Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ విభజన గాయాలు ఎన్నటికీ మర్చిపోలేనివని ప్రధాని మోడీ అన్నారు. అనాడు ప్రజలు పడిన బాధలు, కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఇక నుంచి ఆగస్టు 14వ తేదీని 'విభజన భయానక గాయాల స్మారక దినం'గా జరుపుకోవాలని మోడీ శనివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. భారత్, పాక్ విభజన సమయంలో లక్షలాది మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చిందన్నారు. విభజన కారణంగా చోటుచేసుకున్న విద్వేషం, హింస కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. సామాజిక విభజన, అసమానత అనే విషాన్ని తొలగించి.. ఏకత్వం, సామాజిక సామరస్యం, మానవ సాధికారత స్ఫూర్తిని మరింత బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఈ ' విభజన గాయాల స్మారక దినం' గుర్తు చేస్తూనే ఉంటుందని అన్నారు. 1947, ఆగస్టులో భారతదేశాన్ని విభజించిన తర్వాత పాకిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెద్దయెత్తున చోటుచేసుకున్న అల్లర్లలో లక్షలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా, లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.