Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు ఆవరణలో భద్రత పెంచండి : కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు
- అది మావల్ల కాదు..రాష్ట్రాలే చూసుకోవాలి : కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : న్యాయమూర్తులకు రక్షణ కల్పించాలని, కోర్టు ఆవరణలో భద్రత ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. జార్ఖాండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఒక న్యాయమూర్తిని హత్యచేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.న్యాయమూర్తులకు రక్షణ కల్పించే అంశం రాష్ట్రాలకే వదిలేయలేమని,కేంద్రం ప్రత్యేకంగా రక్షణ కల్పించాలని కోరింది. అయితే ఈ సూచనను కేంద్రం తిరస్కరించింది. న్యాయమూ ర్తుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టలేమని, అదంతా రాష్ట్రాలే చూసుకోవాలని చెప్పింది.కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జడ్జీలకు రక్షణ కల్పించే అంశం స్థానిక పోలీసు యంత్రాంగానికి అప్పజెప్పటమే సరైనదని ఆయన తెలిపారు. నేరస్థులపై సమాచారం,నిఘా కార్యకలాపాలన్నీ రాష్ట్రాలే చూసుకుంటు న్నాయి, కాబట్టి వారే జడ్జీలకు రక్షణ కల్పించగలరని కోర్టుకు తెలిపారు. అదెలాగో మీరే చెప్పండని ధర్మాసనం తుషార్ మెహతాను సూచించగా, ''ఈ అంశంపై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని ధర్మాసనం పరిశీలించవచ్చు''నని చెప్పారు. దీనికి జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ..''మార్గదర్శకాలు, నిబంధనావళి అన్నీ బాగానే ఉన్నాయి. వాటిని పాటిస్తున్నారా? లేదా?అన్నదే ఇక్కడ ప్రశ్న. అలా పాటించకపోతే..అదనంగా కేంద్రం ఏమైనా చేయగలదా? జడ్జీలకు, న్యాయవాదులకు రక్షణ కల్పించగలదా?అనేది కోరుతున్నాం. మీరు కేంద్రం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. డీసీపీ స్థాయి పోలీస్ అధికారిని ప్రశ్నించగలరు, వివిధ నివేదికలు తెప్పించుకుంటారు...కదా?'' అని అన్నారు.న్యాయమూర్తులకు కల్పిస్తున్న రక్షణ, కోర్టు ఆవరణలో భద్రతా చర్యలపై సవివరమైన నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్రాలను సుప్రీం ఆదేశించింది.విచారణను 10రోజులకు వాయిదా వేసింది. న్యాయమూర్తులపై దాడి ఘటనలు వరుసగా జరుగుతున్నా, రాష్ట్రాలు సరైన చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆవరణలో సీసీటీవీల ఏర్పాటు నేరస్థులను పట్టించగలదేగానీ, న్యాయమూర్తులపై దాడిని అడ్డుకోలేదు కదా? అని సుప్రీం అభిప్రాయపడింది.