Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోహతక్ : రాష్ట్ర ఆరోగ్య విశ్వ విద్యాలయంతో అన్ని విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని ఒక కామన్ క్యాడర్‌గా పేర్కొంటూ హర్యానా ప్రభుత్వ ఆన్లైన్ ట్రాన్సఫర్ పాలసీని సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చించినట్లు సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర సింగ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు ప్రత్యేకంగా హజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని అంతం చేయడమే కాకుండా, రాష్ట్రంలో ఉన్నత విద్య, పరిశోధనలను నాశనం చేస్తుందని సురేంద్ర సింగ్ తన ప్రకటనలో విమర్శించారు. అసెంబ్లీలో అమోదించిన ప్రత్యేక చట్టం ద్వారా ప్రతీ యూనివర్శిటీని స్థాపించారని, వీటికి ప్రత్యేక చట్టాలు, శాసనాలు, కార్యనిర్వహక కౌన్సిల్స్ ఉన్నాయనీ, ఈ నిర్మాణాన్ని ఒక ఉత్తర్వుతో రద్దు చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని విమర్శించారు. ఈ యూనివర్సిటీలన్నింటికీ ఒక కామన్ క్యాడర్‌ను సృష్టించడం యూనివర్సిటీల భావనకే విరుద్ధమని అన్నారు. నిర్దిష్ట విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ఉద్యోగులనింతా ఒక సామూహిక క్యాడర్‌గా మార్చడం పూర్తిగా తప్పని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా అన్ని విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది చేస్తున్న ఐక్య ఉద్యమానికి సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ పాలసీని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమానికి విద్యతో భాగస్వామ్యం ఉన్న అని సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రగతిశీలురు, మేధావులు, సాధారణ ప్రజలు మద్దతు ఇవ్వాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది.