Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలనలో దేశం అధోగతి
- ప్రజలు, ప్రతిపక్షపార్టీల నాయకులకు స్వాతంత్య్రం ఎక్కడీ
- నిపుణులు, విశ్లేషకుల ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షనాయకులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం కరువయ్యాయి. నేడు (ఆదివారం) భారతదేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నది. అయితే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ప్రతిరంగంలోనూ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నదని నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మోడీ అధికారంలో ఉన్న తరుణంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. హేతుబద్దమైన ఆలోచనలకు ప్రాధాన్యతనివ్వకపోవడం, ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసం సన్నగిల్లడం, మీడియాకు స్వేచ్ఛ లేకపోవడం అనేవి ఎన్డీయే ఏడేండ్ల పాలనలో చోటు చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్లో రాబోయే సంక్లిష్ట పరిస్థితులను ముందుగానే ఊహించిన దేశ వ్యవస్థాపక పితామహులు పది ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి అనేక ప్రముఖ విషయాలను సంగ్రహించి వాటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం దేశ స్వాతంత్య్ర యోధుల ఆశయాలు, ఆలోచనలకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశంలోని సాధారణ ప్రజలకు చాలా భారంగా మారిన విషయాన్ని ఆర్థిక విశ్లేషకులు ఇప్పటికే వెల్లడిచాంచారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు దేశంలో క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, మతస్వేచ్ఛ, విద్యా హక్కులు వంటివి మోడీ పాలనలో పడిపోయాయి. ఒకప్పటి యూఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్న ప్రాథమిక విధులు పౌరులకు రాజ్యాంగం యొక్క ఆచరణాత్మక మార్గదర్శి. అయితే, అవి కూడా అమలుకు నోచుకోకపోవడం దేశంలో రాజ్యాంగం అమలుతీరుకు అద్దం పడుతున్నది. ముఖ్యంగా, మత, భాష, ప్రాంతీయతలకు సంబంధించిన అంశాల్లో దేశంలో నిత్యం అలజడులు చెలరేగడం, ప్రజల మధ్య సామరస్యం దెబ్బతినేలా కేంద్రంలోని అధికార బీజేపీ నాయకుల ప్రసంగాలు ఉండటం వంటివి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి. మహిళలను కించపరిచే బీజేపీ నాయకుల చర్యలు, ప్రసంగాలు వారి ఆలోచణాధోరణిని స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచంలో విశిష్ట గుర్తింపు ఉన్న భారతదేశాన్ని 'ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే ఆచారం..' అనే నియంతృత్వ ఆలోచనతో మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తున్నదని ఆవేదన తెలిపారు. అయితే, 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగానైనా దేశ శ్రేయస్సు కోరుతూ మోడీ ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేసే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిపక్ష పార్టీల నాయకులకు, సామాజిక, పౌరసంఘాల నాయకులకు, కార్యకర్తలకు తగిన గౌరవం, అవకాశం, స్వేచ్ఛ కల్పించాలనీ, అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకెళ్లాలని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దేశంలో ప్రజాతంత్ర హక్కులు, పౌర హక్కులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా గొంతు ఎత్తిన వారిని దేశ ద్రోహులుగా ముద్ర వేయడాన్ని గమనించిన అంతర్జాతీయ సంస్థలు మనకు ఇచ్చే గ్రేడింగ్లను తగ్గిస్తున్నాయి. ఉదాహారణకు స్వీడన్ సంస్థ వీడెమ్ భారత్లో ఎన్నికల ఏక చత్రాధిపత్యం నడుస్తున్నదని పేర్కొంది.