Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోడీ పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడి ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారని ఆలిండియా కిసాన్ సభ(ఎఐకెఎస్) ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించింది. పార్ల మెంట్లో రైతుల సమస్యలపై చర్చించేందుకు నిరాకరించిన ప్రధాని మోడీ, తన అసత్య ప్రచారం కోసం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉపయోగించుకున్నారని పేర్కొంది. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత 9 నెలలుగా సాగుతున్న ఉద్యమంలో ఇప్పటికి 600 మందికి పైగా రైతులు అమరులైనా, మోడీ తన విధానాల ద్వారా కార్పొరేట్లకు లాభం చేకూర్చడానికే పనిచేస్తున్నారని విమర్శించింది. చిన్న రైతులపై మోడీకి నిజంగా ప్రేమ ఉంటే వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేస్తూ ప్రకటన చేయాలని, కనీస మద్దతు ధరను చట్టబద్దమైన హక్కుగా చట్టం చేయాలని డిమాండ్ చేసింది. మోడీ ఏడు సంవత్సరాల పాలనలో ఆదాయాలు రెట్టింపు కావడానికి బదులుగా రైతుల ఆత్మహత్యలు లక్ష దాటాయని ఎఐకెఎస్ తెలిపింది. పిఎం ఫసల్ బీమా పథకం చిన్న రైతులకు మేలు చేస్తుందని మోడీ గొప్పలు చెప్పుకున్నారని, అయితే అది విఫలమైన పథకమని పేర్కొంది. ఈ పథకం వైఫల్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, పంజాబ్, తెలంగాణ వంటి అనేక రాష్ట్రాలు వేరే పథకాలను రూపొందించుకున్నాయని తెలిపింది.