చి ఒక కరపత్రాన్ని సమర్పించాలని పూర్వాంచల్ రైతులు కోరుకున్నారు.
ఉద్యమాన్ని అడ్డుకునేలా యోగి సర్కార్ కుట్రలెన్నో..
రైతుల కవాతు విస్తరిస్తుండటంతో...యోగి సర్కార్ కలవరపడుతున్నది. అందుకే పోలీసులను రంగంలోకి దింపింది. పోరాటం ఆపం..చావనైనా చస్తామంటూ రైతు నాయకుడు చౌదరి రాజేంద్ర అనటంతో..ఖాకీలు బలవంతంగా 54 మంది రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది మహిళా రైతులు ఉండటం గమనార్హం. ఘోసి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగగానే..అరెస్టు చేసిన వారిని విడుదల చేశారు. యోగి ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్వాంచ ల్లో అవగాహన ప్రచారానికి వెళ్లినప్పటి నుంచి పోలీసులు అను సరిస్తున్నారు. మా ఉద్యమాన్ని అణచి వేసేం దుకు కుయుక్తులు పన్నుతున్నదని అన్న దాతలు చెబుతున్నారు. అయితే దీని గురించి మీడియాలో ఎలాంటి వార్తలను ప్రచురించడానికి అనుమతించటంలేదు. పూర్వాంచల్ రైతులు కూడా తమ హక్కుల కోసం వెనక్కి తగ్గడం లేదు. యోగి ప్రభుత్వం. కార్పొరేట్ సంస్థలను ప్రసన్నం చేసుకోవడానికి తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అధికార పార్టీని చుట్టుముట్టి ఒత్తిడి చేస్తుంది. రైతుల ఉద్యమంలో పాల్గొన్న గుంజ చెప్పారు. '' బీజేపీ-ఆర్ఎస్ఎస్ సరిగ్గా అదే ఆలోచన కలిగి ఉన్నాయి, 'మోడీ దేశం' ...! రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, యూపీకి చెందిన లక్షలాది మంది అన్నదాతలు అధికార పార్టీ బీజేపీ మెడను వంచటం ఖాయమని రైతు నేతలు స్పష్టం చేశారు.
యోగి సర్కార్‌కు ఎందుకంత భయం..?
యూపీలోని యోగి ప్రభుత్వం రైతుల ఉద్యమం గురించి భయపడుతున్నది. దీనికి ప్రధాన కారణం అసెంబ్లీ ఎన్నికలు. ఇక్క దాదాపు మూడు వందల సీట్లు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నాయి. వీరిలో 70 శాతం మంది ఓటర్లు రైతులు ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో కార్మికులు మాదిరిగా పూర్వాంచల్‌లోని రైతులు తిరుగుబాటు చేస్తే.. కాషాయపార్టీకి పతనమేనని బీజేపీ భావిస్తున్నది.
పూర్వంచల్‌లో స్వేచ్ఛకోసం పోరాటం
బనారస్‌లోని కాంట్ ప్రాంతంలో 2021 ఆగస్టు 11 న మారథాన్ సమావేశం నిర్వహించారు. రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి పూర్వాంచల్ రైతులు బలమైన వ్యూహాన్ని రూపొందించారు. సమాజ్‌వాదీ జన పరిషత్ అఫ్లాటూన్ సమావేశంలో మాట్లాడుతూ, రైతుల సమస్యపై పూర్వంచల్‌లో కొత్త స్వేచ్ఛ కోసం పోరాటం ప్రారంభమైందని తెలిపారు.
''1977లో కుటీర, చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడిన 864 వస్తువులు ఉన్నాయి. మోడీ ప్రభుత్వంకార్పొరేట్ సంస్థకు అనుకూలంగా ఉండటానికి, ఈ వస్తువుల ఉత్పత్తి నిలిపివేయబడింది. రైతులను దెబ్బతీసిన నల్ల చట్టాన్ని ఉపసంహరించుకోనంత వరకు ఆందోళన కొనసాగనున్నదని లక్ష్మణ్ మౌర్య తెలిపారు.
బనారస్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్, రైతుల ఉద్యమాల న్యాయవాది, అన్నదాత హక్కుల కోసం వాదించే డాక్టర్ ఓంశంకర్ మాట్లాడుతూ, ''పూర్వాంచల్‌లో చిన్న, మధ్యతరహా మరియు సన్నకారు రైతులు అత్యధికంగా ఉన్నారు, వారు రెండు హెక్టార్లలో లేదా కొంచెం ఎక్కువ సాగు చేస్తున్నారు. కుటుంబం పోషణకు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. తమ ఉత్పత్తులను కొనడానికి మండీలు లేవు. కొందరు పెద్ద రైతులు వ్యవసాయ సహకార సంఘాలకు విక్రయించుకుంటాయి. సెక్రెటరీలను వేడుకోవడం ద్వారా వారి ఉత్పత్తులను ప్రభుత్వానికి సమర్పించారు. చిన్న రైతులు ఇప్పటికే వడ్డీ వ్యాపారుల వలలో ఉన్నారు. కొత్త చట్టం అమలులోకి వస్తే, వారు వడ్డీ వ్యాపారులకు బదులుగా పెద్ద కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మలుగా మారతారు.
రైతుల్ని ఆకట్టుకునేలా..
రైతులతో నేరుగా కమ్యూనికేట్ చేసే బాధ్యతను తీసుకోగల సమర్థవంతమైన రైతు నాయకుడు లేరన్న విషయం యోగిసర్కారుకు బాగు తెలుసు. అందుకే ఆయనే స్వయంగా రైతులను మచ్చిక చేసుకునేపనిలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వంద మంది రైతులను రోల్ మోడల్‌గా సత్కరించడానికి ఒక ప్రణాళిక రూపొందించబడింది. కిసాన్ సమ్మన్ నిధి యోజన, సాయిల్ హెల్త్ కార్డ్, వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ వాడకం, కిసాన్ కళ్యాణ్ మిషన్ స్కీమ్ సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నది.
ఉద్యమంలో 17 జిల్లాల రైతులు
బనారస్, ఘాజీపూర్, చందౌలి, జౌన్పూర్, మౌ, డియోరియా, గోరఖ్‌పూర్, అజమ్గఢ్, బల్లియాతో సహా పూర్వాంచల్‌లోని 17 జిల్లాల రైతులు ఈ రైతు మార్చ్‌లో పాల్గొన్నారు. యునైటెడ్ కిసాన్ మోర్చా నాయకత్వంలో ఈ మార్చ్ జరిగింది. భారతీయ కిసాన్ యూనియన్, జనవాది కిసాన్ సభ, భారతీయ కిసాన్ యూనియన్, విద్యార్థి యువజన సభ, ఖేతి కిసాన్ బచావో ఆందోళన్, సమాజ్‌వాదీ జన్ పరిషత్ సంఘాల నేతలు హాజరై కొత్త చట్టాలను రైతు వ్యతిరేకమనీ, దీనికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు అండగా నిలుస్తామని ప్రకటించారు.
లాభాల వేటలో కార్పొరేట్ సంస్థలు...
''రైతులకు లాభాలు ఇవ్వడానికి కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ రంగంలోకి రావడం లేదని సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతిమా గోండ్ వివరించారు. తమ వాటాదారులను మాత్రమే ధనవంతులుగా చేయాలనుకుంటున్నారు. రైతులు పండించే పంటకు పరిమిత ధర దక్కితే..బడా సంస్థలు మాత్రం భారీ లాభాలను వెనకేసు కుంటాయి. ముందుగా ఎక్కువ చెల్లించడం ప్రారంభిస్తేనే..తద్వారా భవిష్యత్‌లో ఎక్కువ లాభాలు పొందుతారు. ఉత్పత్తి రైతుల చేతుల్లో ఉన్నంత వరకు దాని ధర పడిపోతూనే ఉంటుంది . అది వ్యాపారి చేతికి చేరిన వెంటనే óర పెరగడం ప్రారంభమవుతుంది. కొన్ని కంపెనీల ద్వారా గుత్తాధిపత్యం చెలాయించబడుతున్న విషయం అందరికీ తెలుసు. వ్యవసాయ చట్టం అమల్లోకి రాకముందే.. అదానీ,అ ంబానీలు ఆహారధాన్యాలను నిల్వచేయటానికి ముందస్తు ప్రక్రియను షురు చేశారు. రైతు ఉద్యమాలకు ఊపిరిపోసేంతవరకు అన్నదాతలు కదులుతున్నారు. మరి దేశప్రజల నోట్లో నాలుగుమెతుకులు పడుతున్నాయంటే... అన్నదాత పడుతున్న శ్రమను గుర్తించాలి. వారికి అండగా నిలవాల్సిన అవసరమున్నదని ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు.
రైతులు బానిసలే ?
'కాంట్రాక్ట్ ఫార్మింగ్' ను చట్టబద్ధం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సీనియర్ జర్నలిస్ట్,సాహితీవేత్త రామ్‌జీ యాదవ్ అభిప్రాయపడ్డారు. ''పూర్వాంచల్‌లో చాలా మంది రైతులు కాంట్రాక్ట్ వ్యవసాయం చేస్తారు. కార్పొరేట్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో అని రైతులు భయపడుతున్నారు? మోడీ ప్రభుత్వం దీన్ని కొత్త చట్టంలో ప్రవేశపెట్టింది. రైతు కోర్టుకు వెళ్లలేడని స్పష్టమైంది. అతను కోర్టుకు వెళ్లినా, కార్పొరేట్‌కు వ్యతిరేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడానికి రైతులకు ఎవరు డబ్బు ఇస్తారు? రైతుకు బేరసారాల శక్తి లేకపోతే, దాని వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. దీంతో రైతులు బానిసలుగా మారే ప్రమాదం ఉన్నది.