Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక, ఆర్థిక స్వాతంత్రం రాలేదు..
- సమాజంపట్ల కళాకారుడు స్వేచ్ఛగా స్పందించాలి : బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్
న్యూఢిల్లీ : భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నవేళ, హిందీ కవి, బాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజికంగా, ఆర్థికంగా ప్రజలకు స్వాతంత్రం దక్కినప్పుడే.. అది నిజమైన స్వాతంత్రమని ఆయన అన్నారు. ఆగస్టు 15, 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినమాట నిజమే..కానీ అది ప్రారంభం మాత్రమేనని ఆయన విశ్లేషించారు. ఈ 75ఏండ్లలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నవారికి నిజమైన స్వాతంత్రం రాలేదని అన్నారు. ఆగస్టు 15 సందర్భంగా ఒక టీవీ ఛానల్వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..''ఒక పౌరుడికి బాల్యంలో కనీస విద్యను ప్రభుత్వం అందించకపోతే..స్వాతంత్ర భావన అతడిలో ఉంటుందా? అతడికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు మనం భావించగలమా?..లేదు. అతడు నిత్యం ఇతరులపై ఆధారపడితే స్వతంత్రం లేనట్టే కదా! సామాజికంగా, ఆర్థికంగా స్వతంత్రం రానంతవరకూ దేశ స్వాతంత్రం అసంపూర్ణమే'' అని జావెద్ అక్తర్ చెప్పారు. ఎవరినో సంతోషపరచడానికి, ఎవరో ఒత్తిడిచేస్తే..రచయితలు పనిచేయరాదని, స్వేచ్ఛగా పనిచేయాలని అక్తర్ అభిప్రాయపడ్డారు. సమాజంలో జరిగేవాటిని గ్రహించే నైపుణ్యం, సున్నితత్వం కళాకారులకు మాత్రమే ఉంటుందని అన్నారు. సమాజంలోని ఒక విషయంపై ఇతరులకంటే లోతుగా కళాకారుడు స్పందించాలని చెప్పారు. ఒక కళాకారుడిగా దీనిని తాను నమ్ముతున్నానని చెప్పారు.