Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిక్స్ దేశాల మధ్య సహకారం అవశ్యం
న్యూఢిల్లీ : ఆహార, పోషకాహార భద్రతకు హామీ కల్పించేందుకు గానూ వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని బలోపేతం చేసేందుకు సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని బ్రిక్స్ దేశాలు భావిస్తున్నాయి. వ్యవసాయ వర్కింగ్ గ్రూపు సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఆన్లైన్లో జరిగిన సమావేశంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో సహకారాన్ని, పరిశోధనను పటిష్టపరుచుకునేందుకు సన్నిహిత సంబంధాలపై ఈ గ్రూపు దృష్టి సారించిందని అధికార ప్రకటన పేర్కొంది. ఆకలి, దారిద్య్రాన్ని సమూలంగా నిర్మూలించేందుకు 2030కి పెట్టుకున్న నిలకడగల అభివృద్ధి లక్ష్యాలను సాధించగల నాయకత్వ పాత్రను చేపట్టే స్థాయిలో బ్రిక్స్ దేశాలు వున్నాయని ఐక్యరాజ్య సమితి పేర్కొందని ఆ గ్రూపు తెలిపింది. బ్రిక్స్ దేశాల్లో పటిష్టమైన వ్యవసాయ పరిశోధనా స్థావరాలను పూర్తిగా ఉపయోగించుకోవడం, ఆ విజ్ఞానాన్ని ఇతర దేశాలతో పంచుకోవాలని ఆ ప్రకటన కోరింది. అలాగే ప్రయోగశాల నుండి భూమి వరకు సాంకేతికతలను బదిలీ చేయడానికి వీలు కల్పించాలని, అప్పుడు ఉత్పాదకత పెరగడానికి మరింత మెరుగైన పరిష్కార మార్గాలు దొరుకుతాయని పేర్కొంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని కొనసాగిస్తూ, ప్రకృతి వనరులను నిలకడగా ఉపయోగించుకుంటూ వుండాలని పేర్కొంది. వ్యవసాయ పరిశోధన, విస్తరణ, సాంకేతిక బదిలీ, శిక్షణ, సామర్ధ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు బ్రిక్స్ వ్యవసాయ పరిశోధనా వేదికను భారత్ వృద్ధి పరిచిందని ఆ ప్రకటన పేర్కొంది.