Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెగసస్ పై నిపుణుల కమిటీని ఏర్పాటుచేస్తామన్న కేంద్రం
న్యూఢిల్లీ: పెగాసస్‌పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పెగాసస్ గూఢచర్యం ఆరోపణలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే, పెగాసస్ ఆరోపణల్లో వాస్తవం లేదనీ, ప్రతిపక్షాలు, జర్నలిస్టుల ఆరోపణలను తోసిపుచ్చింది. 'పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణలను కేంద్రం తిరస్కరిస్తోంది. దానిపై వెలువడిన కథనాలు ఊహాజనితమైనవి. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. స్వార్థ ప్రయోజనంతో వ్యాప్తి చేసే ఇలాంటి కథనాలపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది' అని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.కాగా, ఇటీవల పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు పెగాసస్ వ్యవహారంపై సంచలన కథనాలు వెలువడ్డాయి. ఈ స్పైవేర్‌తో దేశంలోని రాజకీయ నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టుల పై నిఘా ఉంచారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే పెగాసస్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వారిలో రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ రామ్, ఆసియానెట్ వ్యవస్థాపకులు శశికుమార్, ఎడిటర్స్ డిల్డ్ ఆఫ్ ఇండియా, జర్నలిస్టులు పరంజోరు గుహా ఠాకూర్త, ఎస్ఎన్ఎం అబ్ది, ప్రేమ్ శంకర్జా, రూపేష్ కుమార్ సింగ్, ఇస్పా శతాక్షి, న్యాయవాది ఎంఎల్ శర్మ, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాలు ఉన్నారు.ఇదిలా ఉండగా, ట్రైబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ఏడాదిగా చెప్పిందే చెబుతోంది తప్ప ఆచరణ లేదని సీరియస్ అయ్యింది. దీనిపై మరో 2 వారాల గడువును సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. అయితే ఇదే చివరి అవకాశం.. మళ్లీ గడువు ఇవ్వడం కుదరదనీ, 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.