Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అట్టడుగువర్గాల ప్రజలకు అందని సేవలు
- 'ప్రయివేటు' లబ్ది కోసమే కేంద్రం తాపత్రయం
- ప్రభుత్వాస్పత్రులపై భారం : నిపుణులు, విశ్లేషకులు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) దేశంలోని పేద ప్రజలకు ఆశించినస్థాయిలో ఆరోగ్య సేవలను అందించడం లేదు. ముఖ్యంగా, ఈ పథకం కింద ప్రయివేటు ఆస్పత్రులు మాత్రం అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలను కనీసం చూడటం లేదు. పేరుకే పథకం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదని వైద్య, ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులకు లబ్ది చేకూర్చేలా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఫలితంగా దీని భారం ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్పత్రులపై పడుతున్నదని ఆరోపించారు.ఆరోగ్యశాఖలో 'ప్రయివేటు' భాగస్వామ్యంపై మోడీ ప్రభుత్వం చాలా ఉత్సాహం చూపిస్తున్నదనీ ఆరోగ్య నిపుణులు, విశ్లేషకులు తెలిపారు. ఇందులో భాగంగానే పీఎం-జేఏవై లో ప్రయివేటు ఆస్పత్రులకు చోటు కల్పించిందని చెప్పారు. 2018లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే, ఈ పథకం కింద ప్రయివేటు రంగంలోని ఆస్పత్రుల్లో చేరినవారి సమాచారాన్ని పరిశీలిస్తే.. పేదలు, అట్టడుగు వర్గాల వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ముఖ్యంగా, ఈ వర్గం ప్రజల కోసమే ఉద్దేశించిన ఈ పథకం అసలు లక్ష్యాలను చేరుకోలేదనీ, ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు.ఆయా సందర్భాలలో పార్లమెంటులో కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం.. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పీఎం-జేఏవై కింద మొత్తం ప్రయివేటు ఆస్పత్రులలో నమోదైన అడ్మిషన్లలో దళితులు కేవలం నాలుగు శాతమే ఉన్నారు. అంటే 4.70 లక్షల మంది. గిరిజనుల శాతం 1.6 శాతంగా (1.92 లక్షల మంది) ఉన్నది. అంటే ఈ సంఖ్య మొత్తం 5.6 శాతమే (6.62 లక్షలు) కావడం ఆందోళన కరమనీ నిపుణులు చెప్పారు. పీఎం-జేఏవై కింద దేశవ్యాప్తంగా దళితులలో 19.7 శాతం మంది అర్హులు. ఇది గిరిజనుల విషయంలో 15.4 శాతంగా ఉన్నదని విశ్లేషకులు ప్రభుత్వ గణాంకాలను ఉటంకించారు. నేషనల్ హెల్త్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏ) సమాచారం ప్రకారం.. 72 శాతానికి పైగా ఆస్పత్రులు యూపీ, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక వంటి ఏడు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ భాగం ఇప్పటికే పీఎంజేఏవై కి ముంద నుంచే అమలులో ఉన్న దీర్ఘకాలిక రాష్ట్ర బీమా పథకాలను కలిగి ఉన్నాయని విశ్లేషకులు గుర్తు చేశారు. ప్రయివేట ఆస్పత్రులు పేదలకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను అందించడంలో అంతగా ఆసక్తిని చూపించవనీ, వాటి దృష్టంతా పట్టణ ప్రజల పైనే ఉంటాయని తెలిపారు.