Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థినిని చంపిన యువకుడు
- స్వాతంత్య్ర దినోత్సవం నాడు గుంటూరులో ఘాతుకం
- పట్టుబడిన నిందితుడు
- పోలీసులను చూసి ఆత్మహత్యాయత్నం
గుంటూరు :గుంటూరులో నడిరోడ్డుపై బిటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. స్వాతంత్య్ర దినోత్సం నాడు పట్టపగలు ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలన సృష్టించింది. గంటల వ్యవధిలోనే నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులను చూసిన నిందితుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం... అమృతలూరుకు చెందిన ఎస్సి యువతి నల్లపు రమ్య (20) గుంటూరు సమీపంలోని బుడంపాడు సెయింట్ మేరీస్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గుంటూరులో తన సోదరితో కలసి నాయనమ్మ వద్ద ఉంటోంది. ఆదివారం ఉదయం మెయిన్ రోడ్డుపైకి వచ్చిన రమ్యను ద్విచక్ర వాహనంపై వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన యువకుడు కుంచాల శశికృష్ణ, మరో యువకుడు వచ్చి అడ్డగించారు. కత్తితో ఆమెను మెడ నుంచి నడుము వరకు శశికృష్ణ విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో, రమ్య అక్కడికక్కడే రక్తపుమడుగులో కుప్పకూలిపోయింది. రమ్యను సోదరి మౌనిక గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి (జిజిహెచ్) తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నిందితుని కోసం అర్బన్ ఎస్పి ఆరీఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు గాలించాయి. సెల్ ఫోన్ సిగల్ ఆధారంగా నర్సరావుపేటలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులను చూసిన నిందితుడు కత్తితో పీక కోసుకోవడంతో చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పదో తరగతి వరకూ చదువుకొని తాపీ మేస్త్రీగా పని చేస్తున్న శశికృష్ణకు, రమ్యకు ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా పరిచయమై చివరకు అది ప్రేమగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ప్రేమ వ్యవహారంలో వచ్చిన విభేదాల కారణంగానే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.
సిఎం ఆరా : రూ.10 లక్షల పరిహారం ప్రకటన
విద్యార్థిని హత్య ఘటనపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. రమ్య కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని, కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకొనేలా అని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.