Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాపాడుకునేందుకు మరో పోరాటానికి సిద్ధం
- మువ్వన్నెల జెండా ఆవిష్కరణలో మధు
అమరావతి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో స్వాతంత్య్రానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆదివారంనాడు విజయవాడలోని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, కార్మికులు, వివిధ వర్గాలు, తరగతుల వీరోచిత పోరాటాలతో, ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాలతో స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. ఆ త్యాగాలను బీజేపీ ప్రభుత్వం అవమానపరుస్తోందని, ఆగస్టు- 14ను చీకటిదినంగా పాటించాలని మోడీ పిలుపునిచ్చి హిందు, ముస్లింల మధ్య మత చిచ్చు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో స్వేచ్ఛ, హక్కులు, ప్రభుత్వ సంస్థలు ధ్వంసం అవుతున్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. వీటిని రక్షించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్లకు దేశాన్ని కట్టబెడుతూ, సామాన్యులను, రైతులను అణగదొక్కేందుకు దుర్మార్గపు చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 74 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో అమృతం సంపన్నులకు, విషం సామాన్యులకు అందిందని అన్నారు. స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలకు కమ్యూనిస్టులు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఏపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైనదని అన్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను, జాతీయ సమగ్రతను, లౌకిక, ఫెడరల్ స్వభావాన్ని పరిరక్షిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, దడాల సుబ్బారావు, మంతెన సీతారాం, సిహెచ్ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.