Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 26, 27 తేదీల్లో సమావేశాలు
- ఉత్తరాఖండ్‌కు విస్తరించిన 'బీజేపీ నేతల బహిష్కరణ'
- ముజఫర్‌నగర్ ర్యాలీపై ఏఐకేఎస్ నేతలు చర్చలు
న్యూఢిల్లీ: మూడు నూతననల్ల చట్టాలకు వ్యతిరేకంగా, కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపడుతున్న ఆందోళనకు తొమ్మిది నెలల కావస్తున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు జాతీయ సమావేశాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిర్ణయించింది. ఇందులో రైతులు, ప్రజా సంఘాలు నేతలు భాగస్వామ్యం కానున్నారు. నేషనల్ కన్వెన్షన్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అహంకారపూరిత, అనాలోచిత, అప్రజాస్వామిక వైఖరిపై రైతుల ఉద్యమాల ప్రతిస్పందన, వారి డిమాండ్లపై చర్చలు జరుగుతాయి. రైతు ఉద్యమంలో భవిష్యత్ కర్తవ్యాలు సంయుక్తంగా నిర్ణయిస్తారు. ఈ చారిత్రాత్మక రైతుల ఉద్యమం కొన్ని రాష్ట్రాలకు పరిమితమైందని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసిందని, కానీ దాన్ని తలదన్నెలా రైతుల ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందని ఎస్కేఎం పేర్కొంది. ప్రభుత్వం చేసే అబద్దాల ప్యాకేజీలు, దేశ ఆహార భద్రత అంశాలపై కూడా చర్చ జరుగుతుంది.
ఉత్తరాఖండ్‌కు సెగ..
దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. మంగళవారం నాటికి రైతు ఉద్యమం 264వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన జోరు వర్షంలో కూడా కొనసాగుతోంది. కొనసాగుతున్న నిరసనలను బలోపేతం చేయడానికి, సుదూర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రైతులు ఆందోళన ప్రాంతాలకు చేరుతున్నారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడిక్కడే ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ, దాని అనుబంధ పార్టీల నేతల బహిష్కరణలు కొనసాగుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ తరువాత ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో కూడా బీజేపీ నాయకులు బహిష్కరణ ప్రారంభమైంది. రూర్కీ సమీపంలో బీజేపీ ఎంపీ అజరు భట్ రైతుల ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. రైతులు నల్ల జెండాలతో తమ నిరసన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇటువంటి నిరసనలు తీవ్రతరం చేస్తామని ఎస్కేఎం పేర్కొంది.
బీజేపీ కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక చట్టాలు, విధానాలతో రైతులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నందున, ఆ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్లినా నిరసనలను ఎదుర్కొంటారని హెచ్చరించింది. బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు హర్యానాలో తీవ్రమయ్యాయి. పీప్లి సమీపంలో ఎంపీ నాయబ్ సింగ్ సైనీ, మంత్రి సందీప్ సింగ్, ఎమ్మెల్యే సుభాష్ సుధలను రైతులు బహిష్కరించారు. నల్ల జెండాలతో తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దీంతో పోలీసు సాయంతో బీజేపీ నాయకులు అక్కడి నుంచి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. బీజేపీ తన రైతు వ్యతిరేక వైఖరిని విరమించుకోవాలని రైతు నేతలు పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు మిషన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్‌లో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ముజఫర్ నగర్లో నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి రైతుల సమీకరణపై ఏఐకేఎస్ నేతలు చర్చలు జరిపారు. ఈమేరకు మంగళవారం బులంద్‌షహర్‌లో ఆ సంఘం కార్యాలయంలో ఏఐకేఎస్ నేతలు సమావేశం అయ్యారు. ఇందులో జాతీయ, ఉత్తరప్రదేశ్ నేతలు పాల్గొన్నారు. పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్‌లో సెప్టెంబర్ 5న జరిగే ఎస్కేఎం భారీ బహిరంగ సభ కోసం వేలాది మంది రైతులను ఎఐకెఎస్ సమీకరించాలని నిర్ణయించారు. బీజేపీని ఓడించడానికి 'మిషన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్'ను ఎస్కేఎం పిలుపు నిచ్చింది. ఈ రెండు రాష్ట్రాలలోని ప్రభుత్వాల రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను, బీజేపీ మతపరమైన, నిరంకుశ కుట్రలను ఓడించాలని ఏఐకేఎస్ నేతలు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావాలే, సహాయ కార్యదర్శులు విజూ కృష్ణన్, బాదల్ సరోజ్, కోశాధికారి పి. కృష్ణప్రసాద్, ఏఐకేఎస్ యూపీ ఉపాధ్యక్షుడు డి.పి సింగ్, సహాయ కార్యదర్శి చంద్రపాల్ సింగ్, నేతలు జాగ్వీర్ భాటి, మూల్‌చంద్ సింగ్ పాల్గొన్నారు.