Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రాజ్యాంగ స్థంబాలపై దాడి
- స్వాతంత్ర ఉద్యమ లక్ష్యాల అమలులో విఫలం : ఆన్లైన్ సభలో సీపీఐ(ఎం) నేతలు
న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని పరిక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ(ఎం) నేతలు పేర్కొన్నారు. లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, ఆర్థిక స్వావలంబన వంటి నాలుగు రాజ్యాంగ స్థంబాలు తీవ్రమైన దాడికి గురవుతున్నా యని తెలిపారు.75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భారత దేశ స్వాతంత్య్రోద్యమాన్ని జరుపుకోవడం, ప్రస్తుత సవాళ్లను గుర్తించడంపై ఆన్లైన్లో చర్చ జరిగింది. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు మహ్మద్ సలీం ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్వాతంత్య్రోద్యమం, కమ్యూనిస్టుల పాత్ర తదితర అంశాలపై వివరించారు.
భారత దేశ స్వాతంత్య్రోద్యమంలో కమ్యూనిస్టులు చాలా కీలక పాత్ర పోషిం చారు. నాటి పోరాటం ప్రజా ఉద్యమంగా జరిగిందనీ, ఫలితంగా స్వాతంత్య్రాన్ని సిద్ధించిందని అన్నారు. స్వాతంత్రం సాధించే ప్రక్రియలో అన్ని వర్గాలను కలుపుకొవడం ఐడియా ఆఫ్ ఇండియా భాగమని తెలిపారు. ప్రపంచంలోనే ఏ దేశంతో పోల్చడానికి వీలు లేని భిన్నత్వాలు భారత దేశంలో ఉన్నాయని, వాటినన్నిం టిని ఏకతాటిపైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఐడియా ఆఫ్ ఇండియాలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారనీ, దాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. 1920లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందనీ, 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సెషన్ లో ఇద్దరు కమ్యూస్టులు స్వామి కుమార నంద, మౌలాన హస్రాత్ మోహనీలు బ్రిటిష్ నుంచి పూర్తి స్వాతంత్య్రం సాధించాలని పేర్కొన్నట్టు గుర్తు చేశారు. మొదటి సారి ఈ డిమాండ్ ముందుకు వచ్చిందనీ, దీన్ని మహ్మాత్మా గాంధీ అంగీకరించలేదని అన్నారు. చివరికి 1929లో కరాచీలో జరిగిన ఏఐసీసీ సెషన్లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించాల్సి వచ్చిందని తెలిపారు. దాదాపు శతాబ్ధం పాటు కమ్యూనిస్టులు పూర్తిస్థాయి స్వతంత్రం కోసం పోరాటం చేశారని వివరించారు. ప్రతి ఏఐసీసీ సెషన్లో కమ్యూనిస్టు ప్రతినిధులు స్వాతంత్య్రోద్యమం ఎలా ముందుకు సాగాలనేదానిపై స్పష్టంగా చెప్పేవారని తెలిపారు. కేవలం డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలు, తీర్మానాలు చేయడమే కాకుండా, ప్రజా ఉద్యమం ద్వారా సాగాలని కమ్యూనిస్టులు పేర్కొన్నారని అన్నారు. ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా మతోన్మాద అల్లర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కమ్యూనిస్టులు నిర్మించారని తెలిపారు. అందరిని కలుపుకొని శాంతి కమిటీలు ఏర్పాటు చేశారని అన్నారు. కమ్యూనిస్టులు త్యాగాలతో స్వాతంత్య్రోద్య మాన్ని బలోపేతం చేయారని వివరించారు. స్వాతంత్య్రోద్యమం లోకి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఇతర అణగారిన వర్గాలను తీసుకొచ్చిన ఘనత కమ్యూనిస్టులకే చెందుతున్నదని అన్నారు. స్వాతంత్ర భారతంలో దేశ స్వభావం ఎలా ఉండాలనేదానిపై చర్చలు జరిగాయన్నారు. సమ్మిళత అభివృద్ధి సాధనపై చర్చ జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ లౌకిక, ప్రజా స్వామ్య, గణతంత్రంగా ఉండాలని పేర్కొందనీ, కమ్యూనిస్టులు దానికి సమ్మతి తెలుపుతూ, అదిమాత్రమే సరిపోదని పేర్కొన్నా రని వివరించారు. లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రంతో ముగిం పు కాదనీ, స్వతంత్రం ద్వారా రాజకీయ స్వేచ్ఛ సాధించాలనీ, దాని ద్వారా ఆర్థిక స్వేచ్ఛ సాధించాలని, అది కేవలం సోషలిజంతోనే సాధ్యమని కమ్యూనిస్టులు ప్రస్తావించారనిగుర్తు చేశారు. కనుక లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రంతో పాటు సోషలిజాన్ని కమ్యూనిస్టులు ముందుకు తెచ్చారని అన్నారు. మూడో వాదన కూడా వచ్చిందనీ, మత ప్రాతిపదికన రాజ్య స్థాపన వాదన అని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్, హిందూ రాష్ట్ర వాదనలు ముందుకు తెచ్చారని తెలిపారు. ముస్లిం లీగ్ ఇస్లామిక్ స్టేట్, ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర అంశాలను ముందుకు తెచ్చారని పేర్కొన్నారు. పాకిస్తాన్ వలే ఇండియా కాదని, మతం ప్రాతిపదికన దేశం ఏర్పడలేదని అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య ప్రాతిపదికన ఇండియా ఏర్పడిందని వివరించారు.
రెండు దేశాల అంశాన్ని హిందూ మహాసభ అధ్యక్షుడు సావర్కర్ పేర్కొన్నాడనీ, 1938-39లో ఆయన భారత దేశం రెండు దేశాలు కావాలనీ, అవి ఇస్లామిక్ నేషన్, హిందూ నేషన్ అని పేర్కొన్నాడని తెలిపారు. ముస్లీం లీగ్ అధ్యక్షుడుగా జిన్నా, హిందూ మహాసభ అధ్యక్షుడుగా సావర్కర్ కలిసి పని చేశారని, అందుకనుగుణంగా మతోన్మాద అల్లర్లు సృష్టించారని గుర్తు చేశారు. 1923లో సావర్కర్ హిందూత్వాన్ని పేర్కొన్నారనీ, ఇది హిందువులు గురించి కాదనీ, రాజకీయ ప్రాజెక్టు అని ఏచూరి తెలిపారు. నాడు గోల్వాల్కర్ చెప్పిందే, ఇప్పుడు దేశంలో సంఘపరివార్ చేస్తుందని విమర్శించారు. స్వాతంత్య్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదనీ, చాలా సార్లు వారు బ్రిటిష్ వారితో కలిసి పని చేశారని తెలిపారు. కానీ ఎప్పుడు కమ్యూనిస్టులు స్వాతంత్య్రోమాన్ని విచ్ఛిన్నం చేశారని విమర్శిస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. స్వాతంత్ర దినోత్సవ 50వ వార్షికోత్సవంలో పార్లమెంట్లో జరిగిన అర్థరాత్రి సెషన్లో రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ మాట్లాడుతూ బ్రిటిష్ హౌం శాఖ లండన్‌కు పంపించిన లేఖల్లో కమ్యూనిస్టులు బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని పేర్కొన్నట్లు తెలిపారని గుర్తు చేశారు. అదే బ్రిటిష్ హౌ శాఖ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ విచ్ఛిన్నం చేస్తుందని లేఖ రాసినట్టు తెలిపారు. గాంధీ హత్యతో ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారనీ, చాలా విజ్ఞప్తులతో షరతులతో కూడిన అనుమతి వచ్చిందని తెలిపారు. రాజకీయాల్లో పాల్గొమని షరతు అందులో ఒకటని పేర్కొన్నారు.
లౌకిక, ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు మోడీ సర్కార్ పెట్టుకుంటుందని, దానిస్థానంలో ఫాసిస్ట్ హిందూ రాష్ట్ర స్థాపనకు పని చేస్తుందని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, ఆర్థిక స్వావలంబన వంటి నాలుగు రాజ్యాంగ స్థంబాలు తీవ్రమైన దాడికి గురవుతున్నాయని తెలిపారు. జాతీయ ఆస్తులు అమ్మకం, భారీ స్థాయిలో ప్రయివేటీకరణ, కార్మిక వర్గంపై దాడి, వ్యవ సాయాన్ని కార్పొరేటీకరణ వంటివి దేశంలో జరుగుతున్నాయని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్లకు లాభాలు చేకూరే విధంగా విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని లూటీ చేయడంతో దేశ ఆర్థిక స్వావలంబన ధ్వంసం అవుతుం దని అన్నారు. కార్పొరేట్లకు సహకరించి, వారి నుంచి బీజేపీ ఫండ్స్ తీసుకుంటుందని విమర్శించారు. దేశంలోనే అత్యంతం ఎక్కువ రాజకీయ విరాళాలు బీజేపీకే వచ్చాయని తెలిపారు.
ఫెడరలిజంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలు పూర్తిగా ధ్వంసమయ్యాయనీ, ఎందుకంటే హిందూరాష్ట్ర లక్ష్యం ఏకరూప నియంతృత్వ పాలన అని పేర్కొన్నారు. దానికి విరుద్ధంగా ఫెడరలిజం ఉంటుందని తెలిపారు. కనుక ఫెడరలిజాన్ని వారు నిర్వీర్యం చేసి, రాష్ట్ర హక్కులను కాలదన్నుతారని పేర్కొన్నారు. రాష్ట్రాల గవర్నర్లను ఆర్ఎస్ఎస్ నియమిస్తోందనీ, కేంద్ర స్వతంత్ర సంస్థల్లో జోక్యం పెరిగిందని విమర్శించారు. దళితులు, గిరిజన, మహిళలపై దాడులు పెరిగాయనీ, దళిత చిన్నారులు అత్యాచారాలకు గురవుతున్నారని అన్నారు. సామాజిక న్యాయం అందని ద్రాక్షలా మిగిలిందని, సామాజిక అన్యాయం, అణచివేత పెరిగిందని విమర్శించారు. ప్రజల నియంత్రణ, లవ్ జీహాద్, గో మాంసం వంటి వాటితో మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నారనీ, అలాగే సమాజాన్ని మతంరంగు పులుముతున్నారని విమర్శించారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరుగుతుందని ఏచూరి తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక మందిని జైల్లో పెట్టారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతిని వ్యక్త పరిస్తే వారిపై యూఏపీఏ, ఎన్ఎస్ఎ, రాజద్రోహం వంటి కేసులు పెట్టి, దేశ ద్రోహులుగా ముద్రలు వేస్తున్నారని విమర్శించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమ వారసత్వం, వామపక్ష ప్రత్యామ్నాయం గురించి చర్చించారు. చాలా ఉద్యమాల తరువాత చివరిగా 1947లో బ్రిటిష్ వారి నుంచి స్వతంత్య్రం వచ్చిందని అన్నారు. దేశంలోని వలసవాద వ్యతిరేక పోరాటాన్ని అంతర్జాతీయ కమ్యూనిస్టులు దగ్గర చూశారని పేర్కొన్నారు. కమ్యూనిస్టులపై బ్రిటిషు పాలకులు పెషవర్, కాన్పూర్, మీరట్ కుట్ర కేసులు పెట్టారని తెలిపారు. ఈ కుట్ర కేసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్దఎత్తున పోరాటం చేశారన్నారు. కమ్యూనిస్టుల వల్ల చాలా మంది యువకులు స్వాతంత పోరాటం భాగస్వామ్యం అయ్యారని, భగత్ సింగ్ వంటి వారు కమ్యూనిస్టులుగా స్వతంత్ర పోరాటంలో ఉన్నారని గుర్తు చేశారు. స్వతంత్ర పోరాటంలో ఈఎంఎస్ నంబూద్రిపాద్, పుచ్చల పల్లి సుందరయ్య, ఎకె గోపాలన్ వంటి కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లు కమ్యూనిస్టులు తెచ్చారని తెలిపారు. జీఎస్టీతో రాష్ట్రాల స్వతంత్రత కోల్పోయాయని అన్నారు. ఉమ్మడి, రాష్ట్ర జాబితాలోని అంశాలను రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం చర్యలు చేపడుతుందని విమర్శించారు. విద్య, వ్యవసాయం, విద్యుత్, సహకార సంస్థల వంటి వాటిలో ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్రం వెళ్తుందని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వామపక్ష పత్యామ్నాయం స్పష్టంగా కనిపించిందనీ, కేరళలో ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని కాపాడామని అన్నారు. ఉచిత, సార్వత్రిక వ్యాక్సినేషన్ చేయాలని కేంద్రానికి తామే ముందుగా లేఖ రాశామనీ, 11 బీజేపేతర ముఖ్యమంత్రులు అనుసరించారని తెలిపారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మాట్లాడుతూ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అంశాలు గురించి చర్చించారు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే స్వేచ్ఛను ఇచ్చారని తెలిపారు. కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, జీవనోపాధి వంటి కనీస అవసరాలను కూడా తీర్చలేదని అన్నారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ, అసమానతలు, స్వాతంత్య్ర పోరాట వాగ్దానాలకు ద్రోహం చేయడంపై చర్చించారు. దేశంలోని ఆర్థిక వ్యవస్థ సామాన్యులకు అనుకూలంగా లేదని, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ స్వాతంత్ర పోరాటంలోని ప్రజల అవసరాలను ఇప్పటికే తీర్చలేకపోయానని అన్నారు. నాటి లక్ష్యాలను ఉల్లంఘించారని తెలిపారు. సంపద, ఆదాయ సమానతకు విరుద్ధంగా వెళ్తున్నారని తెలిపారు. సామాన్యులకు సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులు ఉండాలని, కానీ అలా జరగటం లేదని విమర్శించారు. వామపక్ష ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు చేశాయనీ, కానీ అంతకుముందు భూ సంస్కరణలు చేస్తామని హామీలు ఇచ్చినవారు దాన్ని పూర్తిస్థాయి అమలు చేయలేదని అన్నారు. భూ సంస్కరణలు లేకుండా, భూస్వామ్య వ్యవస్థ మారకుండా రైతుల జీవితాలు మారవని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ మొత్తం పెట్టుబడి, సంపదపైనే దృష్టి పెడుతున్నదనీ, బడా బిజినెస్ కంపెనీల నియంత్రణలోనే వ్యాపారం జరుగుతుందని అన్నారు. ఏకస్వామ్య పెట్టుడిదారీ వ్యవస్థ పెరిగే కొద్దీ, అసమానతులు పెరుగుతాయని పేర్కొ న్నారు. సామాన్యులు పేదరికం నుంచి బయట పడలేకపోతు న్నారు. దేశీయ మార్కెట్ పెరుగుతూ వస్తుందనీ, కానీ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతు వస్తుందని తెలిపారు. అందువల్లే సంక్షోభాలు వస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని ఆర్థిక తిరోగమణం, కరోనా సంక్షోభం ఉన్న సమయంలో కూడా బిలియనీర్స 102 నుంచి 140 మందికి పెరిగిందని తెలిపారు. ఉత్పాదక స్థాయి, జీడీపీ తగ్గిందనీ, కానీ బడా కార్పొరేట్ల సంపద మాత్రం పెరిగిందని అన్నారు. నిరుద్యోగం 45 సవంత్సరాల తరువాత అత్యంత ఎక్కువ ఉందని అన్నారు. ఆకలి పెరిగిందని అన్నారు. స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు అమలులో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. సీపీఐ(ఎఎం)పొలిట్ బ్యూరో సభ్యులు మహ్మద్ సలీం మాట్లా డుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించి, గుర్తు చేసుకోవా లని అన్నారు. బ్రిటిష్ సామ్రా జ్యవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసి స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామన్నారు. స్వాతం త్య్రం సిద్ధించిన తరువాత కూడా స్వాతంత్రాన్ని కొనసాగించా డానికి, పరిరక్షించడానికి చాలా మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. చరిత్రను తెలుసుకోవాలనీ, చదువు కోవాలని అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని వారు చరిత్రను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. స్వాతంత్య్ర పోరాట వారసత్వంలోభాగంగా రాజ్యాంగాన్నితయారు చేశారనీ, దానిపై దాడి చేస్తున్నారని విమర్శించారు.