Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆజాది సంగ్రామ్ దివస్ భారీ స్పందన
- దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు భాగస్వామ్యం
- లభించిన అంతర్జాతీయ సంఘీభావం
- రైతుల ప్రయోజనాలు కాపాడటంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫల్ణం ఎస్కేఎం
న్యూఢిల్లీ : 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహించిన ''కిసాన్ మజ్దూర్ ఆజాది సంగ్రామ్ దివస్ (తిరంగా మార్చ్)''తో రైతుల్లో కొత్త ఊపు, ఉత్సహం వచ్చిందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. ఎస్కేఎం ఇచ్చిన తిరంగా మార్చ్ పిలుపునకు భారీ స్పందన లభించిందని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఎస్కేఎం ప్రకటన విడుదల చేసింది. రైతులు, కార్మికులు తిరంగా యాత్రలతో పాల్గొన్నారనీ, ముందుగానే నిర్ణయించిన మార్గాల ద్వారా వివిధ ప్రాంతాల్లో తిరంగా మార్చ్‌లు జరిగాయని తెలిపింది. హర్యానా, పంజాబ్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లో వివిధ ప్రదేశాలలో మహిళా రైతులు అగ్రభాగన ఉన్నారని పేర్కొంది. ధన్సా, పల్వాల్, ఘాజీపూర్, షాజహాన్‌పూర్, సింఘూ, టిక్రీలతో సహా రైతుల ఆందోళన ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే అనేక నెలలుగా వివిధ టోల్ ప్లాజాల వద్ద నిరసన తెలిపే రైతులు ఆజాది సంగ్రామ్ దివస్ నిర్వహించారు. కొన్ని ప్రదేశాల్లో రైతుల తిరంగా మార్చ్‌లను కొనసాగించడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుమతించలేదని ఎస్కేఎం పేర్కొంది.
స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ కనిపించని విధంగా అత్యంత ఉత్సాహంతో ''కిసాన్ మజ్దూర్ ఆజాది సంగ్రామ్ దివస్''ను నిర్వహించడం గమనార్హమని ఎస్కేఎం తెలిపింది. వేలాది మంది రైతులు వాహనాలతో వందలాది కిలోమీటర్ల మేర వివిధ ప్రదేశాల్లో తిరంగా మార్చ్‌ల్లో కదం తొక్కారు. వ్యవసాయ క్షేత్రాలు, పట్టణ కేంద్రాల చౌక్‌ల్లో రైతులు, ఇతర సాధారణ పౌరులు నాయకత్వం వహిస్తూ ప్రజలందరు అనుభవించాల్సిన నిజమైన స్వేచ్ఛ కోసం, ప్రత్యేకించి అత్యంత అట్టడుగున ఉన్న వ్యక్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చారని ఎస్కేఎం పేర్కొంది.స్వాతంత్ర దినోత్సవం రోజు ఆందోళన చేస్తున్న రైతులకు అంతర్జాతీయ మద్దతు,సంఘీభావం లభించిందని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవాస భారతీయులు కార్యక్రమాలు నిర్వహిం చారని తెలిపింది. ఇందులో వాంకోవర్, లండన్, శాన్ జోస్ (యూఎస్ఎ), సీటెల్, టొరంటో, వియన్నా మొదలైనవి నగరాల్లో సంఘీభావ కార్యక్రమాలు జరిగాయని పేర్కొంది.
సరిహద్దులకు చేరుకుంటున్న రైతన్నలు
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. సోమవారం నాటికి రైతు ఉద్యమం 263రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన జోరు వర్షంలో కూడా కొనసాగుతోంది. కొనసాగుతున్న నిరసనలను బలోపేతం చేయడానికి, సుదూర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రైతులు ఆందోళన ప్రాంతాలకు చేరుతున్నారు. తమిళనాడు నుంచి వందలాది మంది రైతులు సింఘూ సరిహద్దుకు చేరుకున్నారు. ఘాజీపూర్ బోర్డర్‌కు కర్నాటకకు చెందిన రైతుల బృందం చేరుకుంది. మరోవైపు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు, బీజేపీ, దాని అనుబంధ పార్టీల నేతల బహిష్కరణలు కొనసాగుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడిక్కడే ఆందోళనలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని జేజేపీ ఎమ్మెల్యే జోగి రామ్ సిహాగ్ను హిసార్‌లోని గ్రామాలకు వెళ్లినప్పుడు స్థానికలు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. ఒక గ్రామం (సిర్సౌడ్) నుంచి బయటపడిన తరువాత ఎమ్మెల్యే రెండో గ్రామంలో (బీచ్పాడి) ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అక్కడ అతను స్థానిక రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, రైతు వ్యతిరేక చర్యలతో మోడీ సర్కార్ రైతులను మోసం చేస్తుందని ఎస్కేఎం విమర్శించింది.
26న జాతీయ కన్వెన్షన్
లక్షలాది మంది రైతుల తొమ్మిది నెలల చారిత్రాత్మక, నిరంతర శాంతియుత ఆందోళనలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆగస్టు 26న జాతీయ సమావేశాన్ని ఏర్పాటుకు ఎస్కేఎంనిర్ణయించింది. ఈ అఖిల భారత కన్వెన్షన్‌కు వందలాది మంది రైతుల సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యం అవుతారనీ, స్థానిక, ప్రాంతీయ, జాతీయంగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగస్వామ్యం అయిన రైతు ప్రతినిధులు కన్వెన్షన్‌లో పాల్గొంటారని ఎస్కేఎం తెలిపింది. 17న నర్మదా బచావో ఆందోళన్‌కు 36 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ''నర్మద కిసాన్ మజ్దూర్ జన్ సంసద్'' బద్వానీలో నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు పాల్గొనే ఈ కార్యక్రమంలో అనేక ఎస్కేఎం నాయకులు పాల్గొంటారు.