Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లాక్డౌన్, కరోనా సమయంలో ఇండ్లల్లో చాలామంది సంగీతం వింటూ ఊరట చెందటం మనం చూశాం. అయితే ఆ సంగీతాన్ని సృజించిన సంగీత కళాకారుల జీవితాలు మాత్రం విషాదంలో కూరుకుపోయాయి. లాక్డౌన్ పరిస్థితులు, కరోనా నిబంధనలు..మొత్తం సంగీతరంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. గాయనీగాయకులు, వాయిద్య కళాకారులు, ఈవెంట్స్ నిర్వాహకులు..ఇలా అనేకమంది జీవనోపాధి ఒక్కసారిగా తారుమారు అయ్యింది. ఎన్నడూ ఊహించని పరిస్థితులు వారి జీవితాల్ని అనూహ్యంగా మార్చాయి. కఠినమైన ఈ పరిస్థితుల్లో, కష్ట సమయాన తమకు ప్రభుత్వం నుంచి సహకారం దక్కలేదని వారు ఆవేదన చెందుతున్నారు. భారతీయులుగా వివిధ దేశాల్లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కష్టకాలంలో తమని ఆదుకోవాలని పాలకులకు విన్నపాల మీద విన్నపాలు చేశారు. జులై 2020లో వెటరన్ మ్యూజిక్ ఆర్టిస్టులు కొంతమంది ప్రధాని మోడీని కలిసి సమస్యను విన్నవించుకున్నారు. అయితే కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదని సమాచారం.
గత ఏడాది మార్చి నుంచి..రూ.3.71లక్షల కోట్ల విలువజేసే ప్రపంచ సంగీతరంగం ఒక్కసారిగా కుదేలైంది. కారణం ఆయా దేశాల్లో కరోనా సంక్షోభం, దానిని ఎదుర్కొనేందుకు విధించిన లాక్డౌన్లు. రూ.3.71లక్షల కోట్ల వ్యాపారంలో సగం ఆదాయం కేవలం సంగీత కచేరీలు, కార్యక్రమాల ద్వారా వస్తోంది. ఇదంతా కూడా టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం. మిగతా సగం ఆదాయం సంగీత కార్యక్రమాల ప్రసారాలు, డిజిటల్ డౌన్లోడ్లు, అమ్మకాలు, లైసెన్సింగ్, టీవీ అడ్వర్టయిజ్‌మెంట్స్..ద్వారా వస్తోంది. ముఖ్యంగా సంగీత కచేరీలు, కార్యక్రమాల్లో (లైవ్ ప్రోగ్రామ్స్) కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. సినిమా కళాకారులు, పాప్ స్టార్స్ పాల్గొనేవాటికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతుంది. లాక్డౌన్, కరానా వల్ల ఇదంతా ఆగిపోయిందని 'ఇండియన్ మ్యూజిక్ ఇండిస్టీ-డెల్లాయిటీ' ఒక నివేదిక విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం, ఇండియాలో 2019 ఏడాదిలో 'లైవ్ ప్రోగ్రామ్స్', 'లైవ్ ఈవెంట్స్' ద్వారా సంగీతరంగానికి రూ.6500కోట్ల ఆదాయం సమకూరింది. 2020లో 170 కంపెనీలపై కోవిడ్ ప్రభావం చూపింది. ఎన్నో మ్యూజిక్ ఈవెంట్స్ రద్దు అయ్యాయి. దీనివల్ల ఇండియాలో ప్రతి కంపెనీకి కనీసం రూ.కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లింది. వివాహాలు, సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్ అందజేసే క్లబ్బులు అనేకమున్నాయి. ఇందులో 100-150మంది వరకూ పనిచేస్తారు. లాక్డౌన్, కరోనా నేపథ్యంలో కార్యక్రమాలు లేక వీరి ఉపాధి అంతా దెబ్బతిన్నది.
ప్రభుత్వం నుంచి సాయం లేదు..
యూరోపియన్ దేశాల్లో చాలావరకు సంగీత కళాకారులను అక్కడి ప్రభుత్వాలు ఆదుకున్నాయి. ఉపశమన చర్యలు కొంతవరకు పనిచేశాయి. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదు. దీనివల్ల ఎంతోమంది సంగీతకారులు, ఇతర కళాకారులు తీవ్రంగా నష్టపోయారు. భారత్‌లో రాజకీయ నాయకులు కేవలం అధికారం, డబ్బు గురించే ఆలోచిస్తున్నారని మ్యూజిక్ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రం అక్కడి ఎల్డీఎఫ్ ప్రభుత్వం అన్ని కేటగిరీలకు చెందిన దాదాపు 30వేల మందికిపైగా కళాకారులకు నగదు సాయం ప్రకటించింది. ఒకసారి రూ.2వేలు, మరోసారి రూ.వెయ్యి అందజేసింది. అర్హులైనవారికి అడ్వాన్స్ పెన్షన్ కింద మరో రూ.1500 అందజేసింది.
18 నెలలుగా పనిలేదు : ఛుగ్గాఖాన్, జానపద సంగీత వాయిద్యకారుడు, జైసల్మేర్
గత 25ఏండ్లుగా జానపద సంగీత వాయిద్యకారుడిగా 128 దేశాలు తిరిగాను. ఎన్నో లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్‌లో పాల్గొన్నాను. ప్రతి రెండు నెలలకొకమారు విదేశాలకు వెళ్లేవాణ్ని. కోవిడ్ వచ్చాక పరిస్థితి తారుమారైంది. దేశంలో ఎక్కడా ఎలాంటి సంగీత కార్యక్రమాలూ లేవు. దాంతో ఆదాయం పూర్తిగా దెబ్బతిన్నది. కనీసం వివాహాల సమయంలోనూ మమ్మల్ని పిలవటం లేదు. దాంతో ఇన్నేండ్లలో కూడబెట్టుకున్న బంగారాన్ని అమ్ముకొని బతుకుతున్నాం.