Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో చట్టాలు చేస్తున్న
- తీరుపై సీజేఐ ఎన్.వి.రమణ అసంతృప్తి
- గతంలో నిర్మాణాత్మక చర్చలు
- ఆనాడు..తమిళనాడు సీపీఐ(ఎం) సభ్యుడు రామ్మూర్తి బిల్లుపై సమగ్ర విశ్లేషణ
- వివిధ వర్గాలపై దాని ప్రభావాన్ని అంచనావేసేవారు..
- అలాంటి లోతైన చర్చ లేదిప్పుడు..
న్యూఢిల్లీ : పార్లమెంట్లో సరైన చర్చలు జరపకుండానే చట్టాలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వం పార్లమెం టులో నిర్మాణాత్మక చర్చలు జరిగేవని గుర్తు చేశారు. తద్వారా కోర్టులకు వాటిని విశ్లేషించేం దుకు వీలుగా ఉండేదన్నారు. ఏ లక్ష్యంతో.. ఎవ రిని ఉద్దేశించి..ఆ చట్టాలను రూపొందించారో న్యాయస్థానాలకు సులువుగా అర్థమయ్యేదన్నారు. గతంలో పారిశ్రామిక వివాదాల చట్టం సందర్భంగా పార్లమెంటులో జరిగిన చర్చను ఉదహరించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అండ్ బెంచ్ నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'' గతంలో పారిశ్రామిక వివాదాల చట్టంపై పార్లమెంటులో జరిగిన చర్చ నాకు ఇంకా గుర్తుంది. తమిళనాడుకు చెందిన సీపీఐ(ఎం) ఎంపీ రామ్మూర్తి ఆ చట్టంపై విస్తృతంగా చర్చించారు. దానివల్ల కలిగే పరిణామాలు..కార్మికవర్గంపై ప్రభావాన్ని చక్కగా వివరించారు. సమాజంలో వివిధ వర్గాలపై ఉండే ప్రభావాన్ని లోతుగా విశ్లేషించి చెప్పారు. ఇతర చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంలో పూర్తిస్థాయి చర్చలు జరిగేవి. దీనివల్ల ఆయా చట్టాల లక్ష్యం..ఎవరిని ఉద్దేశించి తయారు చేశారో స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు అలాంటి లోతైన విశ్లేషణ పార్లమెంట్లో కరువైంది'' అని జస్టిస్ రమణ తెలిపారు.
ఇప్పటి పరిస్థితి చాలా విచారకరం..
ప్రస్తుత పార్లమెంటు చర్చల విషయంలో చాలా విచారకరమైన పరిస్థితులు నెలకొన్నాయని జస్టిస్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన చర్చ జరగకుండానే చట్టాలు ఆమోదం పొందుతున్నాయని అన్నారు. దీంతో చట్టాలపై గందరగోళం తలెత్తుతోందన్నారు. మేధావులు, న్యాయవాదులు సభలో లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో న్యాయనిపుణులు సామాజిక, ప్రజా జీవితంలో కూడా కీలక పాత్ర పోషించాల్సి అవసరం ఉందన్నారు.
ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నా...బిల్లుల ఆమోదం మాత్రం ఆగలేదు. ముసాయిదా బిల్లుల విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించటం వివాదాస్పదమైంది. ఏ రోజూ సభ సజావుగా సాగనప్పటికీ..దాదాపు 22 బిల్లులు ఆమోదం పొందటం సర్వత్రా అసంతృప్తి వ్యక్తమైంది. పన్ను చట్టాల సవరణ, సాధారణ బీమా విధాన(జాతీయీకరణ) సవరణ, జాతీయ ఆహార సాంకేతిక సంస్థ వ్యవస్థాపన, నిర్వహణ, బాలల న్యాయ సంరక్షణ...తదితర బిల్లులపై పెద్దగా చర్చ జరగలేదు. ఈ తరుణంలో తాజాగా సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.