Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- ట్రిబ్యునల్స్‌లో ఖాళీలను భర్తీ చేయడంలో విఫలం
- ప్రభుత్వం అలసత్వం వల్ల అవి నిర్వీర్యం
- వాటి ఏర్పాటుపై చెప్పిందే చెబుతున్నారు
- ఇదే చివరి అవకాశం.. మరోసారి గడువు ఇవ్వం
- పది రోజుల్లోగా నియామకాలు చేపట్టాలి : అత్యున్నత న్యాయస్థానం ఆదేశం
న్యూఢిల్లీ : మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులో కోర్టు కొట్టివేసిన నిబంధనలనే తిరిగి అమలుచేస్తూ గత వారం పార్లమెంట్ ఆమోదించిన ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు పైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ట్రిబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామ కాల్లో జరుగుతున్న జాప్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం పై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ట్రిబ్యునళ్ల పదవుల నియామకాల్లో కేంద్రం ఏడాదిగా చెప్పిందే చెబుతున్నది తప్ప ఆచరణలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. జబల్పూర్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ అందుబాటులో లేనందున, జబల్పూర్ డబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) అధికార పరిధిని డీఆర్టీ లక్నోకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ చెల్లుబాటును సవాలు చేస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్దాహ బోస్ నేతత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. పది రోజుల్లోగా ట్రిబ్యునళ్లలో నియామకాలు చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. నియామకాల్లో ప్రభుత్వం అలసత్వం కారణంగా అనేక ట్రిబ్యునల్స్ నిర్వీర్యం అయ్యే దశలో ఉన్నాయని పేర్కొంది. ట్రిబ్యునల్స్‌లో ఖాళీలను భర్తీ చేయడంలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం మందలించింది. ట్రిబ్యునళ్లు ఏర్పాటుచేసేందుకు ఎందుకింత ఆలోచిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం ఆదేశాలను అమలు చేస్తామని గత విచారణ సమయంలో చెప్పిన కేంద్రం ఎందుకు అమలుచేయలేదని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది.
ఇందుకు ఆయన స్పందిస్తూ.. ట్రిబ్యునళ్ల ఏర్పాటు, ఖాళీల నియామకానికి రెండు వారాల గడువు ఇవ్వాలని కోరారు. దీంతో అసహనానికి గురైన ధర్మాసనం.. ''ఇదే చివరి అవకాశం. మరోసారి సమయం ఇవ్వడం కుదరదు. పది రోజుల్లోగా నియామకాలు చేపట్టండి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి'' అని హెచ్చరించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది.మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, పార్లమెంట్లో సరైన చర్చ లేకుండా ట్రిబ్యునల్ సభ్యుల సర్వీస్ పరిస్థితులకు సంబంధించి తమ చేతుల్లోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో బిల్లు తీసుకువచ్చిందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ ఆర్డినెన్సును కోర్టు నిలిపివేసిన తరువాత పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. పార్లమెంటులో చట్టాలు చేసే ముందు చర్చ తప్పదని కోర్టు పేర్కొంది. ''దయచేసి ఈ చర్చను మాకు చూపించండి. ఇది తీవ్రమైన సమస్య'' అని కోర్టు పేర్కొంది. అసలు ట్రిబ్యునళ్లను కొనసాగిస్తారా? లేదా మూసివేస్తారా? అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సూచించింది. ''ఇవన్నీ ఉన్నప్పటికీ, రెండు రోజుల్లో మళ్లీ ఆర్డినెన్స్ చేశారు. పార్లమెంటులో చేసిన చర్చను నేను చూడలేదు. చట్టాలను రూపొందించటం చట్టసభల అధికారం. కానీ ఈ చట్టాన్ని రూపొందించడానికి గల కారణాలు మనం తప్పక తెలుసుకోవాలి'' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. చెల్లుబాటు కాని నిబంధనలతో బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రశ్నించారు. మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన కారణాల ప్రకటనను కోర్టుకు చూపించగలరా? అని ప్రశ్నించారు. ''ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. మంత్రిత్వ శాఖ తప్పని సరిగా కారణాలతో కూడిన ఒక నోట్‌ను సిద్ధం చేసి ఉంటుంది. ఆ నోట్‌ను మీరు మాకు చూపించగలరా?'' అని సీజేఐ ఎన్వి రమణ ప్రశ్నించారు. ఖాళీలు భర్తీ చేయకపోతే ట్రిబ్యునల్స్ నిర్వీర్యమవుతాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొ న్నారు. ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు ఈ నెల 3న లోక్‌సభలో, న రాజ్యసభలో ఆమోదం పొందింది.