Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరల పెరుగుదలతో భారంగా సిలిండర్ల రీఫిల్
- బెంగాల్లో ఏకంగా 50 శాతం తగ్గిన వాడకం
కోల్కతా:దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ (సిలిండర్ గ్యాస్) కనెక్షన్లను అందించే పథకం 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' రెండో దశ ఇటీవల ప్రారంభమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్లో ప్రారంభించిన 'ఉజ్వల' ను మళ్లీ 2022 ఎన్నికల ముందు అదే యూపీలో ఉజ్వల 2.0ను ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనితో వలస కార్మిక, దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు పెద్దమొత్తంలో ప్రయోజాలు కలుగుతాయని పేర్కొన్నారు. అయితే, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. ఈ పథకాన్ని ఉపయోగించుకునే వారి సంఖ్య చాలా రాష్ట్రాల్లో తగ్గిపోతున్నది. మరీ ముఖ్యంగా బెంగాల్ ఉజ్వలను ఉపయోగించుకునే కుటుంబాల సంఖ్య దాదాపు 50 శాతం పడిపోయిందని నివేదికలు పేర్కొంటున్నాయి.గతేడాది (2020) ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ఉజ్వల పథకం కింద ఉన్న కుటుంబాలకు 1.56 కోట్ల గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయబడ్డాయి. ఇక ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో వీటికి డిమాండ్ లేకుండా పోయింది. కేవలం 75 సిలిండర్లు మాత్రమే డెలివరీ చేయబడ్డాయి.
''వంట గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్కొ సిలిండర్ రీఫిల్ ధర రూ.861. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ధరలు పెంచడం ఉజ్వలలో కొనసాగుతున్న పేద కుటుంబాలకు రీఫిల్ చేసుకోవడం సాధ్యం కాదు'' అని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, ఉజ్వల స్కీమ్ కింద పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వడంతో పాటు ప్రెజర్ రెగ్యులేటర్, మొదటిసారి ఫిల్ చేసిన గ్యాస్ సిలిండర్ అందిస్తున్నప్పటికీ.. రీఫిల్ ధరలు అధికంగా ఉండటం వారికి భారంగా మారింది. గతేడాది విధించిన లాక్డౌన్ సమయంలో ఉజ్వల కింద ఉన్నవారికి ప్రభుత్వం మూడు నెలల పాటు ఉచిత సిలిండర్లు అందిస్తామని ప్రకటించిన క్రమంలో డిమాండ్ భాగా పెరిగింది. కానీ మూడు నెలల తర్వాత రీఫిల్స్ గణనీయంగా పడిపోయాయి.
''ప్రస్తుతం కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగులేవు. వంటగ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. రీఫిల్ చేయడానికి అంత డబ్బులేదు. దీంతో వంటచేసుకోవడానికి పాత పద్దతినే అనుసరిస్తున్నాం. సమీప అడవిలోకి వెళ్లి కట్టెలు సేకరించుకోని.. వంట చేసుకోవడానికి వాడుకుంటున్నాం'' అని ఉజ్వల లబ్దిదారుల్లో ఒకరైన సుభాష్ మహతో అన్నారు. 'జూన్ నుంచి ఒక్క వంటగ్యాస్ సిలిండర్ కూడా రీఫిల్ చేయించుకోలేదు. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులం స్థానికంగా కట్టెలు తెచ్చుకుని వంట వండటానికి ఉపయోగిస్తున్నాం. వంట చేస్తుండగా.. పొగకారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం'' అని మరో లబ్దిదారు కుటుంబం పేర్కొంది.