Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశ్రామిక వర్గాల పద్దతులపై కేంద్ర మంత్రి గోయల్ వ్యాఖ్యలు
- 'నివ్వెరపోయిన' దేశ వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు
న్యూఢిల్లీ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం 19నిముషాల పాటు చేసిన ప్రసంగం దేశ వాణిజ్య, పారిశ్రామికవేత్తలను గందరగోళంలో పడేసింది. భారత పరిశ్రమలు అనుసరించే వాణిజ్య, వ్యాపార పద్దతులు, విధానాలన్నీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. 153ఏళ్ళ టాటా గ్రూపు గురించి గోయల్ పదే పదే ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు తన హృదయాంతరాళాల నుండి వస్తున్నాయని అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) వార్షిక సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలను కదిలించాయి. ఆ వీడియోను తమ యూ ట్యూబ్చానెల్ నుండి తొలగించమని సిఐఐని కోరారు. గురువారం రాత్రి సవరించిన ప్రసంగ పాఠాన్ని తిరిగి అప్లోడ్ చేశారు. కానీ దీన్ని కూడా శుక్రవారం సాయంత్రం బ్లాక్ చేశారు. టాటా సన్స్ అధ్యక్షుడు బన్మాలి అగర్వాల్‌ను ఉద్దేశిస్తూ గోయల్, వినియోగదారులకు సాయంగా వుండేందుకు తమ మంత్రిత్వ శాఖ రూపొందించిన నిబంధనలను టాటా సన్స్ వ్యతిరేకించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
''నేను, నా కోసం, నా కంపెనీ'' అన్న ఈ వైఖరికి కొంచెం అతీతంగా మనందరం ఆలోచించాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు అనుసరించే పద్ధతులు జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వున్నాయని అన్నారు. ''మీలాంటి కంపెనీ, మీరు ఒకటి రెండు విదేశీ కంపెనీలు కొనుగోలు చేసి వుండవచ్చు, కానీ ఇప్పుడు జాతి ప్రయోజనాల కన్నా వాటి ప్రాధాన్యతలు ఎక్కువగా వున్నాయా? అని గోయల్ ప్రశ్నించారు. చంద్ర (టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్)కు కూడా ఇదే సందేశాన్ని తెలియచేశానని అన్నారు. కాగా, మంత్రి చేసిన వ్యాఖ్యలపై వ్యాఖ్యానించడానికి టాటా గ్రూపు తిరస్కరించింది. సిఐఐ కూడా ప్రతిస్పందించలేదు. ప్రభుత్వ అధికారులు, వాణిజ్యవేత్తలకు తమ ప్రాధాన్యతలను తెలియచేయడం అసాధారణమేమీ కాదు, కానీ గురువారం నాటి అధ్యాయం బహుశా అనూహ్యమైనది కావచ్చు. ఎందుకంటే నిర్దిష్టంగా కొంతమందిని వారి వాణిజ్య విధానాల గురించి ప్రశ్నించడమనేది ఇంతవరకు జరగలేదు. పైగా జాతి ప్రయోజనాల కోసం వారు పనిచేయడం లేదంటూ సూచించేలా మాట్లాడింది లేదు. ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు వుంటుందని హామీ ఇస్తూ, దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రధాని మోడీ కోరిన మరుసటి రోజే వారి పట్ల విశ్వాసం లేదనేలా గోయల్ చేసిన వ్యాఖ్యలతో వాణిజ్యవర్గాలు అయోమయంలో పడ్డాయి.-