Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైనవారిలో దాదాపు 100 శాతం మందికి టీకాలు
- దేశంలోనే మొదటి జిల్లా
కల్పెట్ట(కేరళ) : వ్యాక్సినేషన్లో కేరళలోని వాయనాడ్ జిల్లా రికార్డు సాధించింది. దేశంలోనే దాదాపు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసిన జిల్లాగా వాయనాడ్ నిలిచింది. జిల్లాలో అర్హులైన వారిలో దాదాపు 100 శాతం మందికి టీకా వేసినట్లు జిల్లా కలెక్టర్ అదీలా అబ్దుల్లా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వాయనాడ్‌లో జిల్లాలో 6,51,967 మంది వ్యాక్సిన్ అర్హులు ఉండగా, వారిలో ఆదివారం సాయంత్రం 7 గంటల సమయం వరకు 6,15,729 మంది మొదటి డోసు టీకా వేయించుకున్నారని తెలిపారు. ఇంకా 36,238 మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. వీరిలో 24,529 మంది గత మూడు నెలల లోపు కాలంలో కరోనా బారిన పడగా, ప్రస్తుతానికి వ్యాక్సిన్ వేయించుకునేందుకు అవకాశం లేదని, 1,243 మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు పలు కారణాలతో సిద్ధంగా లేరని, మిగతా వారు క్వారంటైన్లో ఉండడం లేదా వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. ఈ ఘనత సాధించడం చాలా కష్టతరమైనదని, అయితే సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని వైద్య సిబ్బంది, ఇతర అధికారుల పనితీరును ఆమె ప్రశంసించారు. ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు పర్యాటక శాఖ మంత్రి మహ్మద్ రియాజ్ నుంచి మద్దతు లభించిందని కలెక్టర్ అదీలా పేర్కొన్నారు. ప్రభుత్వం తరపునే 96 శాతం మంది వ్యాక్సిన్ ఇచ్చామని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి జనాభా పరంగా చిన్న జిల్లా అనేది కారణం కాదని, దేశంలో వాయనాడ్ కంటే ఇంకా అనేక చిన్న జిల్లాలు ఉన్నాయని పేర్కొన్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ జిల్లాల్లో పర్యాటక రంగ మళ్లీ అభివృద్ధి బాటలో పయనించేందుకు సహకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మొదటి తీసుకున్న వారిలో 2,13,277 మంది రెండో డోసు కూడా వేయించుకున్నారని జిల్లా వైద్యాధి కారి రేణుక తెలిపారు. అలాగే, కేరళలో మరొక జిల్లా పథనంథిట్టలో 60 ఏళ్ల దాటిన వారందరికీ దాదాపుగా టీకాలు వేశారు.